Telugu Global
Sports

యూఎస్ ఓపెన్ ఫైనల్లో కోకో గాఫ్, సబలెంకా!

అమెరికన్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ రౌండ్ కు ప్రపంచ నంబర్ వన్ అర్యానా సబలెంకా, అమెరికా సంచలనం కోకో గాఫ్ చేరుకొన్నారు.

యూఎస్ ఓపెన్ ఫైనల్లో కోకో గాఫ్, సబలెంకా!
X

అమెరికన్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ రౌండ్ కు ప్రపంచ నంబర్ వన్ అర్యానా సబలెంకా, అమెరికా సంచలనం కోకో గాఫ్ చేరుకొన్నారు...

2023- గ్రాండ్ స్లామ్ సీజన్ ఆఖరిటోర్నీ అమెరికన్ ఓపెన్ మహిళల సింగిల్స్ ఫైనల్స్ కు అమెరికన్ టీనేజర్ కోకో గాఫ్, బెలారస్ ప్లేయర్ అర్యానా సబలెంకా చేరుకొన్నారు.

న్యూయార్క్ లోని ఆర్థర్ యాష్ స్టేడియం వేదికగా జరిగిన తొలి సెమీఫైనల్లో 19 సంవత్సరాల కోకో గాఫ్ వరుస సెట్లలో కారోలినా ముచోవాను అధిగమించడం ద్వారా తన కెరియర్ లో తొలిసారిగా ఓ గ్రాండ్ స్లామ్ టోర్నీ ఫైనల్స్ కు అర్హత సంపాదించగలిగింది.

తప్పుల తడకగా తొలిసెట్..

గాప్- ముచోవాల తొలిసెట్ తప్పుల తడకగా సాగింది. ఇద్దరు ప్లేయర్లు అనవసర తప్పిదాలకు పాల్పడడంతో సెట్లో ఆధిక్యత చేతులు మారుతూ వచ్చింది.

ఒకదశలో గాఫ్ 5-1తో పైచేయి సాధించడం ద్వారా అలవోకగా సెట్ ను సొంతం చేసుకొనే స్థితికి చేరుకొంది. అయితే ముచోవా ఆ తర్వాత నుంచి పోరాడి ఆడి 5-4 గేమ్ ల వరకూ చేరగలిగింది.

ఇద్దరు ప్లేయర్లూ 26 అనవసరపు తప్పిదాలు, 7 విన్నర్స్ తో తొలిసెట్ ను రసపట్టుగా మార్చారు. చివరకు గాఫ్ 6-4తో తొలిసెట్ ను కైవసం చేసుకోడం ద్వారా 1-0తో పైచేయి సాధించింది.

మ్యాచ్ మధ్యలో అంతరాయం...

తొలిసెట్ ముగిసి..రెండోసెట్ తొలిగేమ్ ను కోకో గాఫ్ గెలుచుకొన్న సమయంలో ముగ్గురు స్వచ్చంధ సేవా సంస్థ కార్యకర్తలు నిరసన ప్రదర్శన చేపట్టడంతో మ్యాచ్ ను 30 నిముషాలపాటు నిలిపివేశారు. నిరసనకు దిగిన ముగ్గురిని భద్రతాసిబ్బంది బయటకు పంపిన తరువాత తిరిగి మ్యాచ్ ను కొనసాగించారు.

ఇద్దరూ నువ్వానేనా అన్నట్లుగా పోటీపడటంతో 3-3, 5-5 స్కోర్లతో సెట్ పోటాపోటీగా సాగింది. చివరకు గాఫ్ 7-6తో మ్యాచ్ విన్నర్ గా నిలిచింది. ఆఖరిమ్యాచ్ పాయింట్ కోసం ఇద్దరు 40 షాట్ల ర్యాలీ ఆడి స్టేడియంలోని అభిమానులను ఓలలాడించారు.

ఈ విజయంతో సెరెనా విలియమ్స్ తర్వాత కోకో గాప్...అమెరికన్ ఓపెన్ ఫైనల్స్ చేరిన తొలి టీనేజర్ గా రికార్డుల్లో చేరింది.

సబలెంకా గ్రేట్ ఎస్కేప్....

మహిళల సింగిల్స్ రెండో సెమీఫైనల్లో ప్రపంచ నంబర్ వన్ ప్లేయర్ అర్యానా సబలెంకా పరాజయం అంచుల నుంచి బయటపడి మూడుసెట్ల పోరులో విజేతగా నిలిచింది.

అమెరికాకే చెందిన మాడిసన్ కీస్ తో జరిగిన ఉత్కంఠ భరితపోరులో సబలెంకా 0-6, 7-6, 7-6 గెలుపుతో ఫైనల్లో చోటు ఖాయం చేసుకొంది.

తొలిసెట్ ను 6-0తో అలవోకగా సొంతం చేసుకొన్న మాడిసన్ కీస్ ఆ తర్వాతి రెండుసెట్లలో తుదివరకూ పోరాడినా 6-7, 6-7తో పరాజయం తప్పలేదు.

28 ఏళ్ల మాడిసన్ కీస్ ను కంగుతినిపించడానికి 25 సంవత్సరాల సబలెంకా 2 గంటల 32 నిముషాలపాటు చేమటోడ్చాల్సి వచ్చింది.

ప్రతిపాయింటు కోసం తాను పోరాడిన కారణంగానే విజేతగా నిలువగలిగానని, తన కెరియర్ లో సాధించిన గొప్పవిజయాలలో ఇది ఒకటంటూ సబలెంకా మురిసిపోతోంది.

శనివారం జరిగే టైటిల్ పోరులో ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ ప్లేయర్ ఆర్యానా సబలెంకాతో అమెరికన్ టీనేజ్ వండర్ కోకో గాఫ్ అమీతుమీ తేల్చుకోనుంది.

టైటిల్ పోరులో విజేతగా నిలిచిన ప్లేయర్ కు అమెరికన్ ఓపెన్ ట్రోఫీతో పాటు..18 కోట్ల రూపాయల ప్రైజ్ మనీ దక్కనుంది.

First Published:  8 Sept 2023 4:00 PM IST
Next Story