Telugu Global
Sports

భారత్ కు నేటినుంచే ' కరీబియన్ టెస్ట్'!

ఐసీసీ 2023-25 టెస్ట్ లీగ్ లో తొలి సిరీస్ సమరంలో ఈరోజు నుంచి భారత్- వెస్టిండీస్ తలపడనున్నాయి. రాత్రి 7-30 గంటలకు కరీబియన్ ద్వీపాలలోని డోమనికా వేదికగా తొలిటెస్టు ప్రారంభంకానుంది.

భారత్ కు నేటినుంచే  కరీబియన్ టెస్ట్!
X

భారత్ కు నేటినుంచే ' కరీబియన్ టెస్ట్'!

ఐసీసీ 2023-25 టెస్ట్ లీగ్ లో తొలి సిరీస్ సమరంలో ఈరోజు నుంచి భారత్- వెస్టిండీస్ తలపడనున్నాయి. రాత్రి 7-30 గంటలకు కరీబియన్ ద్వీపాలలోని డోమనికా వేదికగా తొలిటెస్టు ప్రారంభంకానుంది.

ఐసీసీ టెస్టులీగ్ లో డబుల్ రన్నరప్ భారత్ సరికొత్త ( 2023-25 ) సీజన్ సమరం కోసం కరీబియన్ ద్వీపాలలో పాగా వేసింది. రోహిత్ శర్మ నాయకత్వంలోని భారతజట్టు ఈరోజు డోమనికాలోని విండ్సర్ పార్క్ వేదికగా ప్రారంభంకానున్న తొలిటెస్టు లో ఆతిథ్య వెస్టిండీస్ తో తలపడనుంది.

యశస్వి జైశ్వాల్ కు టెస్ట్ క్యాప్...

ముంబై యువబ్యాటర్ యశస్వి జైశ్వాల్ ఈ రోజు జరిగే తొలిటెస్టు ద్వారా అరంగేట్రం చేయనున్నాడు. కెప్టెన్ రోహిత్ శర్మతో కలసి భారత ఇన్నింగ్స్ ను ప్రారంభించనున్నాడు.

ఇటీవలే ముగిసిన ఐపీఎల్ -16లో అదరగొట్టడం ద్వారా సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించిన 21 సంవత్సరాల యశస్వికి పెద్దగా ఎదురుచూడకుండానే టెస్ట్ క్యాప్ యోగం పట్టింది.

సీనియర్ బ్యాటర్ చతేశ్వర్ పూజారాను పక్కన పెట్టి భారతజట్టులో యువబ్యాటర్లు యశస్వి తో పాటు రుతురాజ్ గయక్వాడ్ కు సైతం చోటు కల్పించారు.

అయితే..ఎడమచేతి వాటం బ్యాటర్ కావడంతో యశస్వి జైశ్వాల్ కు ఎంపికైన తొలి సిరీస్ లోనే టెస్టు అరంగేట్రం చేసే అవకాశం దక్కింది.

12 ఏళ్ల తర్వాత డోమనికాలోభారత టెస్టు...

డోమనికా ద్వీపంలోని రోసా విండ్సర్ పార్క్ వేదికగా భారతజట్టు 12 సంవత్సరాల విరామం తర్వాత టెస్టు మ్యాచ్ బరిలోకి దిగుతోంది. బలహీనమైన వెస్టిండీస్ పైన భారత్ సిరీస్ స్వీప్ సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

గత పుష్కరకాలంగా భారత టాపార్డర్ కు వెన్నెముకగా నిలిచిన నయావాల్ చతేశ్వర్ పూజారాను పక్కన పెట్టడంతో..సరికొత్త ఓపెనింగ్ జోడీతో భారత్ ఇన్నింగ్స్ ప్రారంభించనుంది.

రోహిత్- యశస్వి ఓపెనర్లు కాగా..వన్ డౌన్ లో శుభ్ మన్ గిల్, రెండో డౌన్లో విరాట్ కొహ్లీ, మూడో డౌన్లో అజింక్యా రహానే బ్యాటింగ్ కు దిగనున్నారు.

స్పిన్ బౌలర్లకు చేతినిండా పనే!

టెస్టుమ్యాచ్ కు వేదికగా ఉన్న విండ్సర్ పార్క్ స్పిన్ బౌలర్లకు అనువుగా ఉండడంతో రెండుజట్ల స్పిన్నర్లకు చేతినిండా పనేనని క్యూరేటర్ అంటున్నారు. భారత్ ఇద్దరు ప్రధాన స్పిన్నర్లు రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ లతో కరీబియన్ బ్యాటింగ్ ఆర్డర్ ను కుప్పకూల్చడానికి ఉరకలేస్తోంది.

వెస్టిండీస్ ప్రత్యర్థిగా ఆడిన 11 టెస్టుల్లో అశ్విన్ కు 4 సెంచరీలు, 2 అర్థసెంచరీలతో పాటు 60 వికెట్లు పడగొట్టిన అమోఘమైన రికార్డే ఉంది.

పేస్ బౌలింగ్ లో జయదేవ్ ఉనద్కత్, మహ్మద్ సిరాజ్, శార్ధూల్ ఠాకూర్, నవదీప్ సైనీ కీలకపాత్ర పోషించనున్నారు. వికెట్ కీపర్ స్థానం కోసం మాత్రం భరత్ , ఇషాన్ కిషన్ పోటీపడుతున్నారు.

భారత్ తరపున ఆడిన గత ఐదుటెస్టుల్లో బ్యాటింగ్ లో దారుణంగా విఫలమైన భరత్ ను పక్కన పెట్టి ఇషాన్ కిషన్ కు తుదిజట్టులో చోటు కల్పించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

21 ఏళ్లుగా భారత్ అజేయం...

టెస్టు క్రికెట్లో వెస్టిండీస్ ప్రత్యర్థిగా భారత్ గత 21 సంవత్సరాలుగా అజేయంగా ఉంటూ వస్తోంది. భారత్ పై వెస్టిండీస్ జట్టు తన చివరి టెస్టు విజయాన్ని రెండుదశాబ్దాల క్రితం మాత్రమే సాధించింది.

క్రెగ్ బ్రాత్ వెయిట్ నాయకత్వంలోని కరీబియన్ జట్టు లో యువబ్యాటర్ అలెక్ అత్నాజేకు చోటు కల్పించడం ఖాయంగా కనిపిస్తోంది. ఫాస్ట్ బౌలర్ల త్రయం షేనన్ గాబ్రియెల్, కేమర్ రోచ్,జేసన్ హోల్డర్, అల్జారీ జోసెఫ్ ల పైనే వెస్టిండీస్ పూర్తిగా ఆధారపడి ఉంది. స్పిన్ జోడీ జోమెల్ వారికాన్, రకీమ్ కార్న్ వాల్ లు సైతం కీలకపాత్ర పోషించనున్నారు.

భారత కాలమాన ప్రకారం రాత్రి 7-30 గంటలకు ఈమ్యాచ్ ప్రారంభంకానుంది. వచ్చే ఐదురోజులపాటు మ్యాచ్ కొనసాగుతుందా? లేక నాలుగురోజుల్లోనే ముగిసిపోతుందా? తెలుసుకోవాలంటే మొదటి మూడురోజులఆట ముగిసే వరకూ వేచిచూడక తప్పదు.

First Published:  12 July 2023 12:00 PM IST
Next Story