Telugu Global
Sports

రిటైర్డ్ క్రికెటర్లకు బీసీసీఐ ముకుతాడు?

రిటైర్డ్ క్రికెటర్లను విదేశీ క్రికెట్ లీగ్ ల్లో పాల్గొనకుండా కట్టడి చేయాలని బీసీసీఐ భావిస్తోంది. అర్థంతర రిటైర్మెంట్లకు చెక్ చెప్పాలన్న పట్టుదలతో ఉంది.

రిటైర్డ్ క్రికెటర్లకు బీసీసీఐ ముకుతాడు?
X

రిటైర్డ్ క్రికెటర్లను విదేశీ క్రికెట్ లీగ్ ల్లో పాల్గొనకుండా కట్టడి చేయాలని బీసీసీఐ భావిస్తోంది. అర్థంతర రిటైర్మెంట్లకు చెక్ చెప్పాలన్న పట్టుదలతో ఉంది....

ఉరుమురిమి మంగళం మీద పడినట్లు బీసీసీఐ చూపు భారత రిటైర్డ్ క్రికెటర్ల పైన పడింది. భారత్ లో అన్ని రకాల క్రికెట్ ఫార్మాట్ల నుంచి రిటైరవుతున్నట్లు ప్రకటించి..ఎంచక్కా విదేశీ క్రికెట్ లీగ్ ల్లో పాల్గొంటున్న మాజీలపై కొరడ ఝళిపించడానికి బీసీసీఐ కసరత్తులు చేస్తోంది.

రాయుడి లాంటి క్రికెటర్లకు కోలుకోలేని దెబ్బే!

ఐపీఎల్ లో తమ కెరియర్ ను కొనసాగించే శక్తి, సామర్థ్యాలు ఉండీ, అర్థంతర రిటైర్మెంట్లతో విదేశీ క్రికెట్ లీగ్ ల్లో పాల్గొనాలని భావించే అంబటి రాయుడి లాంటి పలువురు మాజీ క్రికెటర్లను అదుపు చేయాలని బీసీసీఐ నిర్ణయించింది.

ముంబైలో జరిగిన బీసీసీఐ కీలక సమావేశంలో తీసుకొన్న పలు కీలక నిర్ణయాలలో..మాజీ క్రికెటర్లను విదేశీ లీగ్ ల్లో పాల్గొనకుండా కట్టడి చేయటం ఒకటని బోర్డు కార్యదర్శి జే షా పరోక్షంగా తెలిపారు.

పుట్టగొడుగుల్లా విదేశీ లీగ్ లు...

ఇండియన్ క్రికెట్ లీగ్ (ఐసీఎల్ ) ను చూసి ఐపీఎల్ పుట్టుకు వస్తే...ఇండియన్ ప్రీమియర్ లీగ్ సూపర్ హిట్ కావడంతో ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల క్రికెట్ బోర్డులు..సరికొత్త లీగ్ లకు తెరతీశాయి. దీంతో ఏడాది కాలంలో వివిధ దేశాల లీగ్ ల్లో పాల్గొనటం ద్వారా వివిధ దేశాల ప్రస్తుత, మాజీ క్రికెటర్లు రెండు చేతులా ఆర్జించగలుగుతున్నారు.

వెస్టిండీస్, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, ఇంగ్లండ్, ఆస్ట్ర్రేలియా దేశాలకు చెందిన పలువురు ప్రముఖ క్రికెటర్లు విదేశీ క్రికెట్ లీగ్ ల్లో జోరుగా పాల్గొంటున్నారు.

వెస్టిండీస్ ప్రధాన క్రికెటర్లంతా రిటైర్మెంట్ ప్రకటించి విదేశీ లీగ్ లకే ప్రాధాన్యమివ్వడంతో కరీబియన్ జట్టు డీలా పడిపోయింది.

