Telugu Global
Sports

ఐపీఎల్ కు పూజారా రాంరాం!

కాసుల వర్షం కురిపించే ఐపీఎల్ కు దూరంగా ఉండాలని భారత నయావాల్ చతేశ్వర్ పూజారా నిర్ణయించాడు. 2023 ఐపీఎల్ మినీవేలానికి పూజారా దూరమయ్యాడు...

ఐపీఎల్ కు పూజారా రాంరాం!
X

కాసుల వర్షం కురిపించే ఐపీఎల్ కు దూరంగా ఉండాలని భారత నయావాల్ చతేశ్వర్ పూజారా నిర్ణయించాడు. 2023 ఐపీఎల్ మినీవేలానికి పూజారా దూరమయ్యాడు...

క్రికెటర్లను రాత్రికి రాత్రే కోటీశ్వరులుగా మార్చే ఇండియన్ ప్రీమియర్ లీగ్ అనగానే ప్రపంచంలోని ఏదేశానికి చెందిన ఆటగాడైనా ఎగిరి గంతేస్తాడు. అయితే..భారత క్రికెట్ నయావాల్, టెస్టు స్పెషలిస్ట్ చతేశ్వర్ పూజారాను మాత్రం దానికి మినహాయింపుగా చెప్పుకోవాలి.

ఇటీవలే జరిగే ఇంగ్లీష్ కౌంటీ లీగ్ లో డబుల్ సెంచరీల మోత మోగించడంతో పాటు...బంగ్లాదేశ్ తో జరుగుతున్న తొలిటెస్టు రెండో ఇన్నింగ్స్ లో..టీ-20 తరహాలో మెరుపు సెంచరీతో అజేయంగా నిలిచాడు.

అయితే...2023 ఐపీఎల్ సీజన్ కోసం త్వరలో నిర్వహించనున్న మినీ వేలానికి దూరంగా ఉండాలని పూజారా నిర్ణయించాడు. తన పేరును వేలానికి నమోదు చేయకుండా మిన్నకుండా ఉండిపోయాడు.

చెన్నై సూపర్ కింగ్స్ తో సరి...

టెస్టు క్రికెట్లో 19 శతకాల మొనగాడు చతేశ్వర్ పూజారా పైన టెస్టు స్పెషలిస్టుగా ముద్ర పడిపోయింది. మెరుపువేగంతో పరుగులు సాధించలేడని, దూకుడుగా ఆడలేడని, బ్యాటు ఝళిపించలేడన్న అపప్రద పడిపోయింది.

దాదాపు ఏడుసంవత్సరాల విరామం తర్వాత...గత సీజన్లో చెన్నై ఫ్రాంచైజీలో 50 లక్షల రూపాయల ధరకు చోటు దక్కించుకొన్నా..కనీసం ఒక్కమ్యాచ్ ఆడే అవకాశం లేకుండాపోయింది.

రాజ్ కోటలో ఐపీఎల్ మ్యాచ్ లేని పూజారా..

పూజారా హోంగ్రౌండ్ రాజ్ కోట. అయితే..రాజ్ కోట వేదికగా జరిగిన ఐపీఎల్ మ్యాచ్ ల్లో పాల్గొనే అవకాశం పూజారాకు లేకుండా పోయింది. 2016, 2017 సీజన్ల వేలం ద్వారా పూజారాను తమ ఫ్రాంచైజీలో చేర్చుకోడానికి ఏ జట్టు ఆసక్తి చూపలేదు. దీంతో విసిగిపోయిన పూజారా..ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్ వైపు మొగ్గుచూపాడు.

గత 15 సీజన్ల ఐపీఎల్ చరిత్రలో పూజారా 30 మ్యాచ్ లు ఆడి 390 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఒకే ఒక్క హాఫ్ సెంచరీ చేయగలిగాడు.

ఇంగ్లీష్ కౌంటీ లీగ్ లో దూకుడుగా ఆడటం ద్వారా తన బ్యాటింగ్ తీరులో జోరు పెంచుకొన్న పూజారా...ఐపీఎల్ తనకు సరిపడదని, ఐపీఎల్ కు తాను సరిపోనని ఆలస్యంగానైనా తెలుసుకొని మేల్కొనడం గమనార్హం.

First Published:  17 Dec 2022 5:30 PM IST
Next Story