ఢిల్లీటెస్టులో రికార్డుల మోత!
న్యూఢిల్లీ వేదికగా జరిగిన రెండోటెస్టులో భారత్ రికార్డుల మోతతో విజేతగా నిలిచింది.ప్రతిష్టాత్మక బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని నిలబెట్టుకోగలిగింది.
న్యూఢిల్లీ వేదికగా జరిగిన రెండోటెస్టులో భారత్ రికార్డుల మోతతో విజేతగా నిలిచింది.ప్రతిష్టాత్మక బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని నిలబెట్టుకోగలిగింది.
టెస్ట్ క్రికెట్ టాప్ ర్యాంకర్ ఆస్ట్ర్రేలియాతో జరుగుతున్న బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ నాలుగుమ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో ఆతిథ్య భారత్ విజయపరంపర కొనసాగుతోంది.
వరుసగా రెండోటెస్ట్ మ్యాచ్ లో సైతం భారత్ మూడురోజుల ఆటలోనే విజేతగా నిలిచింది.
న్యూఢిల్లీలో అజేయ భారత్...
నాగపూర్ విదర్భ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన తొలిటెస్టులో ఇన్నింగ్స్ విజయంతో శుభారంభం చేసిన రెండోర్యాంకర్ భారత్..న్యూఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన రెండోటెస్టులో సైతం మూడోరోజుఆటలోనే ఆస్ట్ర్రేలియాను 6 వికెట్లతో చిత్తు చేసి..నాలుగుమ్యాచ్ ల సిరీస్ లో 2-0తో పైచేయి సాధించింది. ప్రపంచ టెస్టు లీగ్ ఫైనల్స్ చేరాలంటే మిగిలిన రెండుటెస్టుల్లో భారత్ ఒక్కమ్యాచ్ లో నెగ్గినా సరిపోతుంది. మూడుటెస్టు మ్యాచ్ ఇండోర్ హోల్కార్ స్టేడియం వేదికగాను, ఆఖరి టెస్టు అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం వేదికగాను జరుగనున్నాయి.
న్యూఢిల్లీ వేదికగా 1993 నుంచి 2023 వరకూ ఆడిన మొత్తం 13 టెస్టుల్లోనూ భారత్ అజేయంగా నిలవడం ఓ అరుదైన రికార్డుగా మిగిలిపోతుంది. 1948 నుంచి 65 మధ్యకాలంలో ముంబై బ్రబోర్న్ స్టేడియం వేదికగా 13 టెస్టు విజయాలు సాధించిన భారత్..1997 నుంచి 2022 వరకూ మొహాలీ వేదికగా ఆడిన 13 టెస్టుల్లోనూ ఓటమి అన్నదే లేకుండా నిలిచింది.
కాన్పూర్ గ్రీన్ పార్క్ స్టేడియం వేదికగా 1959 నుంచి 82 వరకూ ఆడిన 11 టెస్టుల్లోనూ భారత్ అజేయంగా నిలవడం విశేషం.
హోంగ్రౌండ్లో విరాట్ ప్రపంచ రికార్డు...
భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కొహ్లీ..తన హోంగ్రౌండ్ న్యూఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియంలో ఓ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఆస్ట్రేలియాతో జరిగిన రెండోటెస్టు రెండో ఇన్నింగ్స్ లో వ్యక్తిగతంగా 12 పరుగులు స్కోరు సాధించడం ద్వారా..అంతర్జాతీయ క్రికెట్లో అత్యంతవేగంగా 25వేల పరుగులు సాధించిన మొనగాడిగా నిలిచాడు.
ఇప్పటి వరకూ మాస్టర్ సచిన్ టెండుల్కర్, కంగారూ దిగ్గజ ఆటగాడు రికీ పాంటింగ్ ల పేరుతో ఉన్న రికార్డులను విరాట్ తెరమరుగు చేశాడు. క్రికెట్ చరిత్రలో 25వేల పరుగుల మైలురాయి చేరిన ఆరో క్రికెటర్ గా విరాట్ నిలిచాడు. సచిన్ తర్వాత 25వేల పరుగులు సాధించిన భారత క్రికెటర్ విరాట్ మాత్రమే.
2010లో భారత్ తరపున అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రం చేసిన విరాట్..గత 13 సంవత్సరాల కాలంలో క్రికెట్ మూడుఫార్మాట్లలోనూ కలసి 492 ఇన్నింగ్స్ లో 25వేల పరుగులు సాధించగలిగాడు.
271 వన్డేలలో 12వేల 809 పరుగులు, 106 టెస్టు మ్యాచ్ ల్లో 8వేల 195 పరుగులు, 115 టీ-20 మ్యాచ్ ల్లో 4008 పరుగులతో సహా మొత్తం 25వేల పరుగులు చేయగలిగాడు. టెస్టుల్లో 27 శతకాలు, వన్డేలలో 46 సెంచరీలు, టీ-20ల్లో ఒకే ఒక్క సెంచరీ విరాట్ నమోదు చేశాడు.
భారత్ తరపున 200 టెస్టులు ఆడిన సచిన్ టెండుల్కర్ తన కెరియర్ లో మొత్తం 34 వేల 357 పరుగులు సాధించాడు.
