ప్రపంచకప్ లో బ్రెజిల్ బ్యాంగ్ బ్యాంగ్!
2022 ప్రపంచకప్ ఫుట్ బాల్ టోర్నీలో హాట్ ఫేవరెట్ బ్రెజిల్ తొలిగెలుపుతో శుభారంభం చేసింది. తన కళాత్మక ఆటతీరుతో అభిమానులను కట్టి పడేసింది.
2022 ప్రపంచకప్ ఫుట్ బాల్ టోర్నీలో హాట్ ఫేవరెట్ బ్రెజిల్ తొలిగెలుపుతో శుభారంభం చేసింది. తన కళాత్మక ఆటతీరుతో అభిమానులను కట్టి పడేసింది.
ఐదుసార్లు విశ్వవిజేత, హాట్ ఫేవరెట్, ప్రపంచ టాప్ ర్యాంకర్ బ్రెజిల్..2022 ఫిఫా ప్రపంచకప్ టైటిల్ వేటను తనదైన శైలిలో మొదలు పెట్టింది. యూరోపియన్ క్వాలిఫైయర్ సెర్బియాతో జరిగిన పోటీలో 2-0 గోల్స్ తో విజేతగా నిలిచింది.
సాంబా టీమ్ దూకుడు...
సెర్బియాతో పోటీ మొదలైన తొలినిముషం నుంచే బ్రెజిల్ ఆటగాళ్లు ప్రత్యర్థి గోల్ పైకి మెరుపుదాడులతో చెలరేగిపోయారు. చక్కటి డ్రిబ్లింగ్, కుదురైన పాసింగ్ తో..లయాత్మక ఆటతీరుతో బంతిని తమ అదుపులోనే ఉంచుకొంటూ మిడ్ ఫీల్డ్ లో పట్టు సాధించారు.
మరోవైపు..సెర్బియా జట్టు సైతం దీటుగా ఆడటానికి తనవంతు ప్రయత్నం చేసింది. తెరలు తెరలుగా దాడులు చేస్తున్న సాంబా ఫార్వర్డ్ లైన్ ను నిలువరించడానికి తంటాలు పడింది.
రిచార్లీసన్ డబుల్ ధమాకా...
ఇప్పటికే ఐదుసార్లు ప్రపంచకప్ టైటిల్ నెగ్గిన బ్రెజిల్..ఆరో టైటిల్ కు గురిపెట్టింది. సాంబా ప్రధాన ఆటగాడు నైమర్ ను సెర్బియన్ డిఫెండర్లు నీడలా వెంటాడి గోల్ చేయనివ్వకుండా కట్టడి చేయగలిగారు. తమ దృష్టంతా నైమర్ పైనే కేంద్రీకరించడంతో ..వినీషియస్ జూనియర్, రిచార్లీసన్ బాధ్యత తీసుకొని ఆడారు.
ఆట 62వ నిముషంలో తొలిగోలు సాధించిన రిచార్లీసన్..73వ నిముషంలో మరో మెరుపు గోల్ తో తన జట్టు విజయం ఖాయం చేశాడు.
లూసెయిల్ స్టేడియం వేదికగా జరిగిన ఈ పోరు హోరాహోరీగా సాగినట్లు కనిపించినా బ్రెజిల్ జట్టు ఆధిపత్యమే కొనసాగింది.
గ్రూపు దశలో తిరుగులేని బ్రెజిల్..
గ్రూపులీగ్ దశలో అత్యంత విజయవంతమైన జట్టుగా పేరున్న బ్రెజిల్ చివరి సారిగా 1998 ప్రపంచకప్ లో మాత్రమే నార్వే చేతిలో ఓటమి చవిచూసింది. గ్రూప్ - జీ మిగిలిన రెండురౌండ్లలో స్విట్జర్లాండ్, కమెరూన్ జట్లతో బ్రెజిల్ పోటీపడాల్సి ఉంది.
2018 ప్రపంచకప్ సాకర్ క్వార్టర్ ఫైనల్లో బెల్జియం చేతిలో ఓటమి పొందిన బ్రెజిల్..ఆ తర్వాత నుంచి వరుస విజయాలతో దూసుకుపోతూ టాప్ ర్యాంకర్ గా నిలిచింది.
ప్రపంచ ఫుట్ బాల్ లో టాప్ ర్యాంకర్ గా ఉన్న బ్రెజిల్ కు 21వ ర్యాంకర్ సెర్బియా సరిజోడీ కాలేకపోయింది.
బ్రెజిల్ ఆల్ టైమ్ గ్రేట్ స్టార్ పీలే పేరుతో ఉన్న 77 గోల్స్ అంతర్జాతీయ రికార్డును అధిగమించాలంటే మిగిలిన రెండురౌండ్లలో మరో రెండుగోల్స్ సాధిస్తే..సరికొత్త రికార్డు నెలకొల్పిన సాంబా ప్లేయర్ కాగలుగుతాడు.
పోర్చుగల్ తొలిగెలుపు..
గ్రూపు- హెచ్ లీగ్ లో భాగంగా జరిగిన మరో తొలిరౌండ్ పోరులో యూరోపియన్ మాజీ చాంపియన్ పోర్చుగల్ 3-2 గోల్స్ తో ఆఫ్రికన్ చాంపియన్ ఘనాను అధిగమించింది.
దోహాలోని స్టేడియం- 974 వేదికగా జరిగిన ఈ పోరు క్రిస్టియానో రొనాల్డో షోగానే సాగింది. ఆట 65వ నిముషంలో లభించిన స్పాట్ కిక్ ను గోలుగా మలచడం ద్వారా రొనాల్డో తనజట్టుకు 1-0 ఆధిక్యం అందించాడు. జావో ఫెలిక్స్, రాఫేల్ లీయోవో చెరో గోలు సాధించడంతో పోర్చుగల్ 3-2తో ఘనను ఓడించగలిగింది.
ఘనా తరపున ఉస్మాన్ బుకారీ, ఖుద్దూస్ చెరో గోల్ సాధించగలిగారు.
ఈ పోటీలో తొలిగోల్ సాధించడం ద్వారా ఐదు వేర్వేరు ప్రపంచకప్ టో్ర్నీలలో గోల్స్ సాధించిన తొలి ప్లేయర్ గా క్రిస్టియానో రొనాల్డో చరిత్ర సృష్టించగలిగాడు.