టీ20 వరల్డ్ కప్‌కు జట్టును ప్రకటించిన బీసీసీఐ
ఐసీసీ టీ20 వరల్డ్ కప్ అక్టోబర్ 16 నుంచి నవంబర్ 13 వరకు ఆస్ట్రేలియా వేదికగా జరుగనున్నది.
ఐసీసీ టీ20 వరల్డ్ కప్ అక్టోబర్ 16 నుంచి నవంబర్ 13 వరకు ఆస్ట్రేలియా వేదికగా జరుగనున్నది. ఆసియా కప్‌లో పేలవ ప్రదర్శన అనంతరం భారత జట్టును.. వరల్డ్ కప్ కోసం సోమవారం బీసీసీఐ ప్రకటించింది. ఈ మేరకు బోర్డు కార్యదర్శి జై షా ప్రెస్ నోట్ విడుదల చేశారు. ఆసియా కప్‌లో భారత జట్టు బ్యాటింగ్ పరంగా పర్వాలేదనిపించినా.. బౌలింగ్‌లో మాత్రం విఫలమైంది. కీలక సమయాల్లో స్పెషలిస్టు బౌలర్ల కొరత కనిపించింది. ముఖ్యంగా డెత్ ఓవర్లలో బుమ్రా లేని లేటు స్పష్టంగా తెలిసిపోయింది. అయితే గాయం కారణంగా జట్టుకు దూరమైన జస్ప్రిత్ బుమ్రాతో పాటు హర్షల్ పటేల్ తిరిగి చేరడంతో బౌలింగ్ విభాగం పటిష్టంగా మారింది.
ఇటీవల టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లలో రాణిస్తున్న అర్షదీప్ సింగ్, దీపక్ హుడా, అక్షర్ పటేల్‌లు వరల్డ్ కప్ జట్టులో చోటు సంపాదించారు. భారత జట్టు ఆస్ట్రేలియాకు పూర్తి సామర్థ్యంతో వెళ్తోంది. బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో మంచి ఫామ్‌లో ఉన్న ఆటగాళ్లను ఎంపిక చేశారు. ఆస్ట్రేలియాలోని పరిస్థితుల కారణంగా ఎవరైనా గాయాల పాలైనా, స్టాండ్ బైగా కూడా దీపక్ చాహర్, మహ్మద్ షమి, శ్రేయస్ అయ్యర్, రవి బిష్ణోయ్‌ను ఎంపిక చేశారు.
వికెట్ కీపర్ కోటాలో రిషబ్ పంత్‌కు దినేశ్ కార్తీక్ తోడయ్యాడు. జాతీయ జట్టు నుంచి దాదాపు దినేశ్ కార్తీక్ దాదాపు నిష్క్రమించినట్లే అని అందరూ భావించారు. జట్టులో స్థానం లభించక పోవడంతో ఇంగ్లాండ్-ఇండియా సిరీస్‌కు స్కై స్పోర్ట్స్ కామెంటేటర్‌గా కూడా వ్యవహరించాడు. దీంతో దినేశ్ పని అయిపోయిందని అందరూ వ్యాఖ్యానించారు. కానీ అప్పుడే తాను ఆస్ట్రేలియాలో జరిగే టీ20 జట్టులో స్థానం సంపాదిస్తానని చెప్పాడు. ఐపీఎల్‌తో పాటు ఇటీవల అంతర్జాతీయ మ్యాచ్‌లలో ఫినిషర్‌గా రాణిస్తున్నాడు. దీంతో సెలెక్టర్లు అతడిని ఎంపిక చేసినట్లు తెలుస్తున్నది.
ఇక బ్యాటింగ్ విభాగంలో కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు సూర్యకుమార్ యాదవ్ మంచి ఫామ్‌లో ఉన్నారు. వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ఫామ్‌లో లేకపోవడమే కాస్త ఆందోళన కలిగిస్తున్నది. ఆసియా కప్‌లో ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అతడు మంచి స్కోరే సాధించాడు. కానీ, ఆ ఫామ్ కంటిన్యూ చేస్తాడా లేదా అనే విషయంలో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అయితే సెలెక్టర్లు మాత్రం కేఎల్ రాహుల్‌పై నమ్మకం ఉంచారు.
వరల్డ్ కప్‌కు ముందు స్వదేశంలో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా జరుగనున్న టీ20లకు కూడా జట్టును ప్రకటించారు. ఈ రెండు సిరీస్‌లలో సీనియర్లకు విశ్రాంతి కల్పిస్తారనే వార్తలు వచ్చాయి. కానీ వరల్డ్ కప్‌కు వెళ్లే జట్టునే దాదాపుగా ఖరారు చేశారు. కాగా, ఈ రెండు హోం సిరీస్‌లకు హార్థిక్ పాండ్యా, అర్షదీప్ సింగ్, భువనేశ్వర్ కుమార్‌లను ఎంపిక చేశారు. అయితే ఆ సమయంలో వాళ్లు ముగ్గురూ నేషనల్ క్రికెట్ అకాడమీలో రిపోర్టు చేయాలని, కండిషనింగ్‌కు సంబంధించిన విషయంలో వారికి శిక్షణ ఉంటుందని బీసీసీఐ పేర్కొన్నది.
టీ20 వరల్డ్ కప్ జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), దినేశ్ కార్తీక్ (వికెట్ కీపర్), హార్థిక్ పాండ్యా, ఆర్. అశ్విన్, యజువేంద్ర చాహల్, అక్షర్ పటేల్, జస్ప్రిత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అర్షదీప్ సింగ్.
స్టాండ్ బై ప్లేయర్స్: మహ్మద్ షమి, శ్రేయస్ అయ్యర్, రవి బిష్ణోయ్. దీపక్ చాహర్
ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌కు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), దినేశ్ కార్తీక్ (వికెట్ కీపర్), హార్థిక్ పాండ్యా, ఆర్. అశ్విన్, యజువేంద్ర చాహల్, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమి, హర్షల్ పటేల్, దీపక్ చాహర్, జస్ప్రిత్ బుమ్రా.
సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్),కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), దినేశ్ కార్తీక్ (వికెట్ కీపర్), ఆర్. అశ్విన్, యజువేంద్ర చాహల్, అక్షర్ పటేల్, అర్షదీప్ సింగ్, మహ్మద్ షమి, హర్షల్ పటేల్, దీపక్ చాహర్, జస్ప్రిత్ బుమ్రా.