25వేల అంతర్జాతీయ పరుగులు సాధించటానికి సచిన్ 577 ఇన్నింగ్స్ ఆడితే..పాంటింగ్ 588 ఇన్నింగ్స్ లో ఈ ఘనత సాధించాడు. అయితే ..విరాట్ కొహ్లీ మాత్రం కేవలం 549 ఇన్నింగ్స్ లోనే అత్యంత వేగంగా 25వేల పరుగులు సాధించగలిగాడు.
అనీల్ కుంబ్లే సరసన జడేజా...
భారత జాదూ స్పిన్నర్ రవీంద్ర జడేజా..ఢిల్లీ టెస్టు రెండో ఇన్నింగ్స్ లో 42 పరుగులకే 7 వికెట్లు పడగొట్టాడు. తన కెరియర్ లో 12వ సారి ఓ టెస్టు ఇన్నింగ్స్ లో 5 వికెట్లు సాధించాడు.
జడేజా పడగొట్టిన 7 వికెట్లలో ఐదుగురు కంగారూ బ్యాటర్లు క్లీన్ బౌల్డ్ కావడం ఓ అరుదైన రికార్డుగా మిగిలిపోతుంది.
గత 21 సంవత్సరాల కాలంలో ఓ స్పిన్ బౌలర్ ఐదుగురు టెస్టు బ్యాటర్లను ఓ ఇన్నింగ్స్ లో క్లీన్ బౌల్డ్ చేయటం విశేషం.
1992 సిరీస్ లో భాగంగా జోహెన్స్ బర్గ్ వేదికగా జరిగిన టెస్టుమ్యాచ్ లో ఐదుగురు సౌతాఫ్రికా బ్యాటర్లను లెగ్ స్పిన్నర్ అనీల్ కుంబ్లే..క్లీన్ బౌల్డ్ గా పడగొట్టాడు.
ఆ తర్వాత 21 సంవత్సరాలకు రవీంద్ర జడేజా అదే ఘనతను సాధించడం ద్వారా కుంబ్లే సరసన నిలువగలిగాడు.
వందోటెస్టులో పూజారా విన్నింగ్ రన్...
టెస్టు చరిత్రలో వందమ్యాచ్ లు ఆడిన భారత 13వ క్రికెటర్ గా రికార్డుల్లో చేరిన చతేశ్వర్ పూజారా ..జట్టు విన్నింగ్ రన్స్ సాధించడం ద్వారా రికీ పాంటింగ్ సరసన నిలిచాడు.
ఢిల్లీ టెస్టు తొలిఇన్నింగ్స్ లో డకౌట్ గా వెనుదిరిగిన పూజారా..రెండో ఇన్నింగ్స్ లో ఆఫ్ స్పిన్నర్ టోడ్ మర్ఫీ బౌలింగ్ లో బౌండ్రీ బాదడం ద్వారా తనజట్టుకు 6 వికెట్ల విజయాన్ని అందించాడు.
2006 టెస్టు సిరీస్ లో సౌతాఫ్రికాపైన తన వందో టెస్టు మ్యాచ్ ఆడుతూ రికీ పాంటింగ్ విన్నింగ్ రన్స్ సాధించాడు.
ఆస్ట్ర్రేలియాతో టెస్టు మ్యాచ్ ల తొలిఇన్నింగ్స్ లో పూజారా సగటు 19.90 కాగా..రెండో ఇన్నింగ్స్ లో 48.73గా ఉంది.
స్వదేశంలో తిరుగులేని భారత్..
గత ఎనిమిది దశాబ్దాల కాలంలో భారత్- ఆస్ట్ర్రేలియాజట్లు పలు టెస్టు సిరీస్ ల్లో భాగంగా 104సార్లు తలపడితే..ఆస్ట్ర్రేలియా 43 విజయాలు, భారత్ 32 విజయాల రికార్డుతో ఉన్నాయి. 28 టెస్టులు డ్రాగా ముగిస్తే..ఓ టెస్టు మ్యాచ్ టైగా రికార్డుల్లో చేరింది.
గత మూడుసిరీస్ ల్లో భారత్ టాప్..
ఆస్ట్ర్రేలియా ప్రత్యర్థిగా భారత్ ఆడిన గత మూడుసిరీస్ ల్లో అజేయంగా నిలవడం ఓ అసాధారణ ఘనతగా మిగిలిపోతుంది. భారత్ వేదికగా జరిగిన 2016-17 సిరీస్ , ఆస్ట్ర్రేలియా గడ్డపైన జరిగిన 2018- 19 సిరీస్, కంగారూల్యాండ్ వేదికగానే ముగిసిన 2020-21 సిరీస్ ల్లో భారతజట్టే విజేతగా నిలిచింది.
ప్రస్తుత (2023 ) నాలుగుమ్యాచ్ ల సిరీస్ లోని మొదటి రెండుటెస్టుల్లో సైతం భారత్ నెగ్గడం ద్వారా 2-0తో పైచేయి సాధించింది. 1996 నుంచి బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ నిర్వహిస్తున్నారు. భారత్ వరుసగా నాలుగోసారి బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీని కైవసం చేసుకోనుంది.