రోహిత్, విరాట్ ల త్యాగంతో భారత పేసర్లకు బిజినెస్ క్లాస్!
టీ-20 ప్రపంచకప్ లో పాల్గొంటున్న భారత ప్రధాన ఫాస్ట్ బౌలర్లకు బిజినెస్ క్లాస్ యోగం పట్టింది. కెప్టెన్ రోహిత్, మాజీ కెప్టెన్ విరాట్, చీఫ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ ల పెద్దమనసుతో ఇది సాధ్యమయ్యింది.
టీ-20 ప్రపంచకప్ లో పాల్గొంటున్న భారత ప్రధాన ఫాస్ట్ బౌలర్లకు బిజినెస్ క్లాస్ యోగం పట్టింది. కెప్టెన్ రోహిత్, మాజీ కెప్టెన్ విరాట్, చీఫ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ ల పెద్దమనసుతో ఇది సాధ్యమయ్యింది...
టీ-20 ప్రపంచకప్ లో పాల్గొంటున్న భారత ఫాస్ట్ బౌలర్లను టీమ్ మేనేజ్ మెంట్ కంటికి రెప్పలా కాపాడుకొంటోంది. ఆస్ట్ర్రేలియాలోని ఫాస్ట్ , బౌన్సీ పిచ్ లపైన ప్రధానపాత్ర పోషిస్తున్న పేసర్లు మహ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్, అర్షదీప్ సింగ్, హార్థిక్ పాండ్యాలకు ప్రయాణసమయంలో ఎలాంటి అసౌకర్యం కలుగకుండా కెప్టెన్ రోహిత్ శర్మ, చీఫ్ కోచ్ రాహుల్ ద్రావిడ్, దిగ్గజ ఆటగాడు విరాట్ కొహ్లీ తగిన జాగ్రత్తలు తీసుకొంటున్నారు.
ఒక్కోజట్టు నాలుగే బిజినెస్ క్లాస్ టికెట్లు...
ప్రపంచకప్ లో పాల్గొనటానికి భారత్ నుంచి ఆస్ట్ర్రేలియా బయలుదేరిన నాటినుంచి భారత క్రికెటర్లు వివిధ నగరాలు వేదికగా జరిగే మ్యాచ్ ల్లో పాల్గొనటానికి వేలాదికిలోమీటర్ల దూరం ప్రయాణం చేయాల్సి వస్తోంది.
మెల్బోర్న్ నుంచి పెర్త్ నగరం చేరాలంటే 3వేల కిలోమీటర్లు ప్రయాణం చేయక తప్పదు. మెల్బో్ర్న్ నుంచి పెర్త్, పెర్త్ నుంచి అడిలైడ్, మెల్బోర్న్ నుంచి అడిలైడ్ నగరాలు చేరటానికి..ఐసీసీ విమాన ప్రయాణ సదుపాయ కల్పించింది.
ఐసీసీ నిబంధనల ప్రకారం ప్రపంచకప్ లో పాల్గొంటున్న ఒక్కోజట్టుకు సౌకర్యవంతంగా ఉండే నాలుగు బిజినెస్ క్లాస్ టికెట్లు మాత్రమే కేటాయిస్తున్నారు. మిగిలిన 18 టికెట్లు ఎగ్జిక్యూటివ్ క్లాస్ టికెట్లు మాత్రమే. సాధారణంగా తమకు కేటాయించిన నాలుగు బిజినెస్ క్లాస్ టికెట్లను టీమ్ చీఫ్ కోచ్, కెప్టెన్, టీమ్ మేనేజర్, టీమ్ సీనియర్ ప్లేయర్లకు ఇస్తూ ఉంటారు.
అయితే...ప్రస్తుత భారతజట్టులోని కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రావిడ్, సీనియర్ ప్లేయర్ విరాట్ కొహ్లీలతో పాటు టీమ్ మేనేజర్ కు మాత్రమే బిజినెస్ క్లాస్ టికెట్ల సౌకర్యం ఉంది.మిగిలిన ప్లేయర్లు, సహాయక సిబ్బంది మాత్రం సాధారణ తరగతిలో ...లెగ్ స్పెస్ అంతగా లేని సీట్లలో కూర్చుని ప్రయాణం చేయక తప్పదు.
