Telugu Global
Sports

ఇద్దరు ఏషియాడ్ అథ్లెట్లకు 'డోప్' దెబ్బ!

చైనాలోని హాంగ్జు వేదికగా జరిగే ఆసియాక్రీడల్లో పాల్గొనటానికి ఎంపికైన ఇద్దరు భారత అథ్లెట్లు డోప్ పరీక్షల్లో దొరికారు.

ఇద్దరు ఏషియాడ్ అథ్లెట్లకు డోప్ దెబ్బ!
X

ఇద్దరు ఏషియాడ్ అథ్లెట్లకు 'డోప్' దెబ్బ!

చైనాలోని హాంగ్జు వేదికగా జరిగే ఆసియాక్రీడల్లో పాల్గొనటానికి ఎంపికైన ఇద్దరు భారత అథ్లెట్లు డోప్ పరీక్షల్లో దొరికారు. ఏషియాడ్ బృందంలో చోటు పోగొట్టుకొన్నారు.

చైనాలోని హాంగ్జు వేదికగా గతేడాదికి బదులుగా ఈ సంవత్సరం నిర్వహించనున్న 2022 ఆసియాక్రీడలో పాల్గొనటానికి ఎంపిక చేసిన 634 మంది సభ్యుల భారతజట్టులోని ఇద్దరు అథ్లెట్లకు డోప్ పరీక్షల దెబ్బ తగిలింది. పోటీలలో పాల్గొన కుండానే జట్టులో చోటు పోగొట్టుకొన్నారు.

జాతీయ ఉత్ప్రేరకరాల నిరోధక సంస్థ నిర్వహించిన డోప్ పరీక్షల్లో మహారాష్ట్ర్రకు చెందిన స్విమ్మర్ అనన్య నాయక్, ఉషు క్రీడాకారుడు ఓవైసీ సర్వార్ విఫలం కావడంతో ఆసియాక్రీడలకు ఎంపికైనా పాల్గోనే అవకాశం లేకుండాపోయింది. ఈ ఇద్దరి పైనా రెండేళ్లపాటు నిషేధం అమలులోకి రానుంది.

దీంతో..అనన్య నాయక్ స్థానంలో జాహ్నవి చౌదరికి చోటు కల్పించారు. ఓవైసీ సర్వార్ కు బదులుగా సూరజ్ యాదవ్ ఆసియాక్రీడల్లో పాల్గోనున్నాడు.

651కి పెరిగిన భారత బృందం....

ఆసియాక్రీడల్లో పాల్గొనటానికి ఎంపిక చేసిన భారత బృందంలోని సభ్యుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతూ వస్తోంది. గతంలో ప్రకటించిన 634 మంది సభ్యుల జాబితాకు..అదనంగా మరో 17 మంది సభ్యులను చేర్చారు.షూటింగ్, అథ్లెటిక్స్ క్రీడల్లో ఈ అదనపు సభ్యులు పాల్గోనున్నారు.

ఈ క్రీడల్లో భాగంగా జరిగే 38 క్రీడాంశాలలో పాల్గొనటానికి మొత్తం 651 మంది సభ్యుల భారీబృందాన్ని భారత క్రీడామంత్రిత్వశాఖ ఖరారు చేసి తుదిజాబితాను విడుదల చేసింది.

572 నుంచి 634కు పెరిగిన అథ్లెట్లు..

2018లో జకార్తా వేదికగా ముగిసిన ఆసియాక్రీడల్లో 572 మంది అథ్లెట్ల బృందంతో పాల్గొన్న భారత్ ..ప్రస్తుత క్రీడలకు మాత్రం 62మంది అథ్లెట్లను అదనంగా ఎంపిక చేసింది. గత ఏషియాడ్ లో భారత్ 16 స్వర్ణాలతో సహా మొత్తం 70 పతకాలు సాధించింది.

వాస్తవానికి ..ప్రస్తుత ఏషియాడ్ కోసం భారత ఒలింపిక్ సంఘం 850 మంది అథ్లెట్లను సిఫారసు చేయగా.. నిబంధనల ప్రకారం కేంద్ర క్రీడామంత్రిత్వశాఖ 634 మందికి మాత్రమే అనుమతి ఇచ్చింది.

మొత్తం సభ్యుల్లో 320 మంది పురుషులు, 314 మంది మహిళలు ఉన్నారు. ముందుగా నిర్ణయించిన కార్యక్రమం ప్రకారం 2022 అక్టోబర్లో జరగాల్సిన ఈ క్రీడల్ని కరోనా కారణంగా ఏడాదిపాటు వాయిదా వేసి..2023 సెప్టెంబర్ నుంచి రెండువారాలపాటు నిర్వహించడానికి ఆసియా ఒలింపిక్ మండలి రంగం సిద్ధం చేసింది.

క్రికెట్, చెస్, ఫుట్ బాల్ క్రీడల్లోనూ భారత్ పోటీ..

దశాబ్దకాలం విరామం తర్వాత తిరిగి ప్రవేశపెట్టిన క్రికెట్ తో పాటు చదరంగం, ఫుట్ బాల్ క్రీడల్లో సైతం భారత్ పోటీకి దిగుతోంది. ట్రాక్ అండ్ ఫీల్డ్ లో 65 మంది సభ్యులజట్టుతో పతకాలవేటకు దిగుతోంది. ఒలింపిక్‌ గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రాతో సహా 34 మంది పురుషులు, 31మంది మహిళలు భారత అథ్లెటిక్స్ జట్టులో సభ్యులుగా ఉన్నారు.

ఫుట్ బాల్ పురుషుల, మహిళల విభాగాలలో 44 మంది, హాకీ పురుషుల, మహిళల విభాగాలలో 36 మంది, క్రికెట్ పురుషుల , మహిళల విభాగాలలో 30 మంది సభ్యులు భారత్ కు ప్రాతినిథ్యం వహించనున్నారు.

సెయిలింగ్ జట్టులో 33 మంది క్రీడాకారులున్నారు. వెయిట్ లిఫ్టింగ్, జిమ్నాస్టిక్స్, హ్యాండ్ బాల్, రగ్బీ, వెయిట్ లిఫ్టింగ్, కురాష్ క్రీడల్లోనూ భారత అథ్లెట్లు పోటీకి దిగనున్నారు. పురుషుల 65 కిలోల కుస్తీ విభాగంలో భజరంగ్ పూనియాకు సైతం కేంద్ర క్రీడామంత్రిత్వశాఖ అనుమతి ఇచ్చింది.

సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 8 వరకూ జరిగే ఈ క్రీడల్లో ఆసియాఖండంలోని 45 దేశాలకు పైగా అథ్లెట్లు తలపడనున్నారు.

First Published:  10 Sept 2023 1:45 PM IST
Next Story