Telugu Global
Sports

వన్డే ఓపెనర్ గా హిట్ మ్యాన్ సూపర్ హిట్!

భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఓ అరుదైన ఘనతను సాధించాడు. వన్డే ఓపెనర్ గా దశాబ్దకాలాన్ని అత్యంత విజయవంతంగా ముగించాడు.

Rohit Sharma to Hitman: A glorious decade
X

రోహిత్ శర్మ

భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఓ అరుదైన ఘనతను సాధించాడు. వన్డే ఓపెనర్ గా దశాబ్దకాలాన్ని అత్యంత విజయవంతంగా ముగించాడు.

రోహిత్ శర్మ...క్రికెట్ అభిమానులకు పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు. గత 15 సంవత్సరాలుగా భారత క్రికెట్ కు పలు రకాలుగా అసమానసేవలు అందిస్తున్న

మొనగాడు. మిడిలార్డర్ నుంచి ఓపెనర్ గా, ఓపెనర్ స్థానం నుంచి భారత కెప్టెన్ స్థాయికి ఎదిగిన రోహిత్ ..వన్జేలలో భారత ఓపెనర్ గా దశాబ్దకాలన్ని అత్యంత విజయవంతంగా పూర్తి చేయడం ద్వారా వారేవ్వా! అనిపించుకొన్నాడు.

2013 నుంచి 2023 వరకూ..

ముంబైలో ఓ తెలుగుమూలాలున్న దిగువ మధ్యతరగతిలో పుట్టి..జూనియర్ స్థాయిలోనే అత్యంత ప్రతిభావంతుడైన క్రికెటర్ గా గుర్తింపు పొందిన రోహిత్ శర్మ వయసుతో పాటు తన ప్రతిభను, స్థాయిని పెంచుకొంటూ వచ్చాడు.

2007 ప్రారంభ టీ-20 ప్రపంచకప్ లో భారత్ విజేతగా నిలువడంలో ప్రధానపాత్ర వహించిన ఆటగాళ్లలో ఒకడిగా గుర్తింపు సంపాదించాడు.

మిడిలార్డర్ బ్యాటర్ గా తన కెరియర్ ప్రారంభించిన రోహిత్ కు జింబాబ్వే పైన ఒకే సిరీస్ లో రెండుశతకాలు సాధించిన రికార్డు ఉంది. ఆ తర్వాత 18 మాసాలపాటు వరుసగా విఫలమవుతూ వచ్చాడు. 2011 ప్రపంచకప్ లో సైతం స్థాయికి తగ్గట్టు రాణించలేకపోయాడు.

ధోనీ సలహాతో..

రోహిత్ శర్మలోని అపారప్రతిభను గుర్తించిన అప్పటి కెప్టెన్ ధోనీ...ఓపెనర్ గా ఆడమంటూ సలహా ఇచ్చాడు. 2011 జనవరి లో దక్షిణాఫ్రికాతో జరిగిన మూడోవన్డేలో తొలిసారిగా ఓపెనర్ గా దిగినా 23 పరుగులకే అవుటయ్యాడు.

అయితే..2013 జనవరి 23న మొహాలీ వేదికగా ఇంగ్లండ్ తో జరిగిన వన్డే మ్యాచ్ లో రోహిత్ ఓపెనర్ గా 83 పరుగుల స్కోరుతో తన జైత్రయాత్ర మొదలుపెట్టాడు. ఆ తర్వాత నుంచి రోహిత్ మరి వెనుదిరిగి చూసింది లేదు.భారత్ తరపున వన్డేలలో పలు ప్రపంచ రికార్డులు నెలకొల్పాడు.

