Telugu Global
Sports

ఆసియాక్రీడల షూటింగ్ లో భారత జట్టు ప్రపంచ రికార్డు!

19వ ఆసియాక్రీడల్లో భారత షూటర్ల పతకాల వేట అప్రతిహతంగాసాగుతోంది. పురుషుల 50 మీటర్ల రైఫిల్ విభాగంలో భారతజట్టు సరికొత్త ప్రపంచ రికార్డుతో బంగారు పతకం అందుకొంది.

ఆసియాక్రీడల షూటింగ్ లో భారత జట్టు ప్రపంచ రికార్డు!
X

ఆసియాక్రీడల షూటింగ్ లో భారత జట్టు ప్రపంచ రికార్డు!

19వ ఆసియాక్రీడల్లో భారత షూటర్ల పతకాల వేట అప్రతిహతంగాసాగుతోంది. పురుషుల 50 మీటర్ల రైఫిల్ విభాగంలో భారతజట్టు సరికొత్త ప్రపంచ రికార్డుతో బంగారు పతకం అందుకొంది.

గాంగ్జు ఆసియాక్రీడల షూటింగ్ పురుషుల, మహిళల విభాగాలలో ఇప్పటికే 13 పతకాలు సాధించిన భారత షూటర్లు..పోటీల ఐదోరోజున మరో రెండు పతకాలు సాధించారు.

పతకాల పట్టిక నాలుగోస్థానంలో భారత్...

ఆసియాక్రీడల మొదటి 5 రోజుల పోటీలు ముగిసే సమయానికి భారత్ మొత్తం 8 స్వర్ణాలతో సహా 31 పతకాలు సాధించడం ద్వారా పతకాల పట్టిక 4వ స్థానంలో నిలిచింది.

భారత ఖాతాలో 11 రజత, 12 కాంస్య పతకాలు సైతం ఉన్నాయి.

పురుషుల 50 మీటర్ల రైఫిల్ టీమ్ విభాగంలో స్వప్నీల్ కుశాల్, ఐశ్వర్య ప్రతాప్ సింగ్ తోమర్, అఖిల్ షెరోన్ లతో కూడిన భారతజట్టు 1769 పాయింట్లతో సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పింది.

గతేడాది అమెరికా వేదికగా జరిగిన ప్రపంచ పోటీలలో 1761 పాయింట్లతో సాధించిన తన ప్రపంచ రికార్డును భారతజట్టు మరోసారి తానే అధిగమించింది.

పోటీల 5వ రోజున భారత్ షూటింగ్ లో బంగారు, ఉషులో వెండి, అశ్వక్రీడ వ్యక్తిగత విభాగంలో కంచు పతకాలు సాధించింది.

మహిళల ఉషు ఫైనల్స్ చేరిన నోరెమ్ రోషిబినా దేవి రజత పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 2018 జకార్తా ఆసియాక్రీడల ఉషులో తొలిసారిగా పతకం సాధించిన రోషిబినా..ప్రస్తుత ఆసియాక్రీడల్లో సైతం రజత పతకమే దక్కించుకోగలిగింది. కేవలం ఉషు క్రీడలోనే భారత్ కు 8 పతకాలు లభించాయి.

అశ్వక్రీడల డ్రెసాజ్ వ్యక్తిగత విభాగంలో భారత రౌతు అనూష్ అగర్వాలా కాంస్య పతకం సాధించాడు.

పురుషుల హాకీ సెమీస్ లో భారత్...

పురుషుల హాకీ సెమీఫైనల్స్ కు ఆసియా నంబర్ వన్ జట్టు భారత్ అలవోకగా చేరుకొంది. గ్రూపులీగ్ లో వరుసగా మూడో విజయం సాధించడం ద్వారా నాకౌట్ రౌండ్లో చోటు ఖాయం చేసుకొంది.

