Telugu Global
Sports

ప్రపంచ చెస్ లో నేడు టై-బ్రేక్ వార్!

ప్రపంచ చదరంగ దిగ్గజం మాగ్నుస్ కార్ల్ సన్, భారత యువసంచలనం ప్రఙ్జానంద్ ల ప్రపంచ చెస్ ఫైనల్ పోరు క్లాసికల్ గేమ్స్ నుంచి టై బ్రేక్ రౌండ్ కు చేరింది. ఈరోజు జరిగే రెండుగేమ్ ల టై బ్రేక్ లో విజేత ఎవరో తేలిపోనుంది.

ప్రపంచ చెస్ లో నేడు టై-బ్రేక్ వార్!
X

ప్రపంచ చెస్ లో నేడు టై-బ్రేక్ వార్!

ప్రపంచ చదరంగ దిగ్గజం మాగ్నుస్ కార్ల్ సన్, భారత యువసంచలనం ప్రఙ్జానంద్ ల ప్రపంచ చెస్ ఫైనల్ పోరు క్లాసికల్ గేమ్స్ నుంచి టై బ్రేక్ రౌండ్ కు చేరింది. ఈరోజు జరిగే రెండుగేమ్ ల టై బ్రేక్ లో విజేత ఎవరో తేలిపోనుంది...

భారత నవయువ గ్రాండ్ మాస్టర్ ప్రఙ్జానంద్ సరికొత్త చరిత్ర సృష్టించడానికి ఉరకలేస్తున్నాడు. ప్రపంచ చెస్ కాండిడేట్స్ టోర్నీవిజేతగా నిలవటానికి కేవలం రెండు టై బ్రేక్ గేమ్ ల దూరంలో మాత్రమే ఉన్నాడు.

అజర్ బైజాన్ రాజధాని బకూ వేదికగా నిర్వహిస్తున్న 2023 ప్రపంచ క్యాండిడేట్స్ టోర్నీలో 18 సంవత్సరాల ప్రఙ్జానంద్ అందరి అంచనాలు తలకిందులు చేసి మరీ ఫైనల్స్ కు అర్హత సాధించడమే కాదు..దిగ్గజ గ్రాండ్ మాస్టర్ మాగ్నుస్ కార్ల్ సన్ ను రెండుగేమ్ ల క్లాసికల్ రౌండ్లో నిలువరించడం ద్వారా సమఉజ్జీగా నిలిచాడు.

కొండతో కూన ఢీ అంటే ఇదే...

ప్రపంచ చదరంగంలో మాజీ విశ్వవిజేతగా, నంబర్ వన్ ర్యాంక్ ప్లేయర్ గా ఉన్న మాగ్నుస్ కార్ల్ సన్ తో భారత టీనేజ్ గ్రాండ్మాస్టర్ ప్రఙ్జానంద్ పోటీపడటం కొండను పసికూన ఢీ కొనడం లాంటిదే.

అంతర్జాతీయ చెస్ సమాఖ్య తాజా రేటింగ్స్ ప్రకారం క్లాసికల్ విభాగంలో 2825 పాయింట్లు, ర్యాపిడ్ విభాగంలో 2887 పాయింట్లతో కార్ల్ సన్ సూపర్ గ్రాండ్ మాస్టర్ గా ఉంటే...పసికూన ప్రఙ్జానంద్ మాత్రం 2645, 2623 పాయింట్ల ఎలో రేటింగ్ తో మాత్రమే ఉన్నాడు. ఇద్దరు గ్రాండ్ మాస్టర్ల నడుమ వయసు, అనుభవంలో మాత్రమే కాదు..ఎలో రేటింగ్ పాయింట్లలోనూ ఎంతో తేడా ఉంది. ప్రపంచ మాజీ చాంపియన్ మాగ్నుస్ కార్ల్ సన్ కంటే 200 పాయింట్ల దిగువన ఉన్న ప్రఙ్జానంద్ ప్రస్తుత చెస్ క్యాండిడేట్స్ టోర్నీ క్వార్టర్ ఫైనల్లో తన దేశానికే చెందిన అర్జున్ ఇరగేసిని, సెమీఫైనల్లో ప్రపంచ 3వ ర్యాంక్ ఆటగాడు ఫాబియానో కోరునాను టైబ్రేక్ రౌండ్లలోనే ఓడించడం ద్వారానే ఫైనల్స్ కు అర్హత సంపాదించాడు.

