Telugu Global
Sports

బీసీసీఐ అధ్యక్షపదవికి బిన్నీ నామినేషన్

ప్రపంచంలోనే అత్యంత భాగ్యవంతమైన క్రికెట్ బోర్డు బీసీసీఐ అధ్యక్షపదవికి భారత మాజీ ఆల్ రౌండర్ రోజర్ బిన్నీ నామినేషన్ దాఖలు చేశారు

బీసీసీఐ అధ్యక్షపదవికి బిన్నీ నామినేషన్
X

ప్రపంచంలోనే అత్యంత భాగ్యవంతమైన క్రికెట్ బోర్డు బీసీసీఐ అధ్యక్షపదవికి భారత మాజీ ఆల్ రౌండర్ రోజర్ బిన్నీ నామినేషన్ దాఖలు చేశారు. 67 సంవత్సరాల బిన్నీ బీసీసీఐ 36వ చైర్మన్ గా ఎంపిక కావడం ఇక కేవలం లాంఛనం మాత్రమే....

భారత క్రికెట్ నియంత్రణమండలి వార్షిక సర్వసభ్యసమావేశానికి వారంరోజుల ముందే కొత్తకార్యవర్గం కూర్పు తుదిరూపు తీసుకొంది. బోర్డు అధ్యక్షపదవికి కర్ణాటక క్రికెట్ సంఘం ప్రతినిధి, భారత మాజీ కెప్టెన్ రోజర్ బిన్నీ, కార్యదర్శి పదవికి గుజరాత్ క్రికెట్ సంఘం ప్రతినిధిగా కేంద్ర హోంమంత్రి కుమారుడు జే షా నామినేషన్లు దాఖలు చేశారు.

బోర్డు కోశాధికారి పదవికి ముంబైకి చెందిన బీజేపీ నాయకుడు అశీష్ షెలార్, బోర్డు ఉపాధ్యక్ష పదవికి కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా, ఐపీఎల్ బోర్డు చైర్మన్ గా కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ సోదరుడు అరుణ్ ధుమాల్, కార్యవర్గ సభ్యుడి పదవికి జగ్ మోహన్ దాల్మియా కుమారుడు అభిషేక్ దాల్మియా నామినేషన్లు దాఖలు చేశారు.

అక్టోబర్ 14న నామినేషన్ల దాఖలుకు చివరిరోజు కాగా...అక్టోబర్ 15న ఉపసంరణకు గడువుగా ప్రకటించారు.

అక్టోబర్ 18న ముంబైలో జరిగే బీసీసీఐ వార్షిక సర్వసభ్యసమావేశంలో కార్యవర్గ పదవులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. బీసీసీఐలోనూ బీజేపీ ప్రముఖనాయకులే తమ రాజకీయ పలుకుబడిని ఉపయోగిస్తూ పరోక్షంగా చక్రం తిప్పుతుండటం విశేషం.

36వ అధ్యక్షుడిగా రోజర్ బిన్నీ...

భారత క్రికెట్ నియంత్రణ మండలిని సంస్కరించడానికి సుప్రీంకోర్టు నియమించిన జస్టిస్ లోథా కమిటీ రూపొందించిన నియమావళి ప్రకారం...బోర్డు అధ్యక్షులుగా మాజీ క్రికెటర్లు మాత్రమే అర్హులు, ఈ నిబంధన...కర్ణాటక క్రికెట్ సంఘానికి ప్రాతినిధ్యం వహిస్తున్న భారత మాజీ ఆల్ రౌండర్ రోజర్ బిన్నీకి కలసి వచ్చింది.

భారత క్రికెట్ వర్గాలలో వివాదరహితుడు, పెద్దమనిషిగా పేరున్న 67 సంవత్సరాల రోజర్ బిన్నీ1983 ప్రపంచకప్ ను భారత్ గెలుచుకోడంలో ప్రముఖపాత్ర వహించిన ఆల్ రౌండర్లలో ఒకరు.

ప్రపంచకప్ లో 8 మ్యాచ్ లు ఆడి 18 వికెట్లు పడగొట్టిన రికార్డు బిన్నీకి ఉంది. గతంలో బీసీసీఐ సెలెక్షన్ కమిటీ సభ్యుడిగాను, జూనియర్ ప్రపంచకప్ లో భారత కోచ్ గానూ, బెంగాల్ జట్టుకు శిక్షకుడుగాను వ్యవహరించిన అనుభవం బిన్నీకి సొంతం.

భారత మాజీ ఆల్ రౌండర్ స్టువర్ట్ బిన్నీరోజర్ బిన్నీ కుమారుడే. అంతేకాదు విఖ్యాత క్రికెట్ యాంకర్ మయాంతి లాంగర్ రోజర్ బిన్నీకి కోడలు కూడా. ఏదైనా అద్భుతం జరిగితే మినహా...బీసీసీఐ సరికొత్త చైర్మన్ గా రోజర్ బిన్నీఎంపిక ఖాయమని బీసీసీఐ వర్గాలు గట్టిగా చెబుతున్నాయి.

రెండు పదవులకు జే షా గురి...

గతంలో గుజరాత్ , ప్రస్తుతం భారత క్రికెట్ చక్రం తిప్పుతున్న కేంద్ర హోంమంత్రి కుమారుడు జే షా..మరో రెండేళ్లపాటు బీసీసీఐ కార్యదర్శి పదవిలో కొనసాగాలని నిర్ణయించారు. అంతేకాదు..ఐసీసీలో భారత ప్రతినిధి పదవికీ గురిపెట్టారు.

అసోం ముఖ్యమంత్రి హేమంత బిశ్వశర్మ, కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ తమ పలుకుబడిని పూర్తిస్థాయిలో ఉపయోగించడం ద్వారా బోర్డు కార్యవర్గంలో తమ వర్గంవారిని జొప్పించడంలో సఫలమయ్యారు.

ఇదంతా చూస్తుంటే...రాజకీయ, వ్యాపారవర్గాల ప్రముఖులను భారత క్రికెట్ వ్యవహారాలకు దూరంగా ఉంచాలన్న జస్టిస్ లోథా కమిటీ లక్ష్యం పాక్షికంగా మాత్రమే నెరవేరిందని చెప్పక తప్పదు.

First Published:  12 Oct 2022 10:59 AM IST
Next Story