ప్రపంచకుస్తీలో భజరంగ్..భళా!
భారత వస్తాదు భజరంగ్ పూనియా ఓ అరుదైన రికార్డు నెలకొల్పాడు
భారత వస్తాదు భజరంగ్ పూనియా ఓ అరుదైన రికార్డు నెలకొల్పాడు. ప్రపంచ కుస్తీ చరిత్రలో నాలుగు వేర్వేరు టోర్నీలలో పతకాలు సాధించిన ఒకే ఒక్క భారత మల్లయోధుడిగా చరిత్ర సృష్టించాడు....
వందకు పైగా దేశాల వస్తాదులు తలపడే ప్రపంచ కుస్తీ పోటీలలో పాల్గొనటానికి అర్హత సాధించడమే గొప్ప. అలాంటిది ప్రపంచకుస్తీలో పాల్గొనడంతో పాటు ఏదో ఒక పతకం సాధించగలిగితే అంతకు మించిన గౌరవం మరొకటి ఉండదు. ఇక..నాలుగు వేర్వేరు ప్రపంచకప్ టో్ర్నీలలో పతకాలు సాధించే అదృష్టం, అవకాశం అతికొద్దిమంది వస్తాదులకు మాత్రమే దక్కుతుంది. అలాంటి అరుదైన ఘనతను భారత వస్తాదు భజరంగ్ పూనియా దక్కించుకొన్నాడు.
2013 నుంచి 2022 వరకూ...
గత తొమ్మిదేళ్లుగా ప్రపంచకుస్తీ పోటీలలో పాల్గొంటూ వస్తున్న భజరంగ్ పూనియా నిలకడగా రాణిస్తూ తన సత్తా ఏపాటిదో ప్రపంచానికి చాటి చెబుతూ వస్తున్నాడు. కామన్వెల్త్ గేమ్స్, ఆసియా, ఆసియాక్రీడలు, ఒలింపిక్ గేమ్స్ కుస్తీలో భారత్ కు ప్రాతినిథ్యం వహిస్తూ డజన్లకొద్దీ పతకాలు సాధించిన భజరంగ్..అత్యున్నత ప్రమాణాలకు మరోపేరైన ప్రపంచకుస్తీలో ఒకటికాదు రెండు కాదు..ఏకంగా నాలుగు పతకాలు సాధించిన మొనగాడిగా నిలిచాడు.
బెల్ గ్రేడ్ వేదికగా ముగిసిన 2022 ప్రపంచకుస్తీ 65 కిలోల విభాగంలో భజరంగ్ పూనియా కాంస్య పతకం సాధించాడు. గత ఏడాది ముగిసిన టోక్యో ఒలింపిక్స్ కుస్తీలో కాంస్య పతకం సాధించిన భజరంగ్ ప్రపంచకప్ కుస్తీలో సైతం కంచు పతకంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
క్వార్టర్ ఫైనల్లో అమెరికా వస్తాదు జాన్ మైకేల్ చేతిలో పరాజయం పొందడంతో బ్రాంజ్ మెడల్ రేస్ లో మిగలాల్సి వచ్చింది.
కాంస్య పతకం కోసం జరిగిన పోరులో పోర్టో రికో వస్తాదు సెబాస్టియన్ రివేరాను 11-9 పాయింట్లతో అధిగమించడం ద్వారా ప్రపంచకుస్తీ చరిత్రలో తన నాలుగో పతకం అందుకొన్నాడు.
2013లో తొలి పతకం...
బుడాపెస్ట్ వేదికగా 2013లో జరిగిన ప్రపంచ కుస్తీ టోర్నీలో కాంస్యం తో బోణీ కొట్టిన భజరంగ్ పూనియా...2018 ప్రపంచ కుస్తీ పోటీలలో రజత పతకం సాధించాడు.
స్వర్ణ పతకమే లక్ష్యంగా బరిలోకి దిగిన భారత స్టార్ వస్తాదు భజరంగ్ పూనియా చివరకు కాంస్య పతకంతో సంతృప్తి చెందాల్సి వచ్చింది. రిఫరీ పక్షపాత నిర్ణయంతో..
సెమీస్ లో ఓటమి పొందిన భజరంగ్ పూనియా...కాంస్య పతకం కోసం జరిగిన పోటీలో మంగోలియా వస్తాదు తుల్గా తుమిర్ ఓచిర్ నుంచి గట్టి పోటీ ఎదుర్కొని
8-7 పాయింట్ల తేడాతో నెగ్గి కాంస్య పతకం అందుకొన్నాడు.
2019 ప్రపంచ కుస్తీలో సైతం భజరంగ్ పూనియా మరోసారి కాంస్య పతకం సాధించడం ద్వారా తన పతకాల సంఖ్యను మూడుకు పెంచుకొన్నాడు. 2022 ప్రపంచ కుస్తీ పోటీలలోనూ కాంస్యం సాధించడం ద్వారా తన పతకాలను నాలుగుకు పెంచుకొన్నాడు.
ప్రపంచ కుస్తీ చరిత్రలోనే నాలుగు పతకాలు సాధించిన తొలి, ఏకైక వస్తాదు భజరంగ్ పూనియా మాత్రమే.
2022 ప్రపంచకుస్తీలో మొత్తం 30 మంది మల్లయోధులతో బరిలో నిలిచిన భారత్ రెండంటే రెండు పతకాలు మాత్రమే సాధించగలిగింది. పురుషుల విభాగంలో భజరంగ్ పూనియా, మహిళల విభాగంలో వినేశ్ పోగట్ మాత్రమే పతకాలు సాధించడం ద్వారా భారత ఉనికిని కాపాడగలిగారు.