Telugu Global
Sports

ప్రపంచకప్ లో ఆసియాజట్ల షో!

ప్రపంచకప్ ఫుట్ బాల్ గ్రూపులీగ్ లో ఆసియాజట్లు సత్తా చాటుకొన్నాయి. జపాన్, దక్షిణ కొరియాజట్లు సంచలన విజయాలతో ప్రీ-క్వార్టర్ ఫైనల్స్ నాకౌట్ రౌండ్ చేరడం ద్వారా ఆసియాఖండానికే గౌరవం తెచ్చాయి.

ప్రపంచకప్ లో ఆసియాజట్ల షో!
X

ప్రపంచకప్ లో ఆసియాజట్ల షో!

ప్రపంచకప్ ఫుట్ బాల్ గ్రూపులీగ్ లో ఆసియాజట్లు సత్తా చాటుకొన్నాయి. జపాన్, దక్షిణ కొరియాజట్లు సంచలన విజయాలతో ప్రీ-క్వార్టర్ ఫైనల్స్ నాకౌట్ రౌండ్ చేరడం ద్వారా ఆసియాఖండానికే గౌరవం తెచ్చాయి...

ఫిఫా ప్రపంచకప్ ఫుట్ బాల్ లో ఆసియాఖండ దేశాల జట్ల జోరు మొదలయ్యింది. ఖతర్ వేదికగా జరుగుతున్న 2022 ప్రపంచకప్ ఫుట్ బాల్ గ్రూపులీగ్ దశ బరిలోకి ఐదు ఆసియాజట్లు దిగితే..రెండుదేశాల జట్లు నాకౌట్ రౌండ్ కు అర్హత సంపాదించాయి.


కొరియా జోరు, జపాన్ హోరు...

ప్రపంచకప్ క్వాలిఫైయింగ్ రౌండ్ల ద్వారా జపాన్, ఇరాన్, సౌదీ అరేబియా, దక్షిణ కొరియా 32జట్ల ఫైనల్ రౌండ్ కు అర్హత సాధిస్తే..ఆతిథ్య దేశం హోదాలో ఖతర్ ప్రస్తుత ప్రపంచకప్ బరిలో నిలిచింది.

అయితే...సౌదీ అరేబియా, ఖతర్, ఇరాన్ జట్లు గ్రూపు లీగ్ నుంచే నిష్క్ర్రమిస్తే..ఆసియాదిగ్గజాలు జపాన్, దక్షిణ కొరియాజట్లు మాత్రం ప్రీ-క్వార్టర్ ఫైనల్స్ నాకౌట్ రౌండ్లో అడుగుపెట్టాయి.

జపాన్ సూపర్ హిట్...

ప్రపంచ మాజీ చాంపియన్ జర్మనీ, స్పెయిన్, కోస్టారికా జట్లతో కూడిన గ్రూప్-ఈ లీగ్ లో జపాన్ అత్యధికపాయింట్లతో టాపర్ గా ప్రీ-క్వార్టర్ ఫైనల్స్ బెర్త్ ఖాయం చేసుకొంది.

నాలుగుసార్లు ప్రపంచ విజేత జర్మనీ, యూరోపియన్ మాజీ చాంపియన్ స్పెయిన్ లాంటి దిగ్గజ జట్లపై జపాన్ సంచలన విజయాలు సాధించడం ద్వారా ఆసియా సాకర్ సత్తాను చాటింది. జర్మనీ, కోస్టారికా లీగ్ దశ నుంచే నిష్క్ర్రమించగా...స్పెయిన్ రన్నరప్ నాకౌట్ రౌండ్ చేరుకోగలిగింది.

దక్షిణ కొరియా కమాల్...

ఆసియా మరో అగ్రశ్రేణిజట్టు దక్షిణ కొరియా సైతం ఆఖరి రౌండ్ సంచలన విజయంతో నాకౌట్ రౌండ్ బెర్త్ సంపాదించింది. ఘనా, పోర్చుగల్, ఉరుగ్వే లాంటి హేమాహేమీజట్లతో కూడిన గ్రూప్- హెచ్ ఆఖరిరౌండ్ పోరులో కొరియా 2-1 గోల్స్ తో పోర్చుగల్ ను కంగు తినిపించింది.

