Telugu Global
Sports

టెస్టు చరిత్రలో బంగ్లాదేశ్ భలే గెలుపు!

సాంప్రదాయ టెస్టు క్రికెట్ చరిత్రలోకి మరో రికార్డు వచ్చి చేరింది. ఆ ఘనతను బంగ్లాదేశ్ దక్కించుకొంది.546 పరుగుల రికార్డు విజయంతో వారేవ్వా..అనిపించుకొంది.

టెస్టు చరిత్రలో బంగ్లాదేశ్ భలే గెలుపు!
X

సాంప్రదాయ టెస్టు క్రికెట్ చరిత్రలోకి మరో రికార్డు వచ్చి చేరింది. ఆ ఘనతను బంగ్లాదేశ్ దక్కించుకొంది.546 పరుగుల రికార్డు విజయంతో వారేవ్వా..అనిపించుకొంది.

దశాబ్దాల చరిత్ర కలిగిన సాంప్రదాయ టెస్టు క్రికెట్లో అతిపెద్ద విజయాలు అత్యంత అరుదుగా నమోదవుతూ ఉంటాయి. గత శతాబ్దకాలంలో రెండు అతిపెద్ద విజయాలు నమోదు చేసిన జట్లుగా ఇంగ్లండ్, ఆస్ట్ర్రేలియా మాత్రమే నిలిచాయి. అయితే..అలాంటి అరుదైన విజయాన్ని ప్రస్తుత 21వ శతాబ్దంలో సాధించినజట్టుగా బంగ్లాదేశ్ నిలిచింది.

2023 టెస్టు సిరీస్ లో భాగంగా మీర్పూర్ షేరే బంగ్లా నేషనల్ స్టేడియం వేదికగా అఫ్ఘనిస్థాన్ తో జరిగిన సింగిల్ టెస్టుమ్యాచ్ లో ఆతిథ్య బంగ్లాదేశ్ 546 పరుగుల రికార్డు విజయం సొంతం చేసుకొంది.

వైట్ బాల్ క్రికెట్లో అత్యంత ప్రతిభావంతమైన జట్టుగా గుర్తింపు ఉన్న అఫ్ఘనిస్థాన్..రెడ్ బాల్ ( టెస్టు ) క్రికెట్లో మాత్రమే తేలిపోయింది. టెస్టు హోదా పొందిన తర్వాత నుంచి

అఫ్ఘనిస్థాన్ ఆడిన ఆరు టెస్టుల్లో 3 విజయాలు, 3 పరాజయాల రికార్డుతో ఉంది.

రషీద్ ఖాన్ లేకుండానే....

స్పిన్ బౌలర్ల అడ్డా బంగ్లాగడ్డపై జరిగిన ఈ ఏకైక టెస్టు సమరంలో స్పిన్ జాదూ రషీద్ ఖాన్ లేకుండానే అఫ్ఘనిస్థాన్ బరిలో నిలిచింది. కీలక టాస్ నెగ్గి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోడం ద్వారా తన ఓటమిని తానే కొని తెచ్చుకొంది.

టాస్ ఓడి ..ముందుగా బ్యాటింగ్ కు దిగిన బంగ్లాదేశ్ తొలిఇన్నింగ్స్ లో 382 పరుగుల భారీస్కోరు సాధించింది. వన్ డౌన్ బ్యాటర్ షాంటో 175 బంతుల్లో 23 బౌండ్రీలు, 2 సిక్సర్లతో 146 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు.

అఫ్గన్ బౌలర్లలో పేసర్ నిజత్ మసూద్ 79 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత తొలిఇన్నింగ్స్ ఆడిన అఫ్ఘన్ జట్టు 146 పరుగులకే కుప్పకూలింది. భారీ తొలిఇన్నింగ్స్ ఆధిక్యం సంపాదించిన బంగ్లాజట్టు రెండో ఇన్నింగ్స్ లో మరింతగా చెలరేగిపోయింది.

తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో షాంటో, మిడిలార్డర్ బ్యాటర్ మోమీనుల్ హక్ సెంచరీలతో వీరవిహారం చేశారు. షాంటో 124, మోమినుల్ 121 పరుగులు సాధించడంతో బంగ్లాజట్టు 4 వికెట్ల నష్టానికి 425 పరుగుల స్కోరుతో ప్రత్యర్థి ఎదుట 662 పరుగుల భారీలక్ష్యాన్ని ఉంచగలిగింది.

మ్యాచ్ నెగ్గాలంటే ఆఖరి రెండున్నర రోజుల ఆటలో 662 పరుగుల లక్ష్యంగా చేజింగ్ కు దిగిన అప్ఘన్ జట్టు కేవలం 33 ఓవర్లలోనే 115 పరుగులకే కుప్పకూలి ఘోరపరాజయం మూటగట్టుకొంది.

21వ శతాబ్దంలోనే అతిపెద్ద గెలుపు

పసికూన అప్ఘనిస్థాన్ పై 546 పరుగుల భారీవిజయం సాధించడం ద్వారా బంగ్లాజట్టు 21వ శతాబ్దంలోనే పరుగుల తేడాలో అతిపెద్ద విజయం సాధించిన జట్టుగా రికార్డుల్లో చేరింది.

15 దశాబ్దాల టెస్టు రికార్డులను తిరగేసి చూస్తే రెండంటే రెండు మాత్రమే అతిపెద్ద విజయాలు నమోదై ఉన్నాయి.

1928 లో ఆస్ట్రేలియాపై ఇంగ్లండ్‌ సాధించిన 675 పరుగుల విజయమే నాటికి నేటికీ అతిపెద్ద ప్రపంచ రికార్డు విజయంగా నిలిచింది. ఆ తర్వాత 1934లో ఇంగ్లండ్‌పై ఆస్ట్రేలియా జట్టు సాధించిన 562 పరుగుల భారీ విజయం.. టెస్టుల్లో రెండో అతిపెద్ద విజయంగా ఉంది.

ఆ తర్వాత 89 సంవత్సరాలకు అఫ్ఘనిస్థాన్ పై బంగ్లాదేశ్ నమోదు చేసిన 546 పరుగుల విజయం మూడో అతిపెద్ద గెలుపుగా నమోదయ్యింది. మరో ఇలాంటి రికార్డు చూడాలంటే..ఎన్ని సంవత్సరాలపాటు వేచిచూడాలో మరి.

First Published:  17 Jun 2023 6:30 PM IST
Next Story