కింగ్ పీలేకి బ్రెజిల్ తుది వీడ్కోలు!
కొద్దిరోజుల క్రితం కన్నుమూసిన బ్రెజిల్ దిగ్గజ ఆటగాడు, ప్రపంచ ఫుట్ బాల్ శిఖరం కింగ్ పీలేకు ప్రపంచ సాకర్ అభిమానులు శోకతప్త హృదయాలతో కన్నీటి వీడ్కోలు పలికారు.
కొద్దిరోజుల క్రితం కన్నుమూసిన బ్రెజిల్ దిగ్గజ ఆటగాడు, ప్రపంచ ఫుట్ బాల్ శిఖరం కింగ్ పీలేకు ప్రపంచ సాకర్ అభిమానులు శోకతప్త హృదయాలతో కన్నీటి వీడ్కోలు పలికారు. రోమన్ కాథలిక్ ఆచారం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు....
ప్రపంచ ఫుట్ బాల్ ను తన ఆటతీరుతో 21 సంవత్సరాలపాటు ఉర్రూతలూగించిన ఆల్ టైమ్ గ్రేట్ ఆటగాడు, తొలిసూపర్ స్టార్ కింగ్ పీలేకి బ్రెజిల్ అభిమానులు కన్నీటి వీడ్కోలు పలికారు.
క్యాన్సర్ వ్యాధితో పోరాడుతూ గత నెల 29న కన్నుమూసిన 82 సంవత్సరాల పీలే మృతికి సంతాపసూచకంగా గత మూడురోజులుగా బ్రెజిల్ ప్రభుత్వం సంతాపదినాలు పాటించింది.
తాను పుట్టి, పెరిగిన నగరం, తనను ఆకాశం ఎత్తుకు ఎదిగేలా ప్రోత్సహించిన సాంటోస్ క్లబ్ ప్రధాన కేంద్రం విలా బెల్మిరో వేదికగా అంత్యక్రియల కార్యక్రమం నిర్వహించారు.
కింగ్ పీలే స్మృతిలో....
తమ దేశానికి మూడుసార్లు ప్రపంచకప్ అందించడంతో పాటు..అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చిన పీలే ఘనతను స్మరించుకొంటూ...గత మూడురోజులుగా నివాళులర్పిస్తూ బ్రెజిల్ అభిమానులు గడిపారు.
16వేల సీటింగ్ సామర్థ్యం కలిగిన విలా బెల్మిరో స్టేడియంలో పీలే పార్థివ దేహాన్ని అభిమానులు, ప్రముఖుల సందర్శనార్థం ఉంచారు. బ్రెజిల్ అధ్యక్షుడు లూయి ఇనాషియో లులా డా సిల్వా తన భార్యతో కలసి నివాళులర్పించారు.
అంతర్జాతీయ ఫుట్ బాల్ సంఘం అధ్యక్షుడు గియాన్నీ ఇన్ ఫాంటినో, దక్షిణ అమెరికా ఖండ దేశాల ప్రముఖులు, నేతలు సైతం పీలేకి శ్రద్దాంజలి ఘటించారు.
శావో పాలోకి 75 కిలోమీటర్ల దూరంలో ఉన్న విలా బెల్మిరో ప్రాంతంలోనే పీలే పుట్టి పెరిగి ఫుట్ బాల్ దిగ్గజంగా ఎదిగారు.
21 సంవత్సరాలు..మూడు ప్రపంచకప్ లు...
నిరుపేద కుటుంబంలో జన్మించిన పీలే తన కుటుంబ పోషణ కోసం వీధుల్లో తిరుగుతూ బఠాణీలు అమ్మేవారు. 16 సంవత్సరాల చిరుప్రాయంలో ప్రొఫెషనల్ పుట్ బాల్ లో అడుగుపెట్టిన పీలే ఆ తర్వాత నుంచి తన ఆటతీరుతో దేశం దేశాన్నే సమ్మోహితులను చేశారు. 1958, 1962, 1970 సంవత్సరాలలో బ్రెజిల్ ను ప్రపంచ ఫుట్ బాల్ చాంపియన్ గా నిలపడంలో పీలే ప్రముఖపాత్ర పోషించారు. పీలే అసలు పేరు ఎడ్సన్ ఆరేంటస్ డు నాస్కిమెంటో. అయితే..ఫుట్ బాలర్ గా మాత్రం ఆయన పీలేగా సుపరిచితులు. తన కెరియర్ లో 1283 గోల్స్ సాధించిన అసాధారణ రికార్డు పీలేకి ఉంది.
2016లో మార్షియో సిబెలీ అలోకీని మూడో వివాహం చేసుకొన్న పీలేకి 5గురు కుమార్తెలు, ఎడిన్హో అనే కుమారుడు ఉన్నారు. పీలే శవపేటికను చూసి ఆయన మూడో భార్య కన్నీరుమున్నీరుగా విలపించారు.
82 సంవత్సరాల పీలే మరణించిన వార్త 100 సంవత్సరాల వయసు కలిగిన ఆయన తల్లికి చెప్పలేదని పీలే సోదరి తెలిపారు.
లాంగ్ లివ్ కింగ్ పీలే..నీవు అమరుడవు అంటూ నాటితరం అభిమానులు నినాదాలు చేస్తూ వీడ్కోలు పలికారు. పీలే అంత్యక్రియల కార్యక్రమం అభిమానులు చూడటానికి వీలుగా శావోపాలో నగరవీధుల్లో భారీ స్క్ర్రీన్లను ఏర్పాటు చేశారు.
పీలే జ్ఞాపకార్థం ఓ స్టేడియానికి పేరుపెట్టాలని, ఆయన సమాధిని ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని బ్రెజిల్ ప్రభుత్వం నిర్ణయించింది. అంతర్జాతీయ ఫుట్ బాల్ సమాఖ్య సైతం..పీలే పేరుతో ప్రత్యేకంగా ఓ అవార్డును ఏర్పాటు చేయాలన్న ఆలోచనతో ఉంది.
పీలే మృతితో ప్రపంచ ఫుట్ బాల్ తొలిసూపర్ స్టార్ శకం ముగిసినట్లయ్యింది.