Telugu Global
Sports

ఎంఎస్ ధోనీకి పెద్ద పదవి.. త్వరలో బీసీసీఐ నిర్ణయం?

వన్డే, టీ20ల్లో టీమ్ ఇండియాకు ధోనీని క్రికెట్ డైరెక్టర్‌గా నియమిస్తే.. రాహుల్ ద్రవిడ్‌పై కూడా భారం తగ్గుతుందని బీసీసీఐ అంచనా వేస్తోంది.

ఎంఎస్ ధోనీకి పెద్ద పదవి.. త్వరలో బీసీసీఐ నిర్ణయం?
X

టీమ్ ఇండియా వరుసగా ఐసీసీ ఈవెంట్లలో తడబడుతోంది. చివరి సారిగా భారత జట్టు 2013లో ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీని గెలుచుకున్నది. ఇక అప్పటి నుంచి మేజర్ టైటిల్స్ ఏవీ గెలవలేదు. 2014లో టీ20 వరల్డ్ కప్ రన్నరప్‌గా, 2016, 2022లో సెమీఫైనలిస్టుగా వెనుదిరిగారు. ఇక వన్డే వరల్డ్ కప్‌లో 2015, 2019 సెమీఫైనల్స్‌లో వెనుదిరిగారు. 2017 ఛాంపియన్స్ ట్రోఫీలో రన్నరప్‌గా నిలిచారు. 2021లో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో ఓడిపోయారు. స్వదేశీ, విదేశీ ద్వైపాక్షిక టోర్నీల్లో రికార్డులు సృష్టిస్తున్నా.. ఐసీసీ ఈవెంట్లలో మాత్రం తేలిపోతున్నారు. కీలకమైన మ్యాచ్‌లలో ఒత్తిడికి తట్టుకోలేక చేతులెత్తేస్తున్నారు.

టీమ్ ఇండియా కోచ్ రాహుల్ ద్రావిడ్ మూడు ఫార్మాట్లకు పని చేస్తుండటంతో అతడిపై ఒత్తిడి పడుతున్నట్లు టీమ్ మేనేజ్‌మెంట్ అంచనా వేస్తోంది. టీ20, వన్డేల్లో రాహుల్ ద్రవిడ్‌కు పని భారం తగ్గించాలని బీసీసీఐ కూడా భావిస్తోంది. గతంలో ఐసీసీ ఈవెంట్లలో భారత జట్టును ఛాంపియన్లుగా నిలిపిన ఎంఎస్ ధోనీకి క్రికెట్ డైరెక్టర్ పదవి కట్టబెట్టాలని బీసీసీఐ ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలుస్తున్నది. గత ఏడాది యూఏఈలో టీ20 వరల్డ్ కప్ జరిగిన సమయంలో ధోనీని మెంటార్‌గా నియమించింది. కేవలం వారం రోజుల పాటు మాత్రమే టీమ్ ఇండియాతో ధోనీ ఉన్నాడు. ఆ టోర్నీలో భారత జట్టు గ్రూప్ దశలోనే వెనుదిరిగింది. అయితే, ఈ సారి పూర్తి స్థాయి పాత్రను ధోనీకి కట్టబెట్టాలని బోర్డు పెద్దలు నిర్ణయించినట్లు తెలుస్తున్నది.

వన్డే, టీ20ల్లో టీమ్ ఇండియాకు ధోనీని క్రికెట్ డైరెక్టర్‌గా నియమిస్తే.. రాహుల్ ద్రవిడ్‌పై కూడా భారం తగ్గుతుందని అంచనా వేస్తోంది. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ధోనీ తన అనుభవాన్ని, నైపుణ్యాన్ని ఉపయోగించి మంచి టీమ్‌ను తయారు చేయగలడని బోర్డు పెద్దలు నిర్ణయానికి వచ్చారు. టీ20ల్లో స్పెషలైజ్డ్ ప్లేయర్లను తయారు చేసే బాధ్యత ధోనీపై పెట్టాలని, ఇక టీమ్‌ను నడిపించే కోచ్ పదవిని రాహుల్ ద్రవిడ్‌కే ఉంచాలని బోర్డు అనుకుంటోంది. పర్మనెంట్ రోల్ ఇవ్వడం వల్ల ధోనీ మరింత సమర్థవంతంగా పని చేయగలడని కూడా విశ్వసిస్తోంది.

వచ్చే ఏడాది ఐపీఎల్ తర్వాత ధోనీ చెన్నై జట్టు నుంచి తప్పుకునే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత అతడికి పూర్తి స్థాయిలో డైరెక్టర్ పదవిని బీసీసీఐ ఆఫర్ చేయనున్నట్లు 'టెలిగ్రాఫ్' పత్రిక ఒక కథనాన్ని ప్రచురించింది. ఇప్పటికే ధోనీకి బోర్డు సమాచారం కూడా అందించిందని, అతడు కూడా సుముఖంగానే ఉన్నట్లు పేర్కొన్నది. ఈ నెలాఖరులో బీసీసీఐ అత్యున్నత సమావేశం జరుగనున్నది. అప్పుడే ధోనీ పదవిపై ఆమోద ముద్ర లభించే అవకాశం ఉంది.

బీసీసీఐ సమావేశంలోనే క్రికెట్ అడ్వైజరీ కమిటీ ఏర్పాటుపై కూడా చర్చ జరుగనున్నది. అలాగే సెలక్షన్ కమిటీలో కొత్త సభ్యుల నియామకంపై నిర్ణయం తీసుకోనున్నారు. మూడు ఫార్మాట్లకు ముగ్గురు కోచ్‌లు అనే అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లు బీసీసీఐ వర్గాలు చెప్తున్నాయి. అయితే, బోర్డు మాత్రం ప్రస్తుతానికి ఆ అంశంపై పెద్దగా ఆసక్తి చూపడం లేదని తెలుస్తున్నది.ఏదేమైనా ధోనీ తిరిగి భారత జట్టులో కొత్త రూపంలో కనిపించనున్నడనే వార్తలు అతడి అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది.

First Published:  15 Nov 2022 7:46 PM IST
Next Story