Telugu Global
Sports

బెన్ డన్...విశ్వవిజేత ఇంగ్లండ్!

2022 టీ-20 ప్రపంచకప్ టైటిల్ ను ఇంగ్లండ్ గెలుచుకొంది. మెల్బోర్న్ వేదికగా ముగిసిన లోస్కోరింగ్ ఫైనల్లో ఇంగ్లండ్ 5 వికెట్ల విజయంతో విజేతగా నిలిచింది. ఐసీసీ ట్రోఫీతో పాటు 13 కోట్ల రూపాయల ప్రైజ్ మనీ సొంతం చేసుకొంది.

బెన్ డన్...విశ్వవిజేత ఇంగ్లండ్!
X

బెన్ డన్...విశ్వవిజేత ఇంగ్లండ్!

2022 టీ-20 ప్రపంచకప్ టైటిల్ ను ఇంగ్లండ్ గెలుచుకొంది. మెల్బోర్న్ వేదికగా ముగిసిన లోస్కోరింగ్ ఫైనల్లో ఇంగ్లండ్ 5 వికెట్ల విజయంతో విజేతగా నిలిచింది. ఐసీసీ ట్రోఫీతో పాటు 13 కోట్ల రూపాయల ప్రైజ్ మనీ సొంతం చేసుకొంది...

ప్రపంచ రెండోర్యాంకర్ ఇంగ్లండ్ పుష్కరకాల విరామం తర్వాత మరోసారి టీ-20 ప్రపంచకప్ ట్రోఫీని అందుకొంది. కంగారూ ల్యాండ్ వేదికగా గత మూడువారాలుగా పడుతూ లేస్తూ సాగిన ప్రపంచకప్ బరిలో భారీఅంచనాలు లేకుండా బరిలో నిలిచిన ఇంగ్లండ్ స్థాయికి తగ్గట్టుగా రాణించడం ద్వారా విజేతగా నిలిచింది.

పాక్ కు ఇంగ్లండ్ పగ్గాలు...

వరుణభయం నేపథ్యంలో మెల్బోర్న్ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన లోస్కోరింగ్ ఫైనల్లో ఇంగ్లండ్ 5 వికెట్ల తేడాతో మాజీ చాంపియన్ పాకిస్థాన్ ను ఓడించింది.

ఈ టైటిల్ పోరులో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన పాక్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లకు 137 పరుగులు మాత్రమే చేయగలిగింది.

కెప్టెన్ బాబర్ అజమ్ 32, మసూద్ 38, షదాబ్ ఖాన్ 20, రిజ్వాన్ 15 పరుగులు సాధించారు.

ఇంగ్లండ్ బౌలర్లలో పేసర్ సామ్ కరెన్ 4 ఓవర్లలో 12 పరుగులిచ్చి 3 వికెట్లు, జోర్డాన్, రషీద్ చెరో 2 వికెట్లు, స్టోక్స్ 1 వికెట్ పడగొట్టారు.

స్టోక్స్ ఆల్ రౌండ్ షో....

మ్యాచ్ నెగ్గాలంటే 138 పరుగులు చేయాల్సిన ఇంగ్లండ్ మొదటి ఓవర్ లోనే సూపర్ హిట్టర్ అలెక్స్ హేల్స్ వికెట్ నష్టపోయి ఎదురీత మొదలు పెట్టింది. కెప్టెన్ బట్లర్ 26, మిడిలార్డర్ ఆటగాళ్లు సాల్ట్ 10, హారీ బ్రూక్ 20 పరుగులు సాధించి అవుటయ్యారు. అయితే ఐదో వికెట్ కు బెన్ స్టోక్స్- మోయిన్ అలీ జోడీ కీలకభాగస్వామ్యంతో విజయానికి చేరువ చేశారు.

మోయిన్ అలీ 20 పరుగులకు అవుట్ కాగా...బెన్ స్టోక్స్ , లైమ్ లివింగ్ స్టన్ నాటౌట్ గా నిలిచారు.స్టోక్స్ 49 బాల్స్ లో 5 బౌండ్రీలు, ఓ సిక్సర్ తో 52 పరుగుల నాటౌట్ స్కోరు సాధించాడు.

చివరకు ఇంగ్లండ్19. ఓవర్లలో 5 వికెట్లకు 138 పరుగుల స్కోరుతో 5 వికెట్ల విజయం సాధించింది. పాక్ బౌలర్లలో రవూఫ్, వాసిం చెరో 2 వికెట్లు, షాహీన్ అఫ్రిదీ 1 వికెట్ పడగొట్టారు.

2010లో తొలిసారిగా టీ-20 ప్రపంచకప్ నెగ్గిన ఇంగ్లండ్ తిరిగి 12 సంవత్సరాల విరామం తర్వాత రెండోసారి ట్రోఫీ అందుకోగలిగింది.

టీ-20 ప్రపంచకప్ చరిత్రలో ఇంతకుముందే రెండుసార్లు నెగ్గిన వెస్టిండీస్ సరసన ఇంగ్లండ్ నిలిచింది. ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ ట్రోఫీతో పాటు 13 కోట్ల రూపాయల ప్రైజ్ మనీ చెక్ సైతం అందుకొన్నాడు.

First Published:  13 Nov 2022 5:41 PM IST
Next Story