చెస్ ఒలింపియాడ్‌లో భారత్ కు జంట కాంస్యాలు
రష్యాతో యుద్ధంలో అపారంగా నష్టపోయిన తమ దేశానికి ఈ విజయం గొప్ప ఓదార్పు, ఊరట అని అన్నా ప్రకటించింది. తాము ఏదో ఒక పతకం సాధించాలన్న పట్టుదలతో భారత్ కు వచ్చామని, ఏకంగా బంగారు పతకం దక్కడం సంతృప్తినిచ్చిందని చెప్పింది.
భారత గడ్డపై తొలిసారిగా జరిగిన 44వ చెస్ ఒలింపియాడ్ పురుషుల, మహిళల విభాగాలలో ఆతిథ్య జట్లు కాంస్య పతకాలతో సరిపెట్టుకొన్నాయి. భారత చెస్ సమాఖ్య ఆధ్వర్యంలో తమిళనాడులోని మామల్లపురం వేదికగా గత రెండు వారాలుగా సాగిన ఈ ప్రపంచ పోరుకు తెరపడింది. పురుషుల, మహిళల ఓపెన్ విభాగాలలో ఉజ్ బెకిస్థాన్, ఉక్రెయిన్ జట్లు విజేతలుగా నిలిచాయి. ఈ టోర్నీలో ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలో నిలిచిన 14వ సీడ్ ఉజ్బెకిస్థాన్ యువజట్టు అందరి అంచనాలు తలకిందులు చేసి బంగారు పతకం కైవసం చేసుకుంది. తొలిరౌండ్ నుంచి మలిరౌండ్ వరకూ ఒక్క గేమూ ఓడిపోకుండా ఉజ్బెకిస్థాన్ విజేతగా నిలవడం విశేషం. ఆర్మీనియా రజత, భారత్ కాంస్య పతకాలు దక్కించుకొన్నాయి. మహిళల విభాగంలో అన్నా ఉషెనినా నాయకత్వంలోని ఉక్రెయిన్ జట్టు స్వర్ణ విజేతగా నిలిచింది. రష్యాతో యుద్ధంలో అపారంగా నష్టపోయిన తమ దేశానికి ఈ విజయం గొప్ప ఓదార్పు, ఊరట అని అన్నా ప్రకటించింది. తాము ఏదో ఒక పతకం సాధించాలన్న పట్టుదలతో భారత్ కు వచ్చామని, ఏకంగా బంగారు పతకం దక్కడం సంతృప్తినిచ్చిందని చెప్పింది.
భారత్ కు బ్రాంజ్ డబుల్..
మహిళల విభాగంలో టాప్ సీడ్ గా బరిలో నిలిచిన భారతజట్టు కాంస్య పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. పురుషుల విభాగంలో భారత- బీ జట్టు కాంస్య విజేతగా నిలిచింది. స్వర్ణపతకం సాధించాల్సిన తమజట్టు కాంస్యంతో సరిపెట్టుకోడం ఇబ్బందిగా అనిపించినా తప్పదని మహిళా గ్రాండ్ మాస్టర్ తాన్యా సచదేవ్ వాపోయింది. గ్రాండ్ మాస్టర్ గుకేశ్ నాయకత్వంలోని భారతజట్టు 11వ సీడ్ హోదాలో పోరులో నిలిచింది. పురుషుల, మహిళల వ్యక్తిగత విభాగాలలో అక్కా, తమ్ముడి జోడీ వైశాలీ రమేశ్, ప్రజ్ఞానంద రమేశ్ కాంస్య పతకాలు నెగ్గి సంచలనం సృష్టించారు. తమ నగరం చెన్నైలో జరిగిన ఈ చెస్ ఒలింపియాడ్ పురుషుల, మహిళల విభాగాల వ్యక్తిగత విభాగంలో జంట కాంస్యాలు సాధించడం తమ కుటుంబానికి ప్రత్యేకమని వైశాలి తెలిపింది.
జూలై 28 నుంచి ఆగస్టు 8 వరకూ జరిగిన ఈ చదరంగ మేథో సమరంలో 188 దేశాలకు చెందిన 333 జట్లకు చెందిన వందలాదిమంది క్రీడాకారులు పాల్గొన్నారు. సూపర్ గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ ఈ టోర్నీలో పాల్గొన్న భారతజట్లకు మెంటార్ గా వ్యవహరించారు. తెలుగు రాష్ట్రాల గ్రాండ్ మాస్టర్లు పెంటేల హరికృష్ణ, ద్రోణవల్లి హారిక, కోనేరు హంపి, ఇరగేసి అర్జున్ భారతజట్లలో సభ్యులుగా ఈ సమరంలో పాలుపంచుకున్నారు.