ప్రస్తుత టోర్నీ నిబంధనల ప్రకారం ముందుగా రెండు క్లాసికల్ గేమ్స్ నిర్వహిస్తారు. ఈ రౌండ్లో ఇద్దరు ఆటగాళ్లు సమఉజ్జీలుగా నిలిస్తే..విజేతను నిర్ణయించడానికి రెండుగేమ్ ల ర్యాపిడ్ రౌండ్ ను నిర్వహిస్తారు. ఇందులోనూ ఫలితం తేలకపోతే టై బ్రేక్ బ్లిట్జ్ రౌండ్ నిర్వహిస్తారు.

అయితే..ఫైనల్ పోరు మొదటి రెండు క్లాసికల్ రౌండ్లలో తొలిగేమ్ ను ప్రఙ్జానంద్ డ్రాగా ముగిస్తే...రెండో గేమ్ ను కార్ల్ సన్ డ్రాతో సరిపెట్టుకొన్నాడు. దీంతో ఇద్దరు గ్రాండ్ మాస్టర్లు 1-1తో సమఉజ్జీలుగా నిలిచారు.

కొద్దిగంటల్లో టైబ్రేక్ సమరం...

ఈ రోజు జరిగే రెండుగేమ్ ల టై బ్రేక్ రౌండ్లో నెగ్గిన ఆటగాడే విజేతగా నిలవడంతో పాటు..2024 ప్రపంచ చెస్ టైటిల్ కోసం..ప్రస్తుత చాంపియన్ , చైనా సూపర్ గ్రాండ్ మాస్టర్ డింగ్ లీరెన్ తో తలపడటానికి అర్హత సాధించగలుగుతారు.

తనకంటే బలమైన ప్రత్యర్థులను టైబ్రేక్ రౌండ్లో చిత్తు చేసిన అనుభవం, రికార్డు ప్రఙ్జానంద్ కు ఉన్నాయని, టైబ్రేక్ పోరు అంతతేలిక కాదని తనకు తెలుసునని కార్ల్ సన్ ఇప్పటికే ప్రకటించాడు.

నిబంధనల ప్రకారం టై బ్రేక్ రౌండ్ గేమ్ 25 నిముషాలలోనే ముగిసిపోతుంది. ఒక్క ఎత్తు సకాలంలో వేసిన ఆటగాడికి 10 సెకన్ల సమయాన్ని అదనంగా ఇస్తారు.

టైబ్రేక్ రౌండ్లోనూ ఇద్దరు గ్రాండ్ మాస్టర్లు సమఉజ్జీలుగా నిలిస్తే..కేవలం 5 నిముషాలలో ముగిసిపోయే బ్లిట్జ్ రౌండ్ ను నిర్వహిస్తారు

క్వార్టర్ ఫైనల్స్ నుంచి సెమీస్ వరకూ ప్రఙ్జానంద్ టై బ్రేక్ విజయాల ద్వారానే ఫైనల్స్ వరకూ రాగలిగాడు.

కార్ల్ సన్ 8- ప్రఙ్జానంద్ 5

ఈ టోర్నీకి ముందు వరకూ వివిధ పోటీలలో భాగంగా కార్ల్ సన్, ప్రఙ్జానంద్ 18సార్లు టైబ్రేక్ గేమ్ లు ఆడితే...ఐదుసార్లు విశ్వవిజేత కార్ల్ సన్ 8 విజయాలు, ప్రఙ్జానంద్ 5 విజయాలు రికార్డుతో ఉన్నారు. మరో ఐదు గేమ్ లు డ్రాగా ముగిశాయి.

ఈరోజు జరిగే ఫైనల్లో విజేతగా నిలిచిన ఆటగాడు లక్షా 10వేల డాలర్ల ప్రైజ్ మనీతో పాటు ప్రపంచ చెస్ క్యాండిడేట్స్ ట్రోఫీని సైతం అందుకోగలుగుతాడు.

First Published:  24 Aug 2023 12:57 PM IST
Next Story