Telugu Global
Sports

క్రీడలకు నిధులు.. గుజరాత్ కు గుప్పెడు, దక్షిణాదికి చిటికెడు!

గుజరాత్ కు కేటాయించిన 608 కోట్ల రూపాయల ముందు.. దక్షిణాది రాష్ట్రాలకు కేటాయించిన కేవలం 296 కోట్ల రూపాయల మొత్తం వెలవెలబోతోంది. దేశంలోని ఓ రాష్ట్రానికి ఇచ్చిన మొత్తం నిధుల్లో సగభాగం తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ, తెలంగాణకు కేటాయించడం వివక్షకాక మరేమిటని తెలంగాణ క్రీడాసంఘాల ప్రముఖులు అంటున్నారు.

క్రీడలకు నిధులు.. గుజరాత్ కు గుప్పెడు, దక్షిణాదికి చిటికెడు!
X

క్రీడారంగానికి నిధుల కేటాయింపులో కేంద్ర ప్రభుత్వ వివక్ష కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. 2022 సంవత్సరానికి ఖేలో ఇండియా పథకంలో భాగంగా నిధులు కేటాయించిన తీరు ఫెడరల్ స్ఫూర్తికి భంగం కలిగించేలా ఉందని దక్షిణాది రాష్ట్రాలతో పాటు క్రీడావర్గాలు మండిపడుతున్నాయి.

రాష్ట్రాల బలమే కేంద్రానికి బలమని చెప్పే నరేంద్ర మోడీ సర్కార్ మాటలకూ చేతలకూ ఏమాత్రం పొంతన ఉండటం లేదు. కేంద్ర వార్షిక బడ్జెట్ ద్వారా క్రీడారంగానికి, వివిధ రాష్ట్రాలకు నిధులు కేటాయిస్తున్నతీరు సమాఖ్య వ్యవస్థకు తీవ్ర విఘాతం కలిగిస్తోంది. ఆర్థికమైనా.. క్రీడారంగమైనా గత కొంతకాలంగా గుజరాత్ కే అత్యధిక ప్రాధాన్యమిస్తున్నట్లు కనిపిస్తోంది. పైగా దేశానికి కొండంత అండగా నిలిచే దక్షిణాది రాష్ట్రాలను చిన్నచూపుచూసే ధోరణి సైతం రానురానూ పెరిగిపోతోంది. 2021-2022 కేంద్రబడ్జెట్ లో క్రీడారంగానికి 3062.60 కోట్ల రూపాయలు కేటాయించారు. ఈ మొత్తం నుంచి కేవలం గుజరాత్ రాష్ట్రానికే 608 కోట్ల రూపాయలు కేటాయించి.. తమిళనాడు, కర్నాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ, పుదుచ్చేరీ రాష్ట్రాలతో కూడిన దక్షిణభారత్ కు 296 కోట్లు మాత్రమే విదిలించడం తీవ్రవిమర్శలకు దారితీసింది.

కేటీఆర్ గరంగరం..

బర్మింగ్ హామ్ లో ఇటీవలే ముగిసిన 2022 కామన్వెల్త్ గేమ్స్ లో దేశానికి ఆరు పతకాలు అందించిన తెలంగాణకు 24.11 కోట్లు మాత్రమే ఇచ్చి.. రెండు పతకాలు మాత్రమే సాధించిన గుజరాత్ కు 608 కోట్ల రూపాయలు కేటాయించడాన్ని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌తో పాటు పలువురు క్రీడారంగ ప్రతినిధులు తీవ్రంగా ఆక్షేపించారు. ప్రస్తుత కేంద్రప్రభుత్వానికి దక్షిణాది రాష్ట్రాలు, ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర‌మంటే ఎందుకు చిన్నచూపో తనకు అర్థంకావడంలేదని కేటీఆర్ మండిపడ్డారు. క్రీడారంగంలో గుజరాత్ కంటే మెరుగైన ప్రదర్శన చేస్తున్న తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు కంటితుడుపుగా నిధులు కేటాయించడం వివక్షగా అనిపిస్తోందని నిరసన వ్యక్తం చేశారు.


డబులింజన్ రాష్ట్రాలకు పెద్దపీట!

కేంద్ర బడ్జెట్, జీఎస్టీ అంశాలలో మాత్రమే కాదు.. క్రీడా బడ్జెట్ ద్వారా నిధుల కేటాయింపులో బీజేపీ పాలిత రాష్ట్రాలకు ఇస్తున్న ప్రాధాన్యం.. కమలం అధికారంలో లేని రాష్ట్రాలకు ఏమాత్రం ఇవ్వడం లేదు. కేంద్రం నుంచి భారీగా నిధులు పొందిన బీజేపీ పాలిత రాష్ట్రాల్లో 608 కోట్ల రూపాయలతో గుజరాత్‌ అగ్రస్థానంలో నిలిచింది. ఇటీవలే ముగిసిన కామన్వెల్త్ గేమ్స్ లో దేశానికి గుజరాతీ అథ్లెట్లు రెండు పతకాలు మాత్రమే సాధించగలిగారు. ఆ తర్వాత ఉత్తరప్రదేశ్‌ 503 కోట్లు, అరుణాచల్‌ప్రదేశ్‌ 188 కోట్లు, కర్ణాటక 128 కోట్ల రూపాయల నిధులు అందుకొన్నాయి.

గుజరాత్ కు కేటాయించిన 608 కోట్ల రూపాయల ముందు.. దక్షిణాది రాష్ట్రాలకు కేవలం 296 కోట్ల రూపాయల మొత్తం వెలవెలబోతోంది. దేశంలోని ఓ రాష్ట్రానికి ఇచ్చిన మొత్తం నిధుల్లో సగభాగం తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ, తెలంగాణకు కేటాయించడం వివక్షకాక మరేమిటని తెలంగాణ క్రీడాసంఘాల ప్రముఖులు అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ కు 33 కోట్లు, తెలంగాణకు 24.11 కోట్లు, తమిళనాడుకు 33 కోట్లు రూపాయలు, పశ్చిమ బెంగాల్ కు 26.77 కోట్ల రూపాయలు కేటాయించడం కేంద్ర వైఖరికి అద్దం పడుతోంది. క్రీడారంగానికి కేటాయింపుల్లో కేంద్రం డబులింజన్ రాజకీయాలు చేస్తూ పోతే అంతర్జాతీయ క్రీడాపతకాల పట్టికలో భారత్ పట్టాలు తప్పడం ఖాయమని క్రీడాపండితులు హెచ్చరిస్తున్నారు. క్రీడారంగంలో రాజకీయాలు చేయటం తగదని, నిధుల కేటాయింపులో క్రీడాస్ఫూర్తి ప్రదర్శించాలని సలహా ఇస్తున్నారు.

First Published:  24 Aug 2022 11:48 AM IST
Next Story