Telugu Global
Sports

ప్రపంచకప్ అర్హత కోసం చిన్నజట్లతో పెద్దజట్ల సమరం!

భారత్ వేదికగా జరిగే 2023 ఐసీసీ వన్డే ప్రపంచకప్ అర్హత సమరం ఆసక్తికరంగా మారింది. రెండుబెర్త్ ల కోసం చిన్నజట్లతో మాజీ చాంపియన్లు శ్రీలంక, వెస్టిండీస్ పోరాడనున్నాయి.

ప్రపంచకప్ అర్హత కోసం చిన్నజట్లతో పెద్దజట్ల సమరం!
X

భారత్ వేదికగా జరిగే 2023 ఐసీసీ వన్డే ప్రపంచకప్ అర్హత సమరం ఆసక్తికరంగా మారింది. రెండుబెర్త్ ల కోసం చిన్నజట్లతో మాజీ చాంపియన్లు శ్రీలంక, వెస్టిండీస్ పోరాడనున్నాయి.....

2023 -ఐసీసీ వన్డే ప్రపంచకప్ ఫైనల్ రౌండ్ కు ఇప్పటికే 8 జట్లు అర్హత సాధించడంతో..మిగిలిన రెండు స్థానాల కోసం ప్రపంచ మాజీ చాంపియన్లు శ్రీలంక, వెస్టిండీస్ తో పాటు మరో ఎనిమిది చిరుజట్లు క్వాలిఫైయింగ్ రేస్ లో నిలిచాయి.

పాపం! శ్రీలంక, వెస్టిండీస్....

వన్డే క్రికెట్లో ప్రపంచ మాజీ చాంపియన్లు శ్రీలంక, వెస్టిండీస్ జట్ల పరిస్థితి ఇంతబతుకూ బతికి అన్నట్లుగా తయారయ్యింది. భారత్ వేదికగా అక్టోబర్ లో జరిగే 2023 ఐసీసీ వన్డే ప్రపంచకప్ కు నేరుగా అర్హత సాధించడంలో ఈ ప్రపంచ మాజీ విజేత జట్లు విఫలమయ్యాయి.

ఇప్పటికే..ఐసీసీ ర్యాంకింగ్స్ ప్రాతిపదికన...భారత్, ఇంగ్లండ్, న్యూజిలాండ్, పాకిస్థాన్, ఆస్ట్ర్రేలియా, బంగ్లాదేశ్, అఫ్ఘనిస్థాన్, దక్షిణాఫ్రికా జట్లు మెయిన్ రౌండ్లో తమతమ బెర్త్ లు ఖాయం చేసుకొన్నాయి.

మిగిలిన రెండు బెర్త్ ల కోసం... మాజీ చాంపియన్లు శ్రీలంక, వెస్టిండీస్ తో పాటు మరో ఎనిమిది చిరుజట్లు తలపడబోతున్నాయి. జూన్ 18 నుంచి జులై 9 వరకూ జరుగనున్న అర్హత పోటీలలో జింబాబ్వే, నెదర్లాండ్స్, స్కాట్లాండ్, ఒమాన్, నేపాల్, అమెరికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఐర్లాండ్ జట్లతో దిగ్గజజట్లు శ్రీలంక, వెస్టిండీస్ అమీతుమీ తేల్చుకోనున్నాయి.

జింబాబ్వే వేదికగా ప్రపంచకప్ క్వాలిఫైయర్స్....

జింబాబ్వేలోని హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జూన్ 18వ తేదీ నుంచి వ‌ర‌ల్డ్ క‌ప్ క్వాలిఫైయ‌ర్ పోటీలు జరుగనున్నాయి. హ‌రారే స్పోర్ట్స్ క్ల‌బ్ తో పాటు బులావాయే క్వీన్స్ స్పోర్ట్స్ క్ల‌బ్, ట‌క‌షింగ క్రికెట్ క్ల‌బ్‌.. ఈ మూడు స్టేడియాల్లో మ్యాచ్‌లు నిర్వహిస్తారు.

‘ఐసీసీ పురుషుల వ‌ర‌ల్డ్ క‌ప్ కౌంట్‌డౌన్ తుది అంకానికి చేరింది. వ‌న్డే క్రికెట్‌లో అత్యుత్త‌మమైన ఈ టోర్నీకి అర్హ‌త సాధించేందుకు ప‌ది జ‌ట్ల‌కు ఇదో సువర్ణ అవ‌కాశం అని’ ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జియోఫ్ అల్ల‌ర్‌డైస్ ప్రకటించారు. ఈమ‌ధ్యనే ఐసీసీ.. క్వాలిఫైయ‌ర్ షెడ్యూల్ ను విడుద‌ల చేసింది.