గత 48 సంవత్సరాల కాలంలో ఐసీసీ వన్డే ప్రపంచకప్ కు వెస్టిండీస్ అర్హత సాధించడంలో విఫలమయ్యింది. స్కాట్లాండ్ లాంటి పసికూనజట్ల చేతిలో పరాజయాలు పొందేస్థాయికి దిగజారిపోయింది. సునీల్ నరైన్, డ్వయన్ బ్రావో, కిరాన్ పోలార్డ్ లాంటి పలువురు అగ్రశ్రేణి క్రికెటర్లు అర్థంతరంగా రిటైర్మెంట్ ప్రకటించి..విదేశీ క్రికెట్ లీగ్ ల్లో పాల్గొంటూ దండిగా సంపాదిస్తున్నారు. ప్రస్తుత అంతర్జాతీయ క్రికెట్లో ఇదో జాఢ్యంగా మారిపోయింది.

భారత క్రికెట్ కు సైతం అలాంటి పరిస్థితి రాకుండా నివారించటానికే బీసీసీఐ సైతం త్వరలో కట్టుదిట్టమైన నిబంధనలను అమలులోకి తీసుకురానుంది.

అమ్మపెట్టాపెట్టదు..అడుక్కుతినానివ్వదు...

బీసీసీఐ నిర్వహిస్తున్న ఐపీఎల్ లో ఫ్రాంచైజీ యాజమాన్యాలు గెలుపు గుర్రాలకే ప్రాధన్యమిస్తున్నాయి. పలువురు సీనియర్ క్రికెటర్లను వేలం ద్వారా తీసుకోకుండా నిర్ధాక్షణ్యంగా పక్కన పెడుతున్నాయి. చతేశ్వర్ పూజారా లాంటి దిగ్గజ బ్యాటర్ కే కనీసం 50 లక్షల రూపాయల కనీస ధర చెల్లించడానికి ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపకపోడంతో..ఇంగ్లీష్ కౌంటీ క్రికెట్లో పాల్గొనాల్సి వస్తోంది.

ఐపీఎల్ ద్వారా ఆదాయమూ రాక..వేరే ఏమీ చేయలేని పలువురు క్రికెటర్లు తమ కెరియర్లను అర్థంతరంగా ముగించి..విదేశీలీగ్ ల్లో పాల్గొనటం ద్వారా సంపాదించడానికే మొగ్గు చూపుతున్నారు.

ఇర్ఫాన్ పఠాన్, యూసుఫ్ పఠాన్, పార్థివ్ పటేల్, శ్రీశాంత్, స్టువర్ట్ బిన్నీ లాంటి భారత మాజీ క్రికెటర్లు జిమ్ ఆఫ్రో టీ-10 లీగ్ లో పాల్గొంటుంటే...యూసుఫ్ పఠాన్, రాబిన్ ఊతప్ప మాత్రం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా జరుగుతున్న ఐఎల్ టీ-20లో పాల్గొంటున్నారు.

ఇటీవలే ముగిసిన ఐపీఎల్ -16 సీజన్ తో రిటైర్మెంట్ ప్రకటించిన అంబటి రాయుడు సైతం అమెరికాలోని మేజర్ లీగ్ క్రికెట్లో పాల్గోనాలని భావిస్తున్నాడు. అయితే..వ్యక్తిగత కారణాలతో ఆ ఆలోచనను రాయుడు తాత్కాలికంగా పక్కనపెట్టినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. రానున్న ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లోని అధికారపార్టీ తీర్థం తీసుకోడం ద్వారా రాజకీయ అరంగేట్రం చేయటం దాదాపుగా రాయుడు ఖాయం చేసుకొన్నాడు.

మరోవైపు..బీసీసీఐతో ఎలాంటి కాంట్రాక్టు లేని రిటైర్డ్ క్రికెటర్లను ఏవిధంగా అదుపు చేస్తారంటూ క్రికెట్ విశ్లేషకులు మండి పడుతున్నారు.

First Published:  9 July 2023 1:11 PM IST
Next Story