జోకో ఆధిపత్యానికి తెర..వింబుల్డన్ 'యువరాజు' అల్ కరాజ్!
వింబుల్డన్ గ్రాస్ కోర్ట్ టెన్నిస్ లో గత దశాబ్దకాలంగా తిరుగులేని జోకోవిచ్ ఆధిపత్యానికి గండి పడింది.
వింబుల్డన్ గ్రాస్ కోర్ట్ టెన్నిస్ లో గత దశాబ్దకాలంగా తిరుగులేని జోకోవిచ్ ఆధిపత్యానికి గండి పడింది. స్పానిష్ సంచలనం కార్లోస్ అల్ కరాజ్ సరికొత్త చాంపియన్ గా అవతరించాడు....
2023 వింబుల్డన్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో సంచలనం చోటు చేసుకొంది. టైటిల్ సమరంలో కొండను కూన పిండి చేసింది. 23 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ విన్నర్ , 36 సంవత్సరాల నొవాక్ జోకోవిచ్ ను ఐదుసెట్లసమరంలో 20 ఏళ్ల స్పానిష్ అగ్గిపిడుగు కార్లోస్ అల్ కరాజ్ అధిగమించి తన తొలి వింబుల్డన్ ట్రోఫీని అందుకొన్నాడు.
కలచెదిరిన జోకోవిచ్....
వింబుల్డన్ టైటిల్ ను ఎనిమిదోసారి నెగ్గడం ద్వారా ఆల్ టైమ్ గ్రేట్ రోజర్ ఫెదరర్ రికార్డును సమం చేయాలన్న జోకోవిచ్ లక్ష్యం నెరవేరలేదు. మార్గారెట్ కోర్ట్ పేరుతో ఉన్న 24 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ రికార్డు ను అందుకోవాలన్న కల చెదిరిపోయింది.
వింబుల్డన్ సెంటర్ కోర్టులో గత 10 సంవత్సరాలుగా ఓటమి అంటే ఏమిటో తెలియని జోకోవిచ్ కు స్పానిష్ కుర్రాడు కార్లోస్ అల్ కరాజ్ ఓటమి అంటే ఏమిటో రుచిచూపించాడు.
వేలమంది అభిమానుల సమక్షంలో..వింబుల్డన్ సెంటర్ కోర్టు వేదికగా 4 గంటల 42 నిముషాలపాటు నువ్వానేనా అన్నట్లుగా సాగిన ఈ పోరులో టాప్ సీడ్ అల్ కరాజ్ దూకుడు ముందు అపారఅనుభవం కలిగిన జోకోవిచ్ తలవంచాడు.
అల్ కరాజ్ 1-6, 7-6, 6-1, 3-6, 6-4తో జోకో పై సంచలన విజయం సాధించడం ద్వారా తన కెరియర్ లో తొలి వింబుల్డన్ ట్రోఫీతో పాటు..25 కోట్ల రూపాయల ప్రైజ్ మనీని సైతం అందుకొన్నాడు.
అల్ కరాజ్ పవర్..జోకోవిచ్ షివర్...
భారీఅంచనాల నడుమ ప్రారంభమైన ఈ టైటిల్ పోరు తొలిసెట్ ను 1-6తో చేజార్చుకొన్న అల్ కరాజ్ ..కీలకరెండోసెట్ లో సెట్ పాయింట్ ను కాపాడుకొని మరి జోకోను నిలువరించాడు.
రెండోసెట్ ను 7-6తో టై బ్రేక్ లో సొంతం చేసుకొన్న అల్ కరాజ్ 1-1తో సమఉజ్జీగా నిలిచాడు. మూడోసెట్ లోనూ అదేజోరు కొనసాగించి 6-1తో పైచేయి సాధించాడు.
నాలుగోసెట్ ను 6-3తో నెగ్గడం ద్వారా జోకోవిచ్ టైటిల్ ఆశల్ని 2-2తో సజీవంగా నిలుపుకోగలిగాడు.
విజేతను నిర్ణయించే ఆఖరిసెట్ ను అల్ కరాజ్ 6-4తో నెగ్గడం ద్వారా వింబుల్డన్ సరికొత్త చాంపియన్ గా అవతరించాడు.
20 సంవత్సరాల వయసుకే అల్ కరాజ్ రెండోగ్రాండ్ స్లామ్ టైటిల్ సాధించగలిగాడు. గత సీజన్లో యూఎస్ ఓపెన్ టైటిల్ తో తన గ్రాండ్ స్లామ్ ఖాతా తెరిచిన అల్ కరాజ్..వింబుల్డన్ టైటిల్ నెగ్గిన మూడో అతిపిన్నవయస్కుడైన ఆటగాడిగా రికార్డుల్లో చేరాడు.
జోకోవిచ్ కన్నీరు మున్నీరు...
ఎనిమిదో వింబుల్డన్ టైటిల్ సాధించాలన్న తన కల చెదిరిపోడంతో గ్రాండ్ స్లామ్ కింగ్ జోకోవిచ్ ఓటమి అనంతరం కన్నీరు మున్నీరయ్యాడు. ఇలాంటి ఓటమిని తాను ఊహించలేదని వాపోయాడు.
జోకోవిచ్ 2008లో ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ విజేతగా నిలిచిన సమయంలో అల్ కరాజ్ వయసు 4 సంవత్సరాల 9నెలలు మాత్రమే. 2013 వింబుల్డన్ ఫైనల్లో యాండీ ముర్రే చేతిలో చివరిసారిగా ఓటమి పొందిన జోకోవిచ్..ఆ తర్వాత పదేళ్ళుగా అజేయంగా ఉంటూ వచ్చాడు.
వింబుల్డన్ సెంటర్ కోర్టులో వరుసగా 35 విజయాలు సాధించిన జోకోవిచ్ విజయపరంపరకు ఫైనల్లో విజయంతో అల్ కరాజ్ తెరదించాడు. తనకంటే గొప్పగా ఆడిన ఓ ఆటగాడి చేతిలో ఓటమి పొందటం తనకు గర్వకారణమని రన్నరప్ ట్రోఫీ అందుకొంటూ జోకోవిచ్ చెప్పాడు.
ప్రస్తుత 2023 గ్రాండ్ స్లామ్ సీజన్లో ఆస్ట్ర్రేలియన్, ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్స్ నెగ్గిన జోకోవిచ్ ..హ్యాట్రిక్ టైటిళ్ల రికార్డు ను అల్ కరాజ్ అడ్డుకోగలిగాడు. ఫెదరర్ రిటైర్మెంట్, నడాల్ గాయంతో తన ఆధిపత్యానికి తిరుగులేదని భావించిన జోకోవిచ్ కు అల్ కరాజ్ కొరుకుడు పడని ప్రత్యర్థిగా మిగిలిపోడం ఖాయంగా కనిపిస్తోంది.