లీగ్ ప్రారంభమ్యాచ్ లో ఉజ్బెకిస్థాన్ ను 16-0తోను, రెండోరౌండ్లో సింగపూర్ ను 16-1తోనూ ఓడించిన భారత్...కీలక మూడోరౌండ్ పోరులో ఆసియాక్రీడల విజేత జపాన్ ను 4-2తో చిత్తు చేసింది.

భారత ఆధిపత్యంతో కొనసాగిన ఈ పోరులో భారత్ తరపున ఆట 13, 48 నిముషాలలో అభిషేక్, 24వ నిముషంలో మన్ దీప్ సింగ్, 34వ నిముషంలో అమిత్ రోహిదాస్ గోల్సు సాధించారు.

జపాన్ తరపున ఆట 57వ నిముషంలో జెంకీ మిటానీ, 60వ నిముషంలో కాటో చెరోగోలు సాధించారు. ఈనెల 30న జరిగే గ్రూప్ -ఏ లీగ్ పోరులో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో భారత్ తలపడనుంది.

మహిళల గ్రూపులీగ్ పోటీలో సింగపూర్ పై భారత్ భారీవిజయం నమోదు చేసింది.

పురుషుల టెన్నిస్ డబుల్స్ లో రజతం...

ఆసియాక్రీడల పురుషుల సింగిల్స్ లో దారుణంగా విఫలమైన భారత్ డబుల్స్ లో రజత పతకం దక్కించుకోగలిగింది. చైనీస్ తైపీ జోడీ జేసన్ జుంగ్- సియో హూ సూలతో జరిగిన స్వర్ణ పతకం పోరులో భారతజోడీ రామ్ కుమార్ రామనాథన్- సాకేత్ మైనేని రజత పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

ఫుట్ బాల్ పురుషుల విభాగంలో భారత పోటీ ప్రీ-క్వార్టర్ ఫైనల్ దశలోనే ముగిసింది. ప్రపంచ 57వ ర్యాంకర్ సౌదీ అరేబియాతో జరిగిన పోరులో 102వ ర్యాంకర్ భారత్ పోరాడి ఓడింది. సౌదీజట్టు 2-0తో భారత్ ను అధిగమించడం ద్వారా క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టింది.

స్క్వాష్ పురుషుల, మహిళల విభాగాలలో భారతజట్లు సెమీస్ చేరడం ద్వారా రెండు పతకాలను ఖాయం చేశాయి.

బ్యాడ్మింటన్లో మహిళాజట్టు విఫలం

బ్యాడ్మింటన్ మహిళల టీమ్ విభాగంలో భారత్ పోటీ ప్రీ- క్వార్టర్ ఫైనల్లోనే ముగిసింది. క్వార్టర్ ఫైనల్స్ లో చోటు కోసం జరిగిన పోరులో థాయ్ లాండ్ 3-0తో భారత్ ను చిత్తు చేసింది.

రెండుసార్లు ఒలింపిక్ మెడలిస్ట్ పీవీ సిందు తొలి సింగిల్స్ లో థాయ్ సంచలనం చోచువాంగ్ తో మూడుగేమ్ ల పోరులో ఓటమి చవిచూసింది. తొలిగేమ్ ను 21-14 తో నెగ్గిన సింధు..ఆ తర్వాతి రెండుగేమ్ లను 15-21, 14-21 తో చేజార్చుకొంది. ఆ తర్వాత జరిగిన మహిళల డబుల్స్, సింగిల్స్ పోటీలలో సైతం భారత్ కు ఓటమి తప్పలేదు..

పురుషుల టీమ్ విభాగంలో భారతజట్టు ఏదో ఒక పతకం గెలుచుకోడం ఖాయంగా కనిపిస్తోంది. క్వార్టర్ ఫైనల్లో నేపాల్ ను భారత్ ఓడించగలిగితే మెడల్ రౌండ్లో ప్రవేశించగలుగుతుంది.

First Published:  29 Sept 2023 12:31 PM IST
Next Story