10 జ‌ట్లు...2 గ్రూపులు

..ఐసీసీ మెగా టోర్నీలలో ఒకటైన వ‌న్డే వ‌రల్డ్ క‌ప్ అర్హ‌త కోసం ఈసారి ఎన్న‌డూ లేనంతగా పోటీ ఉంది. శ్రీలంక, వెస్టిండీస్‌, జింబాబ్వే లాంటి పెద్ద జ‌ట్ల‌తో పాటు నేపాల్, ఐర్లాండ్, స్కాట్లాండ్, ఒమ‌న్, యునైటెడ్ అర‌బ్ ఎమిరేట్స్, నెద‌ర్లాండ్స్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వంటి చిన్న జ‌ట్లు సైతం త‌మ అదృష్టాన్ని ప‌రీక్షించుకోనున్నాయి. ప‌ది జట్లను రెండుగ్రూపులుగా విభ‌జించి అర్హత పోటీలు నిర్వహిస్తారు.

గ్రూప్ ఏ – వెస్టిండీస్, జింబాబ్వే, నేపాల్, నెద‌ర్లాండ్స్‌, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తలపడనున్నాయి.

గ్రూప్ బి- శ్రీ‌లంక‌, ఐర్లాండ్, స్కాట్లాండ్, ఒమ‌న్, యునైటెడ్ అర‌బ్ ఎమిరేట్స్ ఢీ కొంటాయి.

జులై 9న క్వాలిఫైయర్స్ ఫైనల్ సమరం

ప్ర‌తి గ్రూప్ నుంచి మొదటి మూడుస్థానాలలో నిలిచిన జట్లు.. సూప‌ర్ సిక్స్ రౌండ్లో తలపడతాయి. సూప‌ర్ సిక్స్‌లో మొదటి రెండుస్థానాలలో నిలిచిన జట్ల నడుమ..

జూలై 9న హారారే స్పోర్ట్స్ క్ల‌బ్‌లో ఫైన‌ల్ మ్యాచ్ నిర్వహిస్తారు. ఫైన‌ల్ చేరిన రెండు జ‌ట్లు 2023 వ‌ర‌ల్డ్ క‌ప్ టోర్నీ ఫైనల్ రౌండ్లో మిగిలిన ఎనిమిదిజట్లతో కలసి పాల్గొంటాయి.

స్థానబలంతో జింబాబ్వే పోటీ...

సొంత గడ్డపై క్వాలిఫైయ‌ర్ టోర్నీ జరుగనుండడంతో ఆతిథ్య జింబాబ్వే స్థానబలంతో చెలరేగిపోవాలని భావిస్తోంది. అయితే… మాజీ చాంపియ‌న్లు వెస్టిండీస్, శ్రీ‌లంక నుంచి ఆ జ‌ట్ట‌కు గ‌ట్టి పోటీ ఎదురుకానుంది. ఐర్లాండ్, నెద‌ర్లాండ్స్‌, స్కాట్లాండ్ జ‌ట్లు త‌మదైన రోజున ఎలాంటి ప్ర‌త్య‌ర్థికైనా షాక్ ఇవ్వ‌గ‌ల‌వ‌ని ఇప్ప‌టికే నిరూపించాయి. ఒక‌ప్ప‌టి పెద్ద జ‌ట్లు వ‌ర‌ల్డ్ క‌ప్ టోర్నమెంట్‌కు అర్హ‌త సాధిస్తాయా? లేదా వీటికి షాకిచ్చి చిన్న జ‌ట్లు ఛాన్స్ కొట్టేస్తాయా? అనేది మ‌రికొన్ని రోజుల్లో తేల‌నుంది. ఈఏడాది భార‌త‌దేశం వ‌ర‌ల్డ్ క‌ప్ పోటీల‌కు ఆతిథ్యం ఇస్తోంది. అక్టోబ‌ర్ – న‌వంబ‌ర్ మ‌ధ్య‌లో వ‌ర‌ల్డ్ క‌ప్ టోర్నీ జ‌ర‌గనుంది. సొంత గడ్డ‌పై చివరిసారిగా భారత్ 2011 టోర్నీలో ఎంఎస్ ధోనీ సార‌థ్యంలో విజేతగా నిలిచింది. భార‌త జ‌ట్టు మరోసారి టైటిల్ గెలవాలన్న పట్టుదలతో ఉంది.

First Published:  5 Jun 2023 3:04 PM IST
Next Story