Telugu Global
Sports

భారత్ కు బంగ్లావాష్ గండం, నేడే ఆఖరి వన్డే!

భారత్- బంగ్లాదేశ్ జట్ల తీన్మార్ వన్డే సిరీస్ లోని ఆఖరాటకు చోటాగ్రామ్ లో రంగం సిద్ధమయ్యింది. ఆతిథ్య బంగ్లాదేశ్ సిరీస్ క్లీన్ స్వీప్ కు గురిపెడితే, కనీసం ఆఖరిమ్యాచ్ లో నైనా నెగ్గి పరువుదక్కించుకోవాలన్న పట్టుదలతో భారత్ ఉంది.

భారత్ కు బంగ్లావాష్ గండం, నేడే ఆఖరి వన్డే!
X

భారత్ కు బంగ్లావాష్ గండం, నేడే ఆఖరి వన్డే!

భారత్- బంగ్లాదేశ్ జట్ల తీన్మార్ వన్డే సిరీస్ లోని ఆఖరాటకు చోటాగ్రామ్ లో రంగం సిద్ధమయ్యింది. ఆతిథ్య బంగ్లాదేశ్ సిరీస్ క్లీన్ స్వీప్ కు గురిపెడితే, కనీసం ఆఖరిమ్యాచ్ లో నైనా నెగ్గి పరువుదక్కించుకోవాలన్న పట్టుదలతో భారత్ ఉంది.

వన్డే క్రికెట్లో నాలుగో ర్యాంకర్, రెండుసార్లు ప్రపంచ చాంపియన్ భారత్..బంగ్లాగడ్డపై అతిపెద్ద పరీక్ష ఎదుర్కొంటోంది. 2023 ప్రపంచకప్ కు సన్నాహకంగా బంగ్లాదేశ్ తో జరుగుతున్న తీన్మార్ సిరీస్ లోని మొదటి రెండు వన్డేలలో పరాజయాలు పొందడం ద్వారా ఇప్పటికే సిరీస్ చేజార్చుకొన్న భారత్ ను బంగ్లావాష్ వెంటాడుతోంది.

మీర్పూర్ వేదికగా ముగిసిన తొలివన్డేలో ఒక్క వికెట్, రెండోవన్డేలో 5 పరుగుల తేడాతో పరాజయాలు పొందిన 4వ ర్యాంకర్ భారత్..ఈరోజు చోటాగ్రామ్ వేదికగా జరిగే ఆఖరి వన్డేలో రెండుమార్పులతో బరిలోకి దిగుతోంది.

ఇషాన్ కిషన్, కుల్దీప్ యాదవ్ లకు చోటు..

కెప్టెన్ రోహిత్ శర్మ, యువఫాస్ట్ బౌలర్ కుల్దీప్ సేన్ గాయాలతో జట్టు నుంచి వైదొలగడంతో..ఇషాన్ కిషన్, చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ లకు తుదిజట్టులో చోటు కల్పించాలని టీమ్ మేనేజ్ మెంట్ భావిస్తోంది. రాహుల్ కెప్టెన్ గా విజయమే లక్ష్యంగా భారత్ పోటీకి దిగుతోంది.

ఓపెనర్ శిఖర్ ధావన్, మాజీ కెప్టెన్ విరాట్ కొహ్లీ తమ బ్యాట్లకు పూర్తిస్థాయిలో పని చెప్పకపోతే బంగ్లాపై నెగ్గుకు రావడం కష్టమని చెప్పక తప్పదు. కెప్టెన్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ సైతం ధాటిగా ఆడితీరక తప్పని పరిస్థితి నెలకొంది.

సిరాజ్, శార్దూల్, ఉమ్రాన్ మాలిక్ లతో కూడిన పేస్ ఎటాక్ తో పాటు స్పిన్ త్రయం వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ కట్టడిగా బౌల్ చేయాల్సి ఉంది.

ఆఖరి వన్డేలో భారత్ ను ముంచినా ..తేల్చినా బౌలర్లే అనడంలో ఏమాత్రం సందేహం లేదు.

ఉరకలేస్తున్న బంగ్లాటైగర్స్...

మరోవైపు..7వ ర్యాంకర్ బంగ్లాదేశ్ స్థానబలంతో తొలి రెండువన్డేలు నెగ్గడం ద్వారా ఇప్పటికే 2-0తో సిరీస్ ఖాయం చేసుకోడం ద్వారా మూడోవన్డేలోనూ విజయంతో సిరీస్ స్వీప్ సాధించడానికి తహతహలాడుతోంది.

బ్యాటింగ్ లో టాపార్డర్ ఆటగాళ్లు విఫలమవుతున్నా మిడిలార్డర్ లో మహ్మదుల్లా, మెహిదీ హసన్ మిరాజ్ భారత బౌలర్లను నిలువరిస్తూ తమ జట్టును ఆదుకొంటూ వస్తున్నారు.

తొలివన్డేలో ఫైటింగ్ హాఫ్ సెంచరీతో తనజట్టుకు సంచలన విజయం అందించిన మిరాజ్..రెండోవన్డేలో సూపర్ సెంచరీతో మ్యాచ్ విన్నర్ గా నిలిచాడు. మొదటి రెండువన్డేలలో పవర్ ఫుల్ భారత్ పరాజయాలకు కేవలం మెహిదీ హసన్ మిరాజ్ మాత్రమే కారణమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

చిట్టగాంగ్ లోని జహూర్ అహ్మద్ చౌదరి స్టేడియం వేదికగా జరిగే ఈపోరులో భారీస్కోరు నమోదయ్యే అవకాశం ఉంది. గతంలో ఇదే గ్రౌండ్ వేదికగా జరిగినమ్యాచ్ లో అప్ఘనిస్థాన్ అత్యదికంగా 300కు పైగా స్కోరు నమోదు చేయగలిగింది.

ఆతిథ్య బంగ్లాదేశ్ విన్నింగ్ కాంబినేషన్ నే కొనసాగించనుంది. భారత కాలమానం ప్రకారం ఈమ్యాచ్ ఈ ఉదయం 11-30 గంటలకు ప్రారంభంకానుంది.

First Published:  10 Dec 2022 4:30 AM GMT
Next Story