Telugu Global
Sports

సెమీస్ లోనే అల్ కరాజ్ అవుట్..ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్స్ లో జోకోవిచ్, రూడ్!

ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ ఫైనల్స్ కు రెండుసార్లు విన్నర్ జోకోవిచ్ 7వసారి చేరుకొన్నాడు. టైటిల్ సమరంలో కాస్పర్ రూడ్ తో తలపడనున్నాడు.

సెమీస్ లోనే అల్ కరాజ్ అవుట్..ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్స్ లో జోకోవిచ్, రూడ్!
X

ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ ఫైనల్స్ కు రెండుసార్లు విన్నర్ జోకోవిచ్ 7వసారి చేరుకొన్నాడు. టైటిల్ సమరంలో కాస్పర్ రూడ్ తో తలపడనున్నాడు.

2023 ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ ఫైనల్స్ కు వెటరన్ నొవాక్ జోకోవిచ్, యువఆటగాడు కాస్పర్ రూడ్ చేరుకొన్నారు. టాప్ సీడ్ , స్పానిష్ సంచలనం కార్లోస్ అల్ కరాజ్ పోరు సెమీఫైనల్లోనే ముగిసింది.

గ్లాండ్ స్లామ్ టోర్నీల ఫైనల్లో 34వసారి..

తన గ్రాండ్ స్లామ్ కెరియర్ లో ఇప్పటికే 22 టైటిల్స్ సాధించిన ప్రపంచ మాజీ నంబర్ వన్ నొవాక్ జోకోవిచ్ ..23వ టైటిల్ కు గెలుపు దూరంలో నిలిచాడు. తనకు అంతంత మాత్రమే రికార్డు ఉన్న ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్స్ కు 7వసారి చేరుకోడం ద్వారా మూడో ట్రోఫీకి గురిపెట్టాడు.

పారిస్ లోని రోలాండ్ గారోస్ స్టేడియం వేదికగా..భారీఅంచనాల నడుమ జరిగిన తొలి సెమీఫైనల్లో ప్రపంచ నంబర్ వన్, యువఆటగాడు కార్లోస్ అల్ కరాజ్ పై 3వ సీడ్ జోకోవిచ్ 4 సెట్ల విజయం సాధించాడు.

ఏకపక్షంగా సాగిన ఈ పోరులో తొలిసెట్ ను6-2తో నెగ్గడం ద్వారా జోకో శుభారంభం చేశాడు. అయితే ..ఆల్ కరాజ్ పోరాడి ఆడి 7-5తో రెండోసెట్ నెగ్గడం ద్వారా 1-1తో సమఉజ్జీగా నిలిచాడు. నిర్ణయాత్మక మూడోసెట్ ప్రారంభంలోనే..అల్ కరాజ్ కు కాలినరాలు పట్టేయడంతో ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయాడు. కోర్టులో కదలటానికే నానాపాట్లు పడ్డాడు. ఈ పరిస్థితిని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకొన్న జోకోవిచ్ 6-1, 6-1తో ఆఖరి రెండుసెట్లు నెగ్గడం ద్వారా 7వ సారి ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో చోటు ఖాయం చేసుకొన్నాడు.

గతంలో ఆరుసార్లు ఫైనల్స్ ఆడిన జోకోవిచ్ కు 2 విన్నర్ ట్రోఫీలు, 4 రన్నరప్ ట్రోఫీలు మాత్రమే దక్కాయి. ఆదివారం జరిగే టైటిల్ పోరులో నార్వే ఆటగాడు కాస్పర్ రూడ్ తో జోకోవిచ్ తలపడనున్నాడు.

గ్రాండ్ స్లామ్ సర్క్యూట్ లోని మొత్తం నాలుగు టైటిల్స్ ను ఇప్పటికే రెండు వేర్వేరు సీజన్లలో నెగ్గిన జోకోవిచ్..ప్రస్తుత సీజన్ ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ నెగ్గగలిగితే..మూడోసారి

గ్రాండ్ స్లామ్ నాలుగు టైటిల్సూ సాధించిన ఆటగాడిగా సరికొత్త చరిత్ర సృష్టించే అవకాశం ఉంది.

1930లో బిల్ టిల్డన్ తరువాత..ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ ఫైనల్స్ చేరిన అత్యధిక వయసున్న ఆటగాడిగా జోకోవిచ్ రికార్డుల్లో చేరాడు. 36 సంవత్సరాల వయసులో ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్స్ చేరిన ప్లేయర్ గా జోకో నిలిచాడు.

జ్వెరేవ్ కు కాస్పర్ రూడ్ షాక్...

రెండో సెమీఫైనల్లో ఒలింపిక్‌ చాంపియన్, జర్మన్ ఆటగాడు అలెగ్జాండర్ జ్వరేవ్ ను వరుస సెట్లలో కాస్పర్ రూడ్ చిత్తు చేశాడు. 6-3, 6-4, 6-0తో నెగ్గడం ద్వారా ఫైనల్లో అడుగుపెట్టాడు.

గతేడాది ఫైనల్లో రాఫెల్ నడాల్ చేతిలో ఓడి..రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకొన్న రూడ్ వరుసగా రెండోసారి ఫ్రెంచ్ ఓపెన్ పైనల్స్ చేరినా..ఈసారి జోకోవిచ్ తో అమీతుమీ తేల్చుకోక తప్పదు.

ఇప్పటి వరకూ జోకోవిచ్ ప్రత్యర్థిగా ఆడిన నాలుగుకు నాలుగుమ్యాచ్ ల్లోనూ పరాజయాలు పొందిన రూడ్ ఆదివారం జరిగే ఫైనల్లో డార్క్ హార్స్ గా బరిలోకి దిగనున్నాడు.

2020 సీజన్ నుంచి క్లేకోర్టు టెన్నిస్ లో 87 విజయాలు సాధించిన రూడ్..ఫైనల్లో అత్య్తుత్తమంగా రాణించగలిగితేనే జోకోవిచ్ ను అధిగమించగలుగుతాడు.

ఈరోజు జరిగే మహిళల టైటిల్ పోరులో టాప్ సీడ్ ఇగా స్వయిటెక్ తో అన్ సీడెడ్ కారోలినా మచోవా తలపడనుంది. గత రెండేళ్లు ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ నెగ్గుతూ వచ్చిన స్వయిటెక్ వరుసగా మూడోసారి టైటిల్ నెగ్గడం ద్వారా హ్యాట్రిక్ సాధించే అవకాశం ఎక్కువగా ఉంది.

First Published:  10 Jun 2023 1:46 PM IST
Next Story