వింబుల్డన్ 'యువరాణి' బార్బరా!
ప్రపంచంలోనే అత్యంత పురాతన టెన్నిస్ గ్రాండ్ స్లామ్ టోర్నీ వింబుల్డన్ మహిళల సింగిల్స్ లో సరికొత్త చాంపియన్ తెరమీదకు వచ్చింది. ట్రోఫీతో కన్నీరుమున్నీరయ్యింది.
ప్రపంచంలోనే అత్యంత పురాతన టెన్నిస్ గ్రాండ్ స్లామ్ టోర్నీ వింబుల్డన్ మహిళల సింగిల్స్ లో సరికొత్త చాంపియన్ తెరమీదకు వచ్చింది. ట్రోఫీతో కన్నీరుమున్నీరయ్యింది.
137వ వింబుల్డన్ మహిళల సింగిల్స్ టైటిల్ ను చెక్ రిపబ్లిక్ యువప్లేయర్ బార్బరా క్రిజిసికోవా గెలుచుకొంది. లండన్ లోని ఆల్ ఇంగ్లండ్ క్లబ్ సెంటర్ కోర్టు వేదికగా జరిగిన టైటి్ల్ సమరంలో ఇటలీకి చెందిన మరో యువప్లేయర్ జాస్మిన్ పావోలినీపై విజయం సాధించింది.
గంటా 56నిముషాల సమరం...
గంటా 56 నిముషాలపాటు నువ్వానేనా అన్నట్లుగా సాగిన ఫైనల్లో 28 ఏళ్ల బార్బరా 6-2, 2-6, 6-4తో జాస్మిన్ ను అధిగమించగలిగింది. సమఉజ్జీల సమరంలా సాగిన ఈ పోరులో తొలిసెట్ ను డబుల్ బ్రేక్ తో 6-2తో నెగ్గడం ద్వారా బార్బరా శుభారంభం చేసింది. అయితే..కీలక రెండోసెట్లో మాత్రం అనూహ్యంగా వెనుకబడి పోయింది.
తొలిసెట్ చేజారిన కసితో ఆడిన జాస్మిన్ రెండోసెట్ ను 6-2తో కైవసం చేసుకోడం ద్వారా 1-1తో సమఉజ్జీగా నిలువగలిగింది.
విజేతను నిర్ణయించే ఆఖరి సెట్లో ఇద్దరు పట్టుదలతో పోరాడారు. చెరో 4 గేమ్ లతో సమఉజ్జీగా కనిపించారు. అయితే నిర్ణయాత్మకమైన బ్రేక్ సాధించడం ద్వారా బార్బరా 6-4 విజయంతో వింబుల్డన్ విజేతగా అవతరించింది.
1978లోయానా నొవాట్న వింబుల్డన్ మహిళల సింగిల్స్ టైటిల్ నెగ్గిన చెక్ మహిళ కాగా..ఆ తరువాత అదే ఘనత సాధించిన మరో చెక్ ప్లేయర్ గా బార్బరా రికార్డుల్లో చేరింది.
1, 70, 00000 పౌండ్ల ప్రైజ్ మనీ....
మూడేళ్ల క్రితం తాను సాధించిన ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ ట్రోఫీ కంటే ..ఇప్పుడు సాధించిన వింబుల్డన్ ట్రోఫీనే తనకు అమూల్యమైనదని బార్బరా పొంగిపోతూ చెప్పింది.
వింబుల్డన్ సెంటర్ కోర్టులో ట్రోఫీతో పాటు 1, 70, 00000 పౌండ్ల ప్రైజ్ మనీ చెక్ అందుకొనే సమయంలో బార్బరా కన్నీరుమున్నీరయ్యింది. ఈ విజయం తన జీవితంలో ఓ అపురూప ఘట్టమని ప్రకటించింది.
జాస్మిన్ చేజారిన రెండో టైటిల్...
రన్నరప్ ట్రోఫీ అందుకొన్న ఇటాలియన్ ప్లేయర్ జాస్మిన్ మరోసారి నీరసపడిపోయింది. గతంలో ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్స్ వరకూ వచ్చి టైటిలో పోరులో రన్నరప్ స్థానంతో సరిపెట్టుకొన్న జాస్మిన్ కు ప్రస్తుత వింబుల్డన్ ఫైనల్లో సైతం అదే అనుభవం ఎదురయ్యింది. ఫైనల్స్ వరకూ రావడం, టైటిల్ పోరులో ఓడిపోడం తన బలహీనతగా మారిందంటూ వాపోయింది.
ప్రపంచ మహిళా టెన్నిస్ లో హేమాహేమీలంతా ప్రారంభ రౌండ్లలోనే ఇంటిదారి పట్టడంతో బార్బరా, జాస్మిన్ లాంటి అంతగా పేరులేని ప్లేయర్లు ఫైనల్లో తలపడటం..2024 వింబుల్డన్ ప్రత్యేకతగా మిగిలిపోతుంది.