ఇకపై పురుషులతో సమానంగా మహిళా క్రికెటర్ల వేతనాలు : బీసీసీఐ
ప్రపంచ క్రికెట్‌లో పురుషులతో సమానంగా మహిళలకు వేతనాలు ఇస్తున్న రెండో బోర్డుగా బీసీసీఐ నిలిచింది.
భారత మహిళా క్రికెట్ చరిత్రలో సరికొత్త అధ్యాయానికి తెరతీసింది. మహిళ క్రికెటర్ల విషయంలో బీసీసీఐ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నది. ఇకపై పురుష క్రికెటర్లతో సమానంగా మహిళా కాంట్రాక్ట్ క్రికెటర్లు వేతనాలు పొందుతారని బీసీసీఐ ప్రకటించింది. ఈ మేరకు బోర్డు కార్యదర్శి జై షా ఓ ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇకపై వేతనాలు విషయంలో లింగ వివక్ష ఉండబోదని బోర్డు తెలిపింది.
'వివక్షను రూపుమాపే విషయంలో బీసీసీఐ తొలి అడుగు వేస్తున్నది. ఇకపై బీసీసీఐతో కాంట్రాక్ట్ ఉన్న మహిళా క్రికెటర్లు కూడా పురుషులతో సమానమైన వేతనాలు పొందుతారు. ఈ నిర్ణయం తక్షణమే అమలులోకి వస్తుంది. మ్యాచ్ ఫీజు విషయంలో ఇకపై ఎలాంటి తేడాలు ఉండబోవు. భారత క్రికెట్ లింగ సమానత్వం విషయంలో సరికొత్త శకంలోకి అడుగుపెడుతున్నది' అని జై షా ట్వీట్ చేశారు. అక్టోబర్ 27ను మహిళా క్రికెటర్లు ఎంతో గుర్తుంచుకోవల్సిన రోజని ఆయన చెప్పుకొచ్చారు.
భారత పురుష క్రికెటర్లకు టెస్ట్ మ్యాచ్‌కు రూ. 15 లక్షలు, వన్డేకు రూ. 6 లక్షలు, టీ20కి రూ. 3 లక్షలు మ్యాచ్ ఫీజుగా లభిస్తున్నది. ఇప్పుడు బీసీసీఐ తీసుకున్న నిర్ణయంతో మహిళా క్రికెటర్లకు కూడా ఇంతే మొత్తం మ్యాచ్ ఫీజుగా పొందనున్నారు. పురుష క్రికెటర్లు ఎక్కవ మ్యాచ్‌లు ఆడతారు. కాబట్టి వాళ్లు ఏడాదిలో ఎక్కువ సంపాదించే వీలుంది. రాబోయే రోజుల్లో మహిళా క్రికెట్ మ్యాచ్‌ల సంఖ్య కూడా పెరిగే వీలుంది. దీంతో వీరికి కూడా భారీగా మ్యాచ్ ఫీజ్ రూపంలో డబ్బు అందనున్నది. కాగా, మహిళలకు మ్యాచ్ ఫీజ్ పురుషులతో సమానంగా ఇవ్వడంపై మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ హర్షం వ్యక్తం చేశారు. మాజీ స్పిన్నర్ హర్బజన్ సింగ్ కూడా బోర్డు నిర్ణయాన్ని స్వాగతించాడు.
ప్రపంచ క్రికెట్‌లో పురుషులతో సమానంగా మహిళలకు వేతనాలు ఇస్తున్న రెండో బోర్డుగా బీసీసీఐ నిలిచింది. ఈ ఏడాది జులై నుంచే న్యూజీలాండ్ క్రికెట్ బోర్డు మహిళా క్రికెటర్లకు సమాన వేతనాలు ప్రకటించింది. బీసీసీఐ ఇప్పటికే పురుషులతో సమానంగా ట్రావెల్, అకామిడేషన్, ట్రైనింగ్ ఫెసిలిటీస్ మహిళలకు అందిస్తోంది. మరే దేశంలో ఇలాంటి సౌకర్యాలు మహిళా క్రికెటర్లకు లేవు.
I'm pleased to announce @BCCI's first step towards tackling discrimination. We are implementing pay equity policy for our contracted @BCCIWomen cricketers. The match fee for both Men and Women Cricketers will be same as we move into a new era of gender equality in Cricket. pic.twitter.com/xJLn1hCAtl
— Jay Shah (@JayShah) October 27, 2022