Telugu Global
Sports

వరల్డ్ కప్ స్పాన్సర్ బడ్‌వైజర్.. బీర్లు మాత్రం అమ్మొద్దు.. ఫ్యాన్స్ ఫైర్

ఫుట్‌బాల్ వరల్డ్ కప్ ముస్లిం దేశమైన ఖతర్‌లో నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఆల్కహాల్‌పై కఠినమైన నిబంధనలు అమలు చేస్తున్నారు.

వరల్డ్ కప్ స్పాన్సర్ బడ్‌వైజర్.. బీర్లు మాత్రం అమ్మొద్దు.. ఫ్యాన్స్ ఫైర్
X

ఫిఫా వరల్డ్ కప్ 2022 ఆదివారం నుంచి ఖతర్ వేదికగా ప్రారంభం కానున్నది. ప్రపంచంలో అత్యధిక మంది ఫుట్‌బాల్ ఆటంటే ప్రాణమిస్తారు. యూరోప్, అమెరికన్ దేశాల్లో ఫుట్‌బాల్‌కు ఉన్న ఆదరణ వేరే లెవెల్‌లో ఉంటుంది. క్లబ్ మ్యాచ్‌లకు కూడా విపరీతమైన ఆదరణ ఉంటుంది. ఫ్యాన్స్ హడావిడితో స్టేడియంలు అన్నీ కిక్కిరిసి పోతాయి. చేతిలో బీరు గ్లాసులతో వాళ్లు చేసే ఎంజాయ్ మామూలుగా ఉండదు. అలాంటిది వరల్డ్ కప్ అంటే ఫ్యాన్స్ ఏ స్థాయిలో ప్రిపేర్ అవుతారో చెప్పనక్కరలేదు.

ఈ సారి ఫుట్‌బాల్ వరల్డ్ కప్ ముస్లిం దేశమైన ఖతర్‌లో నిర్వహిస్తున్నారు. అక్కడ ఆల్కహాల్‌పై కఠినమైన నిబంధనలు అమలు చేస్తున్నారు. ఎలాంటి ఆల్కహాల్ ప్రొడక్ట్స్ స్టేడియం లోపల, వెలుపల విక్రయించ కూడదని ఆంక్షలు విధించింది. దీనిపై ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఖతర్‌కు యూరోప్, అమెరికన్ దేశాల నుంచి దాదాపు 10 లక్షల మంది ఫ్యాన్స్ వస్తారని ఫిఫా అంచనా వేసింది. విదేశీయులు ఎక్కువగా మ్యాచ్ సమయంలో బీర్లు తాగుతుంటారు. కానీ ఇప్పుడు బీర్లు అమ్మవద్దని చెప్పడంతో వాళ్లు ఫైర్ అవుతున్నారు.

ఫిఫా వరల్డ్ కప్‌ను కోకాకోలా, హ్యుండయ్-కియా, ఖతర్ ఎయిర్‌వేస్, విసా, మెక్‌డొనల్డ్స్, వివో వంటి బ్రాండ్లతో పాటు అన్‌హైషర్ బుష్-ఇన్‌బెవ్ అనే బ్రూవరీ కంపెనీ కూడా స్పాన్సర్ చేస్తోంది. ఇది ప్రఖ్యాత బీర్ల బ్రాండ్ బడ్‌వైజర్, కరోనాకు మాతృసంస్థ. ఫిఫాతో ఎప్పటి నుంచో ఈ సంస్థకు అనుబంధం ఉన్నది. ఎక్కడ ఫిఫా మ్యాచ్‌లు జరిగినా బడ్‌వైజర్, కరోనా బీర్లు గ్యాలన్ల కొద్దీ అమ్ముడు పోతాయి. ఖతర్ వరల్డ్ కప్ కోసం బడ్‌వైజర్ మాతృసంస్థ స్పాన్సర్ ఫీజు రూపంలో రూ. 610 కోట్లు చెల్లించింది. ఇప్పుడు బీర్ల అమ్మకాలపై నిషేధం కారణంగా పెద్ద ఎదురు దెబ్బ తగిలింది.

ఫ్యాన్స్ ఆల్కహాల్ నిషేధంపై ఫైర్ అవుతుండటం, బడ్‌వైజర్ కంపెనీ కూడా అసహనం వ్యక్తం చేయడంతో ఖతర్ రాయల్ ఫ్యామిలీ అల్ థానీ రంగంలోని దిగింది. స్టేడియం చుట్టుపక్కల, బహిరంగ ప్రదేశాల్లో మాత్రమే నిషేధం ఉంటుందని.. ఫ్యాన్స్ ఫెస్టివల్ జోన్లలో ఎలాంటి నిషేధం లేదని ప్రకటించింది. స్టార్ హోటల్స్, బార్లలో యధావిధిగా ఆల్కహాల్ అమ్మకాలు ఉంటాయని.. అయితే బహిరంగ ప్రదేశంలో ఆల్కహాల్ సేవిస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. నాన్ ఆల్కహాలిక్ ప్రొడక్ట్ అయిన బడ్‌వైజర్ జీరో మాత్రం స్టేడియంలో అమ్మడానికి అనుమతి ఇచ్చింది. దీంతో పాటు కోకకోలా వారి ప్రొడక్ట్స్ కూడా లభిస్తాయి.

ఖతర్‌లో ఎప్పటి నుంచో ఆల్కహాల్ అమ్మకాలపై కఠిన ఆంక్షలు ఉన్నాయి. అలాగే హోమో సెక్సువాలిటీ పట్ల కఠినంగా వ్యవహరిస్తుంటారు. అందుకే ఫిఫా ముందుగానే పాశ్చాత్య దేశాల నుంచి వచ్చే ఫ్యాన్స్‌ను హెచ్చరిస్తోంది. ఖతర్‌లో కఠినమైన ముస్లిం లా అమలులో ఉంటుందని, జాగ్రత్తలు పాటించాలని చెబుతోంది. ఫిఫా వరల్డ్ కప్ జరిగే రోజుల్లో కాస్త చూసీ చూడనట్లు వ్యవహరించాలని కూడా ఫ్యాన్స్ క్లబ్స్ నుంచి వినతులు వస్తున్నాయి.

First Published:  19 Nov 2022 10:58 AM IST
Next Story