Telugu Global
Sports

విశ్వవిజేతజట్టుకు బీసీసీఐ అపురూప సత్కారం!

ఐసీసీ అండర్ -19 బాలికల తొలి ప్రపంచకప్ విజేత భారతజట్టు సభ్యులను బీసీసీఐ అసాధారణ రీతిలో సత్కరించింది. మాస్టర్ సచిన్ చేతుల మీదుగా విజేతజట్టుకు 5 కోట్ల రూపాయల నజరానా అందచేసింది.

విశ్వవిజేతజట్టుకు బీసీసీఐ అపురూప సత్కారం!
X

ఐసీసీ అండర్ -19 బాలికల తొలి ప్రపంచకప్ విజేత భారతజట్టు సభ్యులను బీసీసీఐ అసాధారణ రీతిలో సత్కరించింది. మాస్టర్ సచిన్ చేతుల మీదుగా విజేతజట్టుకు 5 కోట్ల రూపాయల నజరానా అందచేసింది...

అండర్ -19 ప్రపంచకప్ క్రికెట్లో విజేతలుగా నిలవడం భారతజట్లకు కొత్తేమీకాదు. బాలుర విభాగంలో ఇప్పటికే భారత్ ఐదుసార్లు విశ్వవిజేతగా ట్రోఫీ అందుకొన్నా దక్కని గౌరవం, సత్కారం..తొలి టైటిల్ తోనే షెఫాలీవర్మ నాయకత్వంలోని భారత బాలికల జట్టు దక్కించుకొంది.

దక్షిణాఫ్రికా వేదికగా...

దక్షిణాప్రికా వేదికగా ఐసీసీ తొలిసారిగా నిర్వహించిన 2023 అండర్ -19 బాలికల ప్రపంచకప్ క్రికెట్ టోర్నీలో భారతజట్టు అందరి అంచనాలు తలకిందులు చేసి మరీ ప్రపంచ చాంపియన్ గా అవతరించింది.

ఆల్ రౌండర్ షెఫాలీవర్మ నాయకత్వంలో పాల్గొన్న భారత బాలికలజట్టు ఫైనల్లో ఇంగ్లండ్ ను 7 వికెట్ల తేడాతో అలవోకగా ఓడించి ఐసీసీ తొలిట్రోఫీని అందుకొని స్వదేశానికి తిరిగి వచ్చింది.

అహ్మదాబాద్ లో అరుదైన సత్కారం..

అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా న్యూజిలాండ్ తో ముగిసిన ఆఖరి టీ-20 మ్యాచ్ ప్రారంభానికి ముందు..ప్రత్యేకంగా నిర్వహించిన సత్కార కార్యక్రమంలో

భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నాడు.

అండర్ -19 ప్రపంచకప్ టైటిల్ సాధించిన భారత బాలికలను సచిన్ అభినందించాడు. సత్కారకార్యక్రమంలో జట్టు కెప్టెన్ షెఫాలీవర్మకు 5కోట్ల రూపాయల ప్రోత్సాహక నగదు బహుమతి అందించాడు.

ఈ కార్యక్రమంలో బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, కార్యదర్శి జే షా, ఇతర ప్రతినిధులు, గుజరాత్ క్రికెట్ సంఘం కార్యవర్గసభ్యులు పాల్గొన్నారు.

భారత అండర్ -19 జట్టు సభ్యులతో పాటు సహాయక సిబ్బందికి మొత్తం 5 కోట్ల రూపాయలను పంచనున్నారు.

మాస్టర్ సచిన్ తో కలసి భారత బాలికలు..అహ్మదాబాద్ స్టేడియం ప్రత్యేక గ్యాలరీలో కూర్చొని మరీ ..భారత్- న్యూజిలాండ్ జట్ల ఆఖరి టీ-20 మ్యాచ్ ను వీక్షించారు.

భారత క్రికెట్ చరిత్రలోనే మహిళా క్రికెటర్లు, అదీ జూనియర్ జట్టు అందుకొన్న అరుదైన పురస్కారం, సత్కారం ఇదే కావటం విశేషం.

మహిళా క్రికెట్ ను అట్టడుగు స్థాయి నుంచి బలోపేతం చేయటానికి ఐసీసీ పలురకాల కార్యక్రమాలు రూపొందించి వేల కోట్ల రూపాయలు వ్యయం చేస్తోంది. అందులో భాగంగానే 19 సంవత్సరాల లోపు బాలికలకు ప్రత్యేకంగా ప్రపంచకప్ నిర్వహించడం మొదలు పెట్టింది. ప్రస్తుత 2023 ప్రపంచకప్ నుంచి రెండేళ్లకోసారి టోర్నీని నిర్వహించనున్నారు.

First Published:  2 Feb 2023 11:31 AM IST
Next Story