అయ్యారే!...శ్రేయస్ అయ్యర్ పరుగుల మోత!
భారత మిడిలార్డర్ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ 2022 సీజన్లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్ గా నిలిచాడు.
భారత మిడిలార్డర్ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ 2022 సీజన్లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్ గా నిలిచాడు. బంగ్లాదేశ్ తో ముగిసిన రెండుమ్యాచ్ ల సిరీస్ లో నిలకడగా రాణించడం ద్వారా అయ్యర్ అగ్రస్థానంలో నిలిచాడు....
భారత క్రికెట్ అంటే..రోహిత్ శర్మ, విరాట్ కొహ్లీ మాత్రమే కాదు...తాను సైతం అని మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ తన ఆటతీరుతో చెప్పకనే చెప్పాడు. 2022 అంతర్జాతీయ క్రికెట్ సీజన్లో భారత్ తరపున అత్యధికంగా పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు.
1609 పరుగులతో అయ్యర్ టాప్....
ఐసీసీ టెస్టు లీగ్ లో భాగంగా బంగ్లాదేశ్ తో ముగిసిన తీన్నార్ వన్డే, రెండుమ్యాచ్ ల టెస్టు సిరీసుల్లో శ్రేయస్ అయ్యర్ భారత మిడిలార్డర్ బ్యాటర్ గా సత్తా చాటుకొన్నాడు. వన్డే క్రికెట్లో మాత్రమే కాదు..టెస్టు క్రికెట్లో సైతం భారత బ్యాటింగ్ ఆర్డర్ కు తాను కీలకమని తన సూపర్ బ్యాటింగ్ తో తెలియచెప్పాడు.
మిర్పూర్ వేదికగా జరిగిన రెండోటెస్టులో ఓటమి అంచుల్లో కూరుకుపోయిన భారత్ ను అశ్విన్ తో కలసి 8వ వికెట్ కు కీలక భాగస్వామ్యం నమోదు చేయటం ద్వారా విజేతగా నిలపడంలో అయ్యర్ తనవంతు పాత్ర పోషించాడు.
రోహిత్ శర్మ, విరాట్ కొహ్లీ, కెఎల్ రాహుల్ నిలకడగా రాణించడంలో విఫలమైతే...శ్రేయస్ అయ్యర్ మాత్రం తనకు అందివచ్చిన అవకాశాలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోడం ద్వారా పరుగుల మోత మోగించాడు. క్రికెట్ మూడు ఫార్మాట్లలోనూ తానేమిటో నిరూపించుకొన్నాడు.
5 టెస్టుల్లో 422 పరుగులు...
2022 సీజన్లో భారత్ ఆడిన మొత్తం 9 టెస్టుల్లో శ్రేయస్ అయ్యర్ మాత్రం 5 టెస్టులు, 8 ఇన్నింగ్స్ లోనే ఆడగలిగాడు. 92 పరుగులు అత్యధిక స్కోరుతో నాలుగు అర్థశతకాలతో 422 పరుగులు సాధించాడు. 60.28 సగటు నమోదు చేశాడు.
భారతజట్టులో సభ్యుడిగా 17 వన్డేలు ఆడిన అయ్యర్ 55. 69 సగటుతో 724 పరుగులు సాధించాడు. మొత్తం 15 ఇన్నింగ్స్ లో 113 పరుగులు నాటౌట్ స్కోరుతో పాటు అరడజను హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు.
ఇక..దూమ్ ధామ్ టీ-20ల్లో 463 పరుగులు సాధించాడు. 141. 15 స్ట్ర్రయిక్ రేట్ తో నాలుగు అర్థశతకాలు నమోదు చేశాడు. 74 పరుగులన నాటౌట్ స్కోరుతో 35. 61 సగటుతో రాణించాడు.
శ్రేయస్ అయ్యర్ 2022 సీజన్లో మొత్తం 14 అర్థశతకాలు, ఓ శతకంతో 1609 పరుగులు సాధించాడు. 48.75 సగటుతో భారత అత్యుత్తమ బ్యాటర్ గా అవతరించాడు.
భారతజట్టు టెస్టు లీగ్ ఫైనల్స్ చేరాలంటే ఆస్ట్ర్రేలియాతో జరిగే స్వదేశీ టెస్టు సిరీస్ లో శ్రేయస్ అయ్యర్ అత్యుత్తమస్థాయిలో రాణించితీరక తప్పదని క్రికెట్ పండితులు చెబుతున్నారు.