వన్డే క్రికెట్లో మూడు డబుల్ సెంచరీలు, వన్డే ప్రపంచకప్ లో ఐదు శతకాలు సాధించిన ఏకైక, తొలి ఓపెనర్ గా రోహిత్ ప్రపంచ రికార్డులు నెలకొల్పాడు. తన వన్డే కెరియర్ లో ప్రస్తుత న్యూజిలాండ్ సిరీస్ లోని రెండో ( రాయపూర్ ) వన్డే వరకూ 240 మ్యాచ్ లు ఆడి 9వేల 681 పరుగులు సాధించాడు. ఇందులో 29 సెంచరీలు, 48 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 264 పరుగులు అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించడంతో పాటు..వన్డే క్రికెట్ చరిత్రలోనే మూడుసార్లు ద్విశతకాలు బాదిన మొనగాడిగా నిలిచాడు. వన్డే క్రికెట్లో ఓపెనర్ గా రోహిత్ సగటు 48.65 గా ఉండటం ఓ రికార్డు.

గత ఏడాదికాలంలో స్థాయికి తగ్గట్టుగా ఆడటంలో విఫలమైన రోహిత్ 2023 సీజన్ గత ఐదు వన్డేలలో 83, 17, 42, 34 , 51 చొప్పున స్కోర్లు సాధించడం ద్వారా తిరిగి గాడిలో పడినట్లు కనిపిస్తున్నాడు. తనవైపు నుంచి ఓ భారీస్కోరు రావాల్సి ఉందని కూడా రోహిత్ అంటున్నాడు.

సిక్సర్ల కింగ్ రోహిత్...

దూకుడుగా ఆడే ఓపెనర్ కు రోహిత్ కు ప్రత్యేకస్థానం ఉంది. క్రీజులోకి దిగాడంటే చాలు..తొలిబంతి నుంచే ప్రత్యర్ధి బౌలర్లకు పుల్, కట్, హుక్, లాఫ్టెడ్ షాట్లతో విరుచుకు పడటంలో రోహిత్ తర్వాతే ఎవరైనా. తనదైన రోజున అందినబంతిని అందినట్లుగా బాదడంలో రోహిత్ కు రోహిత్ మాత్రమే సాటి.

మెల్బో్ర్న్, అహ్మదాబాద్ లాంటి ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియాలలో సైతం..అలవోకగా సిక్సర్లు కొట్టడంలో రోహిత్ స్టయిల్, రికార్డే వేరు. ఇప్పటి వరకూ ఆడిన 240 వన్డేలలో రోహిత్ 267 సిక్సర్లు బాదాడు. భారత క్రికెట్ చరిత్రలో ఇన్ని సిక్సర్లు బాదిన ఓపెనర్ గానీ, క్రికెటర్ గానీ వేరెవ్వరూ లేరు.

విరాట్ కొహ్లీ తర్వాత భారత కెప్టెన్ గా గతేడాదే క్రికెట్ మూడుఫార్మాట్లలో పగ్గాలు అందుకొన్నాడు.

హిట్ మ్యాన్ కు ద్రావిడ్ హ్యాట్సాఫ్...

రోహిత్ శర్మ 16 ఏళ్ల కుర్రాడిగా ఉన్నప్పుడే తనకు తెలుసని, అండర్ -19 స్థాయిలోనే రోహిత్ లోని అపారప్రతిభను తాను గమనించానని భారత ప్రధాన శిక్షకుడు రాహుల్ ద్రావిడ్ గుర్తు చేసుకొన్నారు. మిడిలార్డర్ నుంచి ఓపెనర్ గా మారటమే రోహిత్ శర్మ కెరియర్ ను మలుపు తిప్పిందని, తనలోని అసాధారణ ప్రతిభ, నైపుణ్యాలను రోహిత్ గత దశాబ్దకాలంలో పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోగలిగాడని ప్రశంసించారు.

క్రికెట్ మూడుఫార్మాట్లలోనూ రోహిత్ భారత క్రికెట్ కు చేసిన సేవలు అపురూపమైనవని ద్రావిడ్ కొనియాడారు. ఈ ఏడాది భారత్ వేదికగా ఐసీసీ వన్డే ప్రపంచ కప్ జరుగనున్న కారణంగానే రోహిత్, విరాట్ లాంటి సీనియర్ ఆటగాళ్లను టీ-20 ఫార్మాట్ కు దూరంగా ఉంచినట్లు ద్రావిడ్ తెలిపారు.

First Published:  24 Jan 2023 2:15 PM IST
Next Story