Telugu Global
Sports

భారత్‌–కివీస్‌ సెమీస్‌ కోసం ఏపీలో భారీ స్క్రీన్లు

గతంలో ఎప్పుడూ చూడనివిధంగా అనేక రకాల సంచలనాలు, అద్భుతాలతో ఎవరి అంచనాలకూ అందని రీతిలో ఈసారి ప్రపంచకప్‌ లీగ్‌ మ్యాచ్‌లు జరిగాయి.

భారత్‌–కివీస్‌ సెమీస్‌ కోసం ఏపీలో భారీ స్క్రీన్లు
X

గతంలో ఎప్పుడూ చూడనివిధంగా అనేక రకాల సంచలనాలు, అద్భుతాలతో ఎవరి అంచనాలకూ అందని రీతిలో ఈసారి ప్రపంచకప్‌ లీగ్‌ మ్యాచ్‌లు జరిగాయి. ఊహించని ఫలితాలతో.. అచ్చెరువొందే ప్రదర్శనలతో అభిమానులను ఈ మ్యాచ్‌లు అలరించాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా భారత జట్టు అన్ని విభాగాల్లో అద్భుత ప్రదర్శనతో అజేయంగా లీగ్‌ దశ ముగించింది. లీగ్‌లో జరిగిన 9 మ్యాచ్‌లలోనూ విజయం సాధించి 18 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. భారత క్రికెట్‌ అభిమానుల్లో ఎనలేని ఉత్సాహం నింపింది.

అభిమానుల్లో ఉత్కంఠ...

ఇక ఇప్పటివరకు ఒక లెక్క అయితే.. ఇక సెమీస్, ఫైనల్స్‌ మ్యాచ్‌లు మరో లెక్క అన్నట్టు ఉంటుంది. ఈ క్రమంలో భారత జట్టు సగర్వంగా సెమీస్‌ అడుగుపెట్టి.. కివీస్‌తో తలపడనుంది. ప్రపంచ కప్‌ అందుకోవడానికి మరో 2 మ్యాచ్‌ల దూరంలో నిలిచి ఉంది. ఈ క్రమంలో సగటు క్రికెట్‌ అభిమానులందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. లీగ్‌ దశలో మాదిరిగానే ఈ 2 మ్యాచ్‌లలోనూ అద్భుతమైన ప్రదర్శన కొనసాగించాలని ఆకాంక్షిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈనెల 15వ తేదీన జరగనున్న తొలి సెమీస్‌ పైనే అందరి దృష్టీ ఉంది. భారత్, న్యూజిలాండ్‌ జట్ల మధ్య జరిగే ఈ మ్యాచ్‌ కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

అభిమానుల కోసం ఏపీలో భారీ స్క్రీన్లు..

అభిమానుల ఆసక్తిని గమనించి భారత్, న్యూజిలాండ్‌ మధ్య జరగనున్న సెమీస్‌ మ్యాచ్‌ ప్రదర్శన కోసం ఈ నెల 15వ తేదీ బుధవారం నాడు ఏపీలో మూడు నగరాల్లో భారీ స్క్రీన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌ (ఏసీఏ) ఆధ్వర్యంలో విశాఖపట్నం, విజయవాడ, కడప నగరాల్లో ఈ స్క్రీన్లు ఏర్పాట్లు చేస్తున్నారు. బుధవారం మధ్యాహ్నం 1.30 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు మ్యాచ్‌ ప్రత్యక్ష ప్రసారాన్ని భారీ స్క్రీన్లపై ప్రదర్శించనున్నారు. విశాఖ ఆర్కే బీచ్‌లో కాళీమాత గుడి ఎదురుగా, విజయవాడలోని మున్సిపల్‌ స్టేడియం, కడపలోని ఆర్ట్స్‌ కాలేజీ మైదానంలో వీటిని ఏర్పాటు చేయనున్నట్లు ఏసీఏ ప్రతినిధులు తెలిపారు. ఒక్కో చోట సుమారు 10 వేల మంది వీక్షించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. భారీ స్క్రీన్ల పై మ్యాచ్‌ను వీక్షించేందుకు ఉచితంగా ప్రవేశం కల్పించనున్నారు.

First Published:  14 Nov 2023 10:50 AM IST
Next Story