కానీ ..ప్రపంచకప్ కే కీలకంగా మారిన ఫాస్ట్ బౌలర్లు ప్రయాణసమయంలో అలసిపోకుండా తగిన విశ్రాంతి పొందటానికి వీలుగా తమకు కేటాయించిన సీట్లను రోహిత్, ద్రావిడ్, విరాట్ త్యాగం చేశారు. దీంతో..సాధారణ తరగతిలో ప్రయాణం చేయాల్సిన ఫాస్ట్ బౌలర్లు అర్షదీప్ సింగ్, మహ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్, హార్థిక్ పాండ్యా మాత్రం సువిశాలమైన బిజినెస్ క్లాస్ తరగతిలో ప్రయాణం చేయగలుగుతున్నారు.
భారత మ్యాచ్ లకు అభిమానుల వెల్లువ!
ప్రపంచకప్ సూపర్ -12 రౌండ్ రెండు గ్రూపుల మ్యాచ్ లకు మొత్తం 5 లక్షల 90వేల మంది అభిమానులు హాజరయ్యారని..వీరిలో కేవలం భారత్ ఆడిన మ్యాచ్ లకు హాజరైన అభిమానులే 2 లక్షల 82వేల 780 మంది ఉన్నారని ఐసీసీ ప్రకటించింది.
మెల్బోర్న్ వేదికగా పాకిస్థాన్ తో ముగిసిన గ్రూపు ప్రారంభమ్యాచ్ కు 90వేల మంది, జింబాబ్వేతో జరిగిన ఆఖరిరౌండ్ మ్యాచ్ కు 80వేల మంది హాజరుకావడంతో భారత మ్యాచ్ లు ఆతిథ్య ఆస్ట్ర్రేలియా క్రికెట్ బోర్డుకు కాసుల వర్షం కురిపించాయి.
అడిలైడ్ ఓవల్ వేదికగా జరిగే రెండోసెమీఫైనల్లో ఇంగ్లండ్ తో భారత్ తలపడనున్న మ్యాచ్ కు సైతం టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. ఈ నెల 13న మెల్బోర్న్ వేదికగా జరిగే టీ-20 ప్రపంచకప్ ఫైనల్స్ కు భారతజట్టు చేరగలిగితే...లక్షమంది అభిమానులతో స్టేడియం కిటకిటలాడటం ఖాయమని నిర్వాహక సంఘం భావిస్తోంది.
భారతజట్టుకు డబ్బే డబ్బు!
ప్రపంచకప్ గ్రూపు లీగ్ లో అత్యధిక విజయాలు సాధించిన ఏకైకజట్టు భారత్ మిగిలినజట్ల కంటే ఎక్కువగా సంపాదించగలిగింది.సూపర్ -12 గ్రూప్ -2 మ్యాచ్ ల్లో
పాకిస్థాన్, నెదర్లాండ్స్, బంగ్లాదేశ్, జింబాబ్వేజట్లను ఓడించడం ద్వారా..మ్యాచ్ కు 32 లక్షల 62వేల 22 రూపాయల చొప్పున ఇప్పటికే కోటీ 25 లక్షల రూపాయల వరకూ రోహిత్ సేన సంపాదించగలిగింది.
సెమీఫైనల్లో ఇంగ్లండ్ పైన నెగ్గితే కనీసం 6 కోట్ల 52 లక్షల 64వేల 280 రూపాయల ప్రైజ్ మనీ ఖాయంగా దక్కనుంది. అదే టైటిల్ నెగ్గిన జట్టుకు ట్రోఫీతో పాటు 13 కోట్ల 50 లక్షల 35వేల 440 రూపాయల ప్రైజ్ మనీ అందచేయనున్నారు.
సూపర్ -12 రౌండ్ నుంచే నిష్ర్కమించిన ఆస్ట్ర్రేలియా, శ్రీలంక, దక్షిణాఫ్రికా, జింబాబ్వే, బంగ్లాదేశ్, ఐర్లాండ్, అఫ్ఘనిస్థాన్, నెదర్లాండ్స్ జట్లు 57 లక్షల రూపాయల చొప్పున ప్రైజ్ మనీతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. సెమీస్ లో ఓడిన రెండుజట్లకూ చెరో 3 కోట్ల 26 లక్షల రూపాయల చొప్పున దక్కనున్నాయి.