Telugu Global
Sports

సానియా రిటైర్మెంట్ కు కౌంట్ డౌన్!

భారత మహిళా టెన్నిస్ క్వీన్ సానియా మీర్జా రిటైర్మెంట్ కు ముహూర్తం కుదిరింది.

సానియా రిటైర్మెంట్ కు కౌంట్ డౌన్!
X

భారత మహిళా టెన్నిస్ క్వీన్ సానియా మీర్జా రిటైర్మెంట్ కు ముహూర్తం కుదిరింది. తన రిటైర్మెంట్ ఎప్పుడో?..ఎక్కడో? కూడా సానియా తన మనసులో మాట బయటపెట్టింది..

భారత మహిళాటెన్నిస్ ఆల్ టైమ్ గ్రేట్ సానియా మీర్జా తన రిటైర్మెంట్ పై వస్తున్న ఊహాగానాలకు తెరదించింది. గాయాలతో అర్థంతరంగా రిటైర్ కావాలని తనకులేదని, తనకు ఎప్పుడు రిటైర్ కావాలని అనిపిస్తే అప్పుడే ఆట నుంచి విరమించుకొంటానని స్పష్టం చేసింది.

గతంలో 2022 సీజన్ తో సానియా టెన్నిస్ కు గుడ్ బై చెప్పాలని నిర్ణయించినట్లు ప్రచారం జరిగింది. అయితే..తాను ఎప్పుడు...ఎక్కడ...ఎలా రిటైర్ కావాలన్న అంశమై 36 సంవత్సరాల సానియా స్పష్టత ఇచ్చింది.

టెన్నిస్ లో ఇక కొనసాగే ఓపిక లేదు...

దుబాయ్ వేదికగా వచ్చేనెలలో జరిగే డబ్లుటిఏ 1000 టోర్నీతో తాను టెన్నిస్ నుంచి రిటైర్ కావాలని నిర్ణయించుకొన్నట్లు ఓ మీడియా సంస్థకు ఇటీవలే ఇచ్చిన ఇంటర్వ్యూలో సానియా స్పష్టం చేసింది.

టెన్నిస్ లో కొనసాగాలన్న కోరిక, తీరిక తనకు ఇక లేనేలేవని, టెన్నిస్సే ఊపిరిగా గడుపుతూ వచ్చిన తనకు భావోద్వేగభరితమైన అనుబంధం తెగిపోయిందని, జీవితంలో తన ప్రాధమ్యాలు కూడా మారిపోయాయని సానియా స్పష్టం చేసింది.

దుబాయ్ వేదికగా ఫిబ్రవరిలో జరిగే డబ్లుటిఏ టోర్నీ ఫైనల్ తో తాను ఆట నుంచి వీడ్కోలు తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలిపింది. గత ఏడాది జరిగిన అమెరికన్ ఓపెన్ సమయంలో తనకు గాయమయ్యిందని..దాంతో రిటైర్మెంట్ ను వాయిదా వేసుకొన్నానని తెలిపింది.

గాయాలతో ఆట నుంచి అర్థంతరంగా వైదొలిగే కంటే..పూర్తి ఫిట్ నెస్ తో దర్జాగా రిటైర్ కావాలని తాను భావించినట్లు చెప్పింది.

ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ డబుల్స్ బరిలో సానియా..

మెల్బోర్న్ వేదికగా జనవరి 16 న ప్రారంభంకానున్న 2023 ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ మహిళల డబుల్స్ బరిలో నిలవాలని సానియా భావిస్తోంది. కజకిస్థాన్ కు చెందిన అన్నా దనిలినాతో జంటగా పోటీకి సిద్ధమయ్యింది. సానియా కెరియర్ లో ఇదే ఆఖరి గ్రాండ్ స్లామ్ టోర్నీకానుంది. సానియాకు 2009లో మహేశ్ భూపతితో జంటగా ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ మిక్సిడ్ డబుల్స్, 2016 లో మార్టీనా హింగిస్ తో జోడీగా మహిళల డబుల్స్ టైటిల్స్ నెగ్గిన రికార్డు ఉంది. ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ కోసం తాను పూర్తిస్థాయిలో సిద్ధమైనట్లు సానియా ప్రకటించింది.

గత ఏడాది జరిగిన ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ మహిళల డబుల్స్ లో నాడియా కిచినాక్ తో జంటగా పోటీకి దిగిన సానియాకు తొలిరౌండ్లోనే ఓటమి ఎదురయ్యింది. అమెరికాకు చెందిన రాజీవ్ రామ్ తో జంటగా మిక్సిడ్ డబుల్స్ బరిలో నిలిచి క్వార్టర్ ఫైనల్స్ వరకూ చేరగలిగింది.

16 సంవత్సరాల చిరుప్రాయం నుంచే అంతర్జాతీయ టెన్నిస్ లో పాల్గొంటూ..గత రెండుదశాబ్దాల కాలంలో డజనుకు పైగా టైటిల్స్, 100 కోట్ల రూపాయలకు పైగా ప్రైజ్ మనీ, ఎండార్స్ మెంట్ మనీ సంపాదించిన ఘనత సానియాకు ఉంది.

2003లో ప్రొఫెషనల్ టెన్నిస్ స్టార్ గా తన కెరియర్ ప్రారంభించిన సానియా గత 20 సంవత్సరాలుగా ఫిట్ నెస్ కోసం పాటుపడుతూనే వస్తోంది. అంతర్జాతీయ టెన్నిస్ ఆడటానికి తన శరీరం ఇక ఏమాత్రం సహకరించడం లేదని తేల్చి చెప్పింది.

First Published:  7 Jan 2023 8:05 AM GMT
Next Story