Telugu Global
Sports

యూఎస్ ఓపెన్ క్వీన్ కోకో గాఫ్!

యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ ను అమెరికన్ టీనేజర్ కోకో గాఫ్ గెలుచుకొని సరికొత్త చాంపియన్ గా అవతరించింది...

యూఎస్ ఓపెన్ క్వీన్ కోకో గాఫ్!
X

యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ ను అమెరికన్ టీనేజర్ కోకో గాఫ్ గెలుచుకొని సరికొత్త చాంపియన్ గా అవతరించింది...

2023- యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ లో నయా చాంపియన్ తెరమీదకు వచ్చింది. ప్రస్తుత గ్రాండ్ స్లామ్ సీజన్లో ఆఖరి టోర్నీగా న్యూయార్క్ లోని అర్ధర్ యాష్ స్టేడియం వేదికగా జరిగిన పోరులో అమెరికా యువసంచలనం కోకో గాఫ్ విజేతగా నిలిచింది. ప్రత్యర్థి సబలెంకా 46 అనవసర తప్పిదాలకు పాల్పడటంతో కోకో చివరి రెండుసెట్లను కైవసం చేసుకోగలిగింది.

ప్రస్తుత హార్డ్ కోర్ట్ సీజన్లో అంచనాలకు మించి రాణిస్తూ వచ్చిన 19 సంవత్సరాల కోకో స్థాయికి తగ్గట్టుగా ఆడి టైటిల్ అందుకొంది.

అర్యానా సబలెంకాకు షాక్...

ప్రపంచ మహిళా టెన్నిస్ టాప్ ర్యాంకర్, బేలారస్ ప్లేయర్ అర్యానా సబలెంకాతో జరిగిన మూడుసెట్ల పోరులో 6వ సీడ్ కోకో గాఫ్ విజయాన్ని సొంతం చేసుకొంది.

ఈ టైటిల్ పోరు తిలకించడానికి 28వేల 143మంది అభిమానులు హాజరయ్యారు.

భారీఅంచనాల నడుమసాగిన ఈ పోరు తొలిసెట్ ను సబలెంకా 6-2తో నెగ్గి శుభారంభం చేసింది. అయితే..ఆ తర్వాతి రెండుసెట్లలో కోకో గాఫ్ చెలరేగి ఆడింది. 6-3, 6-2తో 2 గంటల 6 నిముషాలలోనే విజయాన్ని సొంతం చేసుకొంది.

ఓటమి బాధను అధిగమించి...

ప్రస్తుత సీజన్ వింబుల్డన్ తొలిరౌండ్లోనే పరాజయం పొందటం, ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ వరకూ వచ్చి ఓటమి పొందిన కోకో గాఫ్ వరుస పరాజయాల నుంచి తేరుకొని ఆడి సత్తా చాటుకొంది.

వింబుల్డన్ తొలి రౌండ్ ఓటమి తర్వాత నుంచి 19 సింగిల్స్ మ్యాచ్ లు ఆడిన కోకో గాఫ్ వరుసగా 18 విజయాలతో రెండు టూర్ టైటిల్స్, ఓ గ్రాండ్ స్లామ్ టైటిల్ సొంతం చేసుకోడం విశేషం.

3వ అమెరికన్ టీనేజర్ గాఫ్...

అమెరికన్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ ను టీనేజ్ వయసులోనే నెగ్గిన మూడో అమెరికన్ క్రీడాకారిణిగా కోకో గాఫ్ రికార్డుల్లో చేరింది. 1979లో ట్రేసీ ఆస్టిన్, 1999లో సెరెనా విలియమ్స్ తర్వాత 2023లో కోకో గాఫ్ 19 సంవత్సరాల వయసులోనే యూఎస్ ఓపెన్ విజేతగా నిలువగలిగింది.

ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో ఇగా స్వియాటెక్ చేతిలో 1-6, 3-6తో ఓటమి పొందిన కోకో గాఫ్..ఆ తర్వాత యూఎస్ ఓపెన్ ఫైనల్స్ చేరడమే కాదు..భారీఅంచనాలను, తీవ్రఒత్తిడిని అధిగమించి మరీ యూఎస్ ఓపెన్ ట్రోఫీతో పాటు 18 కోట్ల రూపాయల ప్రైజ్ మనీని సైతం అందుకోగలిగింది.

First Published:  10 Sept 2023 9:46 AM IST
Next Story