ఇంగ్లీష్ కౌంటీ క్రికెట్లో పూజారా సెంచరీల మోత!
ఐసీసీ టెస్ట్ లీగ్ ఫైనల్ కు ముందే భారత టెస్ట్ స్పెషలిస్ట్ చతేశ్వర్ పూజారా జోరందుకొన్నాడు. ఇంగ్లీష్ కౌంటీ క్రికెట్లో సెంచరీల మోత మోగిస్తున్నాడు....
ఐసీసీ టెస్ట్ లీగ్ ఫైనల్ కు ముందే భారత టెస్ట్ స్పెషలిస్ట్ చతేశ్వర్ పూజారా జోరందుకొన్నాడు. ఇంగ్లీష్ కౌంటీ క్రికెట్లో సెంచరీల మోత మోగిస్తున్నాడు....
భారత స్టార్ క్రికెటర్లంతా కోట్లవర్షం కురిపించే ఐపీఎల్ లో పాల్గొంటూ చెమటోడ్చుతూ ఉంటే..టెస్టు స్పెషలిస్ట్ చతేశ్వర్ పూజారా మాత్రం..వచ్చేనెలలో జరిగే ఐసీసీ టెస్ట్ లీగ్ ఫైనల్స్ కోసం ఇంగ్లీష్ కౌంటీ క్రికెట్లో ససెక్స్ కౌంటీ తరపున ఆడుతూ పాటుపడుతున్నాడు.
4 మ్యాచ్ ల్లో 3 సెంచరీల పూజారా....
2022 సీజన్లో తొలిసారిగా ఇంగ్లీష్ కౌంటీ క్రికెట్లో పాల్గొనడం ద్వారా డబుల్ సెంచరీలతో రికార్డుల మోత మోగించాడు. ప్రస్తుత 2023 సీజన్లో సైతం కౌంటీలీగ్ లో ఆడుతూ తన ఫామ్ ను కొనసాగిస్తున్నాడు.
జూన్ 7 నుంచి 11 వరకూ ఓవల్ వేదికగా ..ఆస్ట్ర్రేలియా ప్రత్యర్థిగా జరిగే 2023 ఐసీసీ టెస్టు లీగ్ టైటిల్ సమరానికి సన్నాహకంగా పూజారా..కౌంటీ క్రికెట్ లో పాల్గొంటూ సిద్ధమవుతున్నాడు.
టెస్టు లీగ్ ఫైనల్స్ కు కొద్దివారాల ముందే..ఇంగ్లండ్ లోని వికెట్లు, వాతావరణానికి అలవాటు పడటమే లక్ష్యంగా పూజారా ససెక్స్ కౌంటీ తరపున బరిలో నిలిచాడు.
ససెక్స్ కెప్టెన్ గా పూజారా...
గత సీజన్లో ససెక్స్ కౌంటీ జట్టులో సభ్యుడిగా మాత్రమే ఆడిన పూజారాకు ప్రస్తుత సీజన్లో యాజమాన్యం ఏకంగా కెప్టెన్సీనే అప్పగించింది. అంది వచ్చిన అవకాశాన్ని పూజారా పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకొని..గత నాలుగుమ్యాచ్ ల్లోనూ మూడు శతకాలు బాదాడు.
డర్హం జట్టుతో జరిగిన తొలిమ్యాచ్ లో 115, 35 పరుగుల స్కోర్లు, గ్లౌస్టర్ షైర్ తో జరిగిన మ్యాచ్ లో 151 పరుగులు సాధించాడు. మొత్తం 238 బంతులు ఎదుర్కొని 20 బౌండ్రీలు, 2 సిక్సర్లతో వరుసగా రెండో శతకం నమోదు చేశాడు.
ఇక వూస్టర్ షైర్ తో జరిగిన నాలుగోరౌండ్ మ్యాచ్ లో పూజారా 189 బాల్స్ లో 136 పరుగులతో సీజన్ మూడో శతకం సాధించాడు. ఆస్ట్ర్రేలియా స్టాండిన్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ సైతం..పూజారాతో కలసి ససెక్స్ కౌంటీకి ఆడటం విశేషం.
పూజారా మొత్తం 14 బౌండ్రీలు, ఓ సిక్సర్ తో శతకం పూర్తి చేయడంతో పాటు...స్టీవ్ స్మిత్ తో కలసి 4వ వికెట్ కు 61 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశాడు.
భారత స్టార్ బ్యాటర్ కెఎల్ రాహుల్ గాయంతో టెస్టు జట్టు కు దూరం కావడంతో..టెస్ట్ లీగ్ ఫైనల్లో భారత్ కు పూజారా ఫామ్ కీలకం కానుంది. శ్రేయస్ అయ్యర్, జస్ ప్రీత్ బుమ్రా లాంటి కీలక ఆటగాళ్లు లేకుండానే టెస్ట్ టాప్ ర్యాంకర్ భారత్..ఫైనల్లో ఆస్ట్ర్రేలియాతో అమీతుమీ తేల్చుకోవాల్సి ఉంది.
భారత కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కొహ్లీ లాంటి దిగ్గజ బ్యాటర్లంతా ఐపీఎల్ ప్రాక్టీసుతో టెస్టు లీగ్ ఫైనల్ కు తరలి వస్తుంటే...కేవలం పూజారా మాత్రమే..ఇంగ్లీష్ కౌంటీ అనుభవంతో బరిలోకి దిగనున్నాడు.