ఆట మొదటి భాగం 5వ నిముషంలోనే లూస్ రికార్డో హోర్టా పోర్చుగల్ కు తొలిగోల్ అందించాడు. ఆ తర్వాత 27వ నిముషంలో కిమ్ యంగ్ గ్వాన్ సాధించిన గోల్ తో కొరియా 1-1తో సమఉజ్జీగా నిలిచింది.

ఆట రెండో భాగంలో పోర్చుగల్ ఆధిపత్యం కొనసాగినా..ఆట ముగిసే క్షణాలలో హ్వాంగ్ హీ చాన్ సాధించిన మెరుపుగోల్ తో దక్షిణ కొరియా 2-1 గోల్స్ తో సంచలన విజయం సాధించింది.

గ్రూప్ మొదటి రెండురౌండ్లలో అలవోక విజయాలు సాధించిన పోర్చుగల్ కు ఇదే తొలి ఓటమి .అయితే 6 పాయింట్లతో పోర్చుగల్ గ్రూప్ టాపర్ గానూ, రన్నరప్ గా కొరియా నాకౌట్ రౌండ్లో అడుగుపెట్టాయి.

ప్రపంచ మాజీ చాంపియన్ ఉరుగ్వే, ఘనాజట్లు ఆఖరి రెండుస్థానాలలో నిలవడం ద్వారా టోర్నీ నుంచి ఇంటిదారి పట్టాయి.

గత ఐదు ప్రపంచ కప్ టోర్నీలలో జపాన్ మూడుసార్లు ప్రీ-క్వార్టర్ ఫైనల్స్ చేరుకోగా..2002 ప్రపంచకప్ సెమీస్ చేరిన రికార్డు దక్షిణ కొరియాకు ఉంది.

ప్రస్తుత ప్రపంచకప్ నాకౌట్ రౌండ్లో టాప్ ర్యాంకర్ బ్రెజిల్ తో దక్షిణ కొరియా, గత టోర్నీ రన్నరప్ క్రొయేషియాతో జపాన్ తలపడనున్నాయి.

నేటినుంచే ప్రీ-క్వార్టర్స్ సమరం..

ప్రపంచకప్ ఫుట్ బాల్ ఫైనల్ రౌండ్ ..రెండోదశ ( ప్రీ-క్వార్టర్ ఫైనల్స్ ) పోటీలు ఈరోజు ప్రారంభంకానున్నాయి. మొత్తం ఎనిమిది గ్రూపుల నుంచి 16 జట్లు నాకౌట్ రౌండ్ చేరుకోగలిగాయి.

ప్రీ-క్వార్టర్స్ చేరిన జట్లలో బ్రెజిల్, పోర్చుగల్, స్పెయిన్, జపాన్, కొరియా, స్విట్జర్లాండ్, అర్జెంటీనా, ఆస్ట్ర్రేలియా, పోలెండ్, సెనెగల్, క్రొయేషియా, పోలెండ్ , ఫ్రాన్స్, ఇంగ్లండ్, నెదర్లాండ్స్ ఉన్నాయి.

ఈరోజు జరిగే తొలినాకౌట్ సమరంలో నెదర్లాండ్స్ తో అమెరికా అమీతుమీ తేల్చుకోనుంది. ఇతర ప్రీ-క్వార్టర్ ఫైనల్స్ పోటీలలో అర్జెంటీనాతో ఆస్ట్ర్రేలియా, ఫ్రాన్స్ తో పోలెండ్, ఇంగ్లండ్ తో సెనెగల్, జపాన్ తో క్రొయేషియా, బ్రెజిల్ తో దక్షిణ కొరియా, మొరాకోతో స్పెయిన్, పోర్చుగల్ తో స్విట్జర్లాండ్ పోటీపడతాయి.

First Published:  3 Dec 2022 12:51 PM IST
Next Story