Telugu Global
Sports

128 ఏళ్ల తర్వాత క్రికెట్‌కు ఒలింపిక్స్ యోగం!

జెంటిల్మెన్ గేమ్ క్రికెట్ దశ తిరిగింది. 128 సంవత్సరాల సుదీర్ఘ విరామానంతరం ఒలింపిక్స్ యోగం పట్టింది.

128 ఏళ్ల తర్వాత క్రికెట్‌కు ఒలింపిక్స్ యోగం!
X

క్రికెట్‌ అభిమానులు ఎన్నో ఏళ్లుగా.. ఎంతగానో ఎదురు చూస్తున్న చారిత్రక ఘట్టానికి ముహూర్తం ఖరారయ్యింది. నాలుగేళ్లకు ఓసారి జరిగే విశ్వక్రీడావేదిక ఒలింపిక్స్ లో పతకం అంశంగా క్రికెట్ ను చేర్చడానికి అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. ముంబైలోని జియా వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ వేదిక ఈరోజు జరుగనున్న అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ కార్యనిర్వాహక మండలి సమావేశంలో ఒలింపిక్ సమాఖ్య అధ్యక్షుడు థామస్ బాక్ అధికారికంగా ఓ ప్రకటన చేయనున్నారు.

1900 ఒలింపిక్స్ లో పతకం అంశంగా..

123 సంవత్సరాల క్రితం పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ క్రీడాంశాలలో భాగంగా తొలిసారిగా క్రికెట్ ను నిర్వహించారు. వివిధ కారణాలతో ఆ తర్వాత నుంచి ఒలింపిక్‌ ప్రధాన క్రీడాంశాలలో క్రికెట్ కు చోటే లేకుండా పోయింది. గత శతాబ్దకాలంగా ఒలింపిక్స్ అంశాలలో క్రికెట్ ను ఓ మెడల్ అంశంగా చేర్చడానికి చేసిన ప్రయత్నాలు ఏమాత్రం ఫలించలేదు. అయితే.. ప్రపంచ క్రికెట్ కు మూలస్తంభం లాంటి భారత్ సైతం క్రికెట్ ను ఒలింపిక్స్ లో చేర్చడానికి సముఖంగా ఉండటంతో మార్గం సుగమమయ్యింది.

విశ్వవ్యాప్త క్రీడ క్రికెట్..

ప్రపంచీకరణ పుణ్యమా అంటూ క్రికెట్ జనరంజక క్రీడగా, ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులున్న క్రీడల్లో ఒకటిగా నిలిచింది. పైగా ఈ భూఖండంలోని 80కి పైగా దేశాలకు క్రికెట్ విస్తరించడంతో.. అంతర్జాతీయ ఒలింపిక్ మండలి సైతం సానుకూలంగా స్పందించింది. లాస్ ఏంజెలిస్ వేదికగా 2028లో జరిగే ఒలింపిక్స్ లో సరికొత్తగా ఐదు క్రీడలకు ప్రవేశం కల్పించాలని ఐవోసీ నిర్ణయించింది. అందులో క్రికెట్ కు సైతం చోటు దక్కిందని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ స్పోర్ట్స్ డైరెక్టర్ కిట్ మెక్ కోనెల్ ప్రకటించారు. 1900 పారిస్ ఒలింపిక్స్ లో చివరిసారిగా నిర్వహించిన క్రికెట్ ను ఒలింపిక్స్ అంశాలలో ఒకటిగా తిరిగి నిర్వహించడానికి సిఫారసు చేసినట్లు వివరించారు.

ఐసీసీ చైర్మన్ సంతోషం..

క్రికెట్ ను ఒలింపిక్ అంశంగా గుర్తించి.. 2028 ఒలింపిక్స్ లో తిరిగి ప్రవేశపెట్టాలని నిర్ణయించడం పట్ల అంతర్జాతీయ క్రికెట్ మండలి చైర్మన్ గ్రెగ్ బార్క్ లే హర్షం వ్యక్తం చేశారు. ముంబై వేదికగా శుక్రవారం ప్రారంభమయ్యే అంతర్జాతీయ ఒలింపిక్ మండలి 141వ కార్యవర్గ సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. 1983లో న్యూఢిల్లీ వేదికగా ఐవోసీ 86వ కార్యవర్గ సమావేశం జరిగిన నాలుగు దశాబ్దాల విరామం తరువాత 2023 అక్టోబర్ 14న 141వ కార్యవర్గ సమావేశం జరుగనుంది. ఈ సమావేశాన్ని భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు.

బీసీసీఐ గ్రీన్ సిగ్నల్..

ఒలింపిక్స్‌ క్రీడాంశంగా క్రికెట్ ను తిరిగి నిర్వహించడానికి గత కొద్ది సంవత్సరాలుగా ఆమోదం తెలుపని బీసీసీఐ ఎట్టకేలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఒలింపిక్స్‌లో క్రికెట్‌కు చోటు కల్పించడంపై బీసీసీఐ ఇన్నాళ్లూ వ్యతిరేకత వ్యక్తం చేస్తూ వచ్చింది. అయితే తాజాగా బీసీసీఐ అందుకు అంగీకరించడంతో 2028 లాస్ ఏంజిల్స్‌ ఒలింపిక్స్‌లో పురుషుల క్రికెట్‌తో పాటు మహిళల క్రికెట్‌ను విశ్వవేదికపై వీక్షించేందుకు లైన్‌ క్లియర్‌ అయ్యింది. ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను ఓ అంశంగా చేరిస్తే.. ఇండియ‌న్ ఒలింపిక్ క‌మిటీకి ఎక్క‌డ జ‌వాబుదారీగా ఉండాల్సి వ‌స్తుందోనన్న ఆందోళ‌న‌ బీసీసీఐలో ఉండేది. అయితే ప్రస్తుతం బోర్డు తీరులో మార్పు రావడంతో తాజాగా ఒలింపిక్స్‌లో క్రికెట్‌ అంశానికి సానుకూలంగా స్పందించింది. ఐసీసీతో జ‌రిగిన స‌మావేశంలో బీసీసీఐ ఈ అంశంపై సమ్మతిని వ్యక్తం చేసినట్లు బోర్డు కోశాధికారి అరుణ్ సింగ్ ధుమాల్ గతంలోనే వెల్లడించారు. అయితే ఈ అంశానికి సంబంధించిన విధివిధానాల రూపకల్పన చేయాల్సి ఉందని ఆయన తెలిపారు. కాగా, చివరిసారిగా 1900 పారిస్‌ ఒలింపిక్స్‌లో క్రికెట్‌కు ప్రాతినిధ్యం దక్కింది. అప్పటి నుంచి వివిధ కారణాల చేత విశ్వక్రీడల వేదికపై క్రికెట్‌ను ప్రాతినిధ్యం లభించలేదు. బీసీసీఐ తమ స్వ‌యంప్రతిపత్తిని కోల్పోతామేమోనన్న భయంతో ఇన్నాళ్లూ ఈ అంశాన్ని పక్కనపెడుతూ వచ్చింది. ఇంగ్లండ్ లో పుట్టి భారత గడ్డపై అంతైఇంతై అంతింతై అన్నట్లుగా పెరిగిపోయిన క్రికెట్ ను ఇప్పటికే కామన్వెల్త్ గేమ్స్, ఆసియాక్రీడల్లో పతకం అంశంగా నిర్వహిస్తూ వస్తున్నారు.

1998 కామన్వెల్త్ గేమ్స్ తో పునరాగమనం..

మలేసియాలోని కౌలాలంపూర్ వేదికగా జరిగిన 1998 కామన్వెల్త్ గేమ్స్‌ లో ఓ క్రీడాంశంగా క్రికెట్ ను తొలిసారిగా నిర్వహించారు. ఆ క్రీడల్లో భారతజట్టు తరపున మాస్టర్ సచిన్, వీవీఎస్ లక్ష్మణ్, హర్భజన్ సింగ్, అనీల్ కుంబ్లే, ఎమ్మెస్కే ప్రసాద్, ఆస్ట్రేలియా తరపున స్టీవ్ వా, మార్క్ వా, టామ్ మూడీ, రికీ పాంటింగ్, ఆడం గిల్ క్రిస్ట్ లాంటి దిగ్గజ ఆటగాళ్లు పాల్గొన్నారు. గోల్డ్ మెడల్ సమరంలో షాన్ పోలాక్, హెర్షల్ గిబ్స్, జాక్ కాలిస్, మికయా ఎన్తినీ, మార్క్ బౌచర్ లాంటి హేమాహేమీలతో కూడిన దక్షిణాఫ్రికాజట్టు.. ఆస్ట్రేలియాపై విజయం సాధించింది. 4 వికెట్ల తేడాతో ఓడిన ఆస్ట్రేలియా రజత, న్యూజిలాండ్ కాంస్య పతకాలతో సరిపెట్టుకొన్నాయి. బర్మింగ్ హామ్ వేదికగా జరిగిన 2022 కామన్వెల్త్ గేమ్స్ లో మహిళలకు తొలిసారిగా ప్రవేశపెట్టిన క్రికెట్లో ఆస్ట్రేలియా స్వర్ణ, భారత్ రజత, న్యూజిలాండ్ కాంస్య పతకాలు సాధించాయి.

2010 ఆసియాక్రీడల్లో తొలిసారిగా క్రికెట్..

గాంగ్జు వేదికగా 2010లో జరిగిన ఆసియాక్రీడల్లో క్రికెట్ ను తొలిసారిగా పతకం అంశంగా ప్రవేశపెట్టారు. పురుషుల విభాగంలో బంగ్లాదేశ్ స్వర్ణ, ఆఫ్ఘనిస్థాన్ రజత, పాకిస్థాన్ కాంస్య పతకాలు గెలుచుకొన్నాయి. మహిళల విభాగంలో పాకిస్థాన్, బంగ్లాదేశ్, జపాన్ స్వర్ణ, రజత, కాంస్య పతకాలతో నిలిచాయి. 2014లో దక్షిణ కొరియాలోని ఇంచియోన్ వేదికగా జరిగిన ఆసియాక్రీడల్లో పురుషుల బంగారు పతకాన్ని శ్రీలంక, అఫ్ఘనిస్థాన్ రజత, బంగ్లాదేశ్ కాంస్య పతకాలను, మహిళల స్వర్ణాన్ని పాక్, బంగ్లాదేశ్ రజత,శ్రీలంక కాంస్యాలు సాధించాయి. కొద్దిరోజుల క్రితమే హాంగ్జు వేదికగా జరిగిన 19వ ఆసియాక్రీడల పురుషుల, మహిళల విభాగాలలో భారతజట్లే బంగారు విజేతలుగా నిలిచాయి. పురుషుల విభాగంలో అప్ఘనిస్థాన్ రజత, శ్రీలంక కాంస్య, మహిళల విభాగంలో శ్రీలంక రజత, బంగ్లాదేశ్ కాంస్య పతకాలు అందుకొన్నాయి.

First Published:  14 Oct 2023 8:15 AM IST
Next Story