Telugu Global
Sports

60 ఏళ్లు...60 కి 60 పాయింట్లతో స్వర్ణం!

ఏకాగ్రత, లక్ష్యాన్ని గురిచూసి కొట్టే ప్రావీణ్యం, ఒత్తిడిని అధిగమించే నేర్పు అవసరమైన షూటింగ్ క్రీడకు వయసుతో ఏమాత్రం పనిలేదని 60 సంవత్సరాల కువైట్ షూటర్ 19వ ఆసియాక్రీడల్లో చాటి చెప్పాడు.

60 ఏళ్లు...60 కి 60 పాయింట్లతో స్వర్ణం!
X

ఏకాగ్రత, లక్ష్యాన్ని గురిచూసి కొట్టే ప్రావీణ్యం, ఒత్తిడిని అధిగమించే నేర్పు అవసరమైన షూటింగ్ క్రీడకు వయసుతో ఏమాత్రం పనిలేదని 60 సంవత్సరాల కువైట్ షూటర్ 19వ ఆసియాక్రీడల్లో చాటి చెప్పాడు.

చైనాలోని హాంగ్జు వేదికగా జరుగుతున్న 19వ ఆసియాక్రీడల షూటింగ్ స్కీట్ విభాగంలో కువైట్ కు చెందిన 60 సంవత్సరాల షూటర్ అబ్దుల్లా అల్ రషీదీ ఓ అరుదైన ఘనతను సాధించాడు.

ఆరుపదుల వయసులో...అదీ షూటింగ్ లో 60కి 60 పాయింట్లు సాధించడంతో పాటు బంగారు పతకం గెలుచుకోడం సాధ్యమేనని చాటి చెప్పాడు.

కుర్రాళ్లతో పోటీ పడి ......

షూటింగ్ పలు రకాలు. పిస్టల్ షూటింగ్, రైఫిల్ షూటింగ్ విభాగాలలో దూరాన్ని బట్టి ఎన్నో రకాల పోటీలు నిర్వహిస్తూ ఉంటారు. అయితే..గాలిలో కదులుతూ పోయే లక్ష్యాలను..వివిధ బంగిమల్లో నిలబడి కొట్టే స్కీట్ షూటింగ్ లో రాణించాలంటే నైపుణ్యంతో పాటు ...పోటీపడుతున్న క్రీడ పట్ల అంతులేని ప్రేమ, అభిమానం ఉండితీరాలి.

హాంగ్జు ఆసియాక్రీడల షూటింగ్ లో వివిధ దేశాలకు చెందిన వందలాదిమంది షూటర్లు వివిధ విభాగాలలో పోటీకి దిగారు. ఆ షూటర్లందరిలో అత్యంత పెద్దవయస్కుడైన షూటర్ అబ్దుల్లా అల్ రషీదీ మాత్రమే.

60 ఏళ్ల వయసులో తన దేశానికి బంగారు పతకం సాధించి పెట్టడం కోసం అల్ రషీదీ పోటీకి దిగాడు. తన వయసులో మూడోవంతైనా లేని నవతరం షూటర్లకే సవాలు విసిరాడు.

ప్రధానంగా భారత యువషూటర్ అనంత్ జీత్ సింగ్ నరూకా నుంచి గట్టి పోటీ ఎదుర్కొన్నాడు. బంగారు పతకం కోసం జరిగిన పోరులో అల్ రషీదీ 60కి 60 పాయింట్లు సాధించాడు. గురితప్పని లక్ష్యసాధనలో తనకుతానే సాటిగా ,మేటిగా నిలిచాడు. 19వ ఆసియాక్రీడల్లో 60కి 60 పాయింట్లు సాధించిన 60 సంవత్సరాల షూటర్ గా అల్ రషీదీ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.

2016 రియో ఒలింపిక్స్ షూటింగ్ లో కాంస్య పతకం మాత్రమే సాధించిన అల్ రషీదీకి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. ప్రీమియర్ లీగ్ క్లబ్ ఆర్సెనెల్ కు వీరాభిమానిగా ఉన్న అల్ రషీదీ నలుగురు పిల్లలకు తండ్రి కూడా..

ఆసియాక్రీడల్లో 3వ స్వర్ణం...

ఆసియాక్రీడల స్కీట్ షూటింగ్ లో బంగారు పతకం సాధించడం అల్ రషీదీకి ఇదే మొదటిసారికాదు. 2010, 2014 ఆసియాక్రీడల్లో సైతం స్వర్ణపతకాలు సాధించాