Telugu Global
Sports

కంగారూలకు సఫారీల సవాల్, నేడే ప్రపంచకప్ ఫైనల్స్!

గత ఎనిమిది ప్రపంచకప్ టోర్నీలలో వరుసగా ఏడోసారి ఫైనల్స్ చేరిన ఐదుసార్లు చాంపియన్ ఆస్ట్ర్రేలియాకు ఫైనల్లో దక్షిణాఫ్రికా సవాలు విసురుతోంది. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6-30 గంటలకు ఈపోరు ప్రారంభంకానుంది.

కంగారూలకు సఫారీల సవాల్, నేడే ప్రపంచకప్ ఫైనల్స్!
X

ఐసీసీ మహిళా టీ-20 ప్రపంచకప్ టైటిల్ సమరానికి కేప్ టౌన్ న్యూల్యాండ్స్ స్టేడియంలో కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది. సూపర్ సండే ఫైనల్లో హాట్ ఫేవరెట్ ఆస్ట్ర్రేలియాకు ఆతిథ్య దక్షిణాఫ్రికా సవాలు విసురుతోంది.

దక్షిణాఫ్రికా వేదికగా గత రెండువారాలుగా జరుగుతున్న 2023 ఐసీసీ మహిళా టీ-20 ప్రపంచకప్ సమరం క్లయ్ మాక్స్ దశకు చేరింది. నాలుగుజట్ల సెమీస్ పోరు ముగియటంతోనే తుది అంకం టైటిల్ సమరానికి రంగం సిద్ధమయ్యింది.

గత ఎనిమిది ప్రపంచకప్ టోర్నీలలో వరుసగా ఏడోసారి ఫైనల్స్ చేరిన ఐదుసార్లు చాంపియన్ ఆస్ట్ర్రేలియాకు ఫైనల్లో దక్షిణాఫ్రికా సవాలు విసురుతోంది. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6-30 గంటలకు ఈపోరు ప్రారంభంకానుంది.

హాట్ ఫేవరెట్ తో డార్క్ హార్స్ ఢీ....

మహిళా టీ-20 ప్రపంచకప్ చరిత్రలో తిరుగులేని జట్టు ఏదంటే ఆస్ట్ర్రేలియా అన్న సమాధానమే వస్తుంది. మహిళా టీ-20 ప్రపంచకప్ కు మరోపేరుగా నిలిచిన కంగారూజట్టుకు..గత ఎనిమిది ప్రపంచకప్ టోర్నీలలో వరుసగా ఏడుసార్లు ఫైనల్స్ చేరిన తిరుగులేని రికార్డు ఉంది. పైగా..గత ఏడుటోర్నీలలో ఐదుసార్లు విజేతగా నిలిచిన ఏకైకజట్టు ఆస్ట్ర్రేలియా మాత్రమే.

గత రెండు టోర్నీలలో వరుసగా టైటిల్స్ నెగ్గిన కంగారూటీమ్..ప్రస్తుత టోర్నీలో సైతం విజేతగా నిలువగలిగితే హ్యాట్రిక్ విజయాలు సాధించిన తొలిజట్టుగా చరిత్ర సృష్టించగలుగుతుంది.

ప్రపంచకప్ చరిత్రలో ఆస్ట్ర్రేలియా తర్వాత ప్రపంచకప్ నెగ్గిన జట్టు ఘనతను వెస్టిండీస్ మాత్రమే దక్కించుకోగలిగింది. ఆస్ట్ర్రేలియాతో ఫైనల్లో తలపడిన జట్లలో వెస్టిండీస్, భారత్ తర్వాత..మూడోజట్టుగా దక్షిణాఫ్రికా రికార్డుల్లో చేరింది.

సెమీస్ లో హోరాహోరీ విజయాలు...

ఫైనల్లో చోటు కోసం జరిగిన సెమీఫైనల్స్ సమరంలో భారత్ నుంచి గట్టి పోటీ ఎదుర్కొన్న ఆస్ట్ర్రేలియా 5 పరుగుల తేడాతో గట్టెక్కితే..రెండో సెమీఫైనల్లో దక్షిణాఫ్రికా 6 పరుగుల తేడాతో ఇంగ్లండ్ పై సంచలన విజయం సాధించడం ద్వారా తొలిసారిగా ఫైనల్లో అడుగుపెట్టింది.

గ్రూప్ -1 లీగ్ లో పడుతూ లేస్తూ నాకౌట్ రౌండ్ చేరిన దక్షిణాఫ్రికా..ఇంగ్లండ్ తో సెమీస్ లో మాత్రం విశ్వరూపమే ప్రదర్శించింది. ముందుగా 164 పరుగుల స్కోరు సాధించడం ద్వారా ఇంగ్లండ్ కు 165 పరుగుల లక్ష్యంతో గట్టి సవాలే విసిరింది.

హాట్ కేకుల్లా ఫైనల్స్ టికెట్ల సేల్...

దక్షిణాఫ్రికా క్రికెట్ చరిత్రలో..ప్రధానంగా గత 12 ఐసీసీ ప్రపంచకప్ పురుషుల, మహిళల టోర్నీలలో ఫైనల్స్ చేరిన తొలి సఫారీజట్టు ఘనతను సున్ లూస్ నాయకత్వంలోని దక్షిణాఫ్రికా మహిళాజట్టే దక్కించుకోగలిగింది.

దక్షిణాఫ్రికా మహిళ మ్యాచ్ లకు గత కొద్దిసంవత్సరాలుగా దూరంగా ఉంటూ వస్తున్న అభిమానులు..ప్రస్తుత ప్రపంచకప్ ఫైనల్స్ కు భారీసంఖ్యలో తరలి రానున్నారు.

టైటిల్ సమరానికి వేదికగా నిలిచిన కేప్ టౌన్ న్యూల్యాండ్స్ స్టేడియం కిటకిటలాడనుంది.

క్రికెట్ అభిమానులు భారీసంఖ్యలో క్యూల్లో నిలిచి మరీ ఫైనల్ మ్యాచ్ టికెట్లు కొనుగోలు చేయటంతో క్రికెట్ సౌతాఫ్రికా ఉక్కిరిబిక్కిరవుతోంది. సూపర్ సండే టైటిల్ సమరంలో తమ జట్టు విజేతగా నిలవాలని సఫారీ అభిమానులు కోరుకొంటున్నారు.

ఫాస్ట్ బౌలర్లే సఫారీల బలం..

ప్రపంచ మహిళా క్రికెట్లోనే ఇద్దరు మెరుపు ఫాస్ట్ బౌలర్ల బలంతో సఫారీటీమ్ టైటిల్ వేటకు దిగుతోంది. గంటకు 80 మైళ్ల వేగంతో బంతులు విసురుతూ ప్రత్యర్థిజట్లను భయపెడుతున్న షబ్నిమ్ ఇస్మాయిల్, అయోబోంగా ఖాకా దక్షిణాఫ్రికా ప్రధాన అస్త్ర్లాలుగా ఉన్నారు. అంతేకాదు..ఓపెనింగ్ జోడీ లారా వూల్ వార్ట్, టాచ్ మిన్ బ్రిట్స్ సైతం భీకర ఫామ్ లో ఉండటం ఆతిథ్యజట్టుకు అదనపు బలంగా ఉంది.

అపారఅనుభవం కలిగిన ఆస్ట్ర్రేలియాకు గట్టి పోటీ ఇవ్వాలన్నా..తొలి ప్రపంచ టైటిల్ సాధించాలన్నా..,సఫారీ ఓపెనర్లతో పాటు ఓపెనింగ్ బౌలర్లు సైతం అత్యుత్తమంగా, అసాధారణంగా రాణించి తీరక తప్పదు.

న్యూల్యాండ్స్ వేదికగా ఆడిన మ్యాచ్ ల్లో ముందుగా బ్యాటింగ్ కు దిగిన ప్రతిసారీ విజయం సాధించడం దక్షిణాఫ్రికాకు ఆనవాయితీగా వస్తోంది. ఫైనల్లో సైతం టాస్ నెగ్గి ముందుగా బ్యాటింగ్ కు దిగగలిగితేనే సఫారీటీమ్ కు విజయావకాశాలు ఉంటాయి.

సెమీఫైనల్స్ లో సైతం ముందుగా బ్యాటింగ్ చేసిన జట్లే విజయాలు సాధించడం, చేజింగ్ కు దిగిన జట్లు ఒత్తిడితో చిత్తు కావడం కూడా ఆసక్తిని రేకెత్తిస్తోంది.

భారీగా తరలివచ్చిన అభిమానుల సమక్షంలో ప్రపంచ చాంపియన్ ఆస్ట్ర్రేలియాతో తలపడటం తమ సత్తా చాటుకోడానికి చక్కటి అవకాశమని, అత్యుత్తమంగా రాణించడానికి ప్రయత్నిస్తామని దక్షిణాఫ్రికా కెప్టెన్ సున్ లూస్ ప్రకటించింది.

ఫైనల్లో ఆస్ట్ర్రేలియా విజేతగా నిలిస్తే వరుసగా మూడోసారి ప్రపంచకప్ నెగ్గిన తొలిజట్టుగా నిలువగలుగుతుంది. అదే దక్షిణాఫ్రికా చాంపియన్ కాగలిగితే..సరికొత్త చరిత్రే అవుతుంది.

ఈరోజు జరిగే టైటిల్ పోరులో ఏజట్టు నెగ్గినా..అది మరో చరిత్రే అనడంలో సందేహం లేదు.

First Published:  26 Feb 2023 10:51 AM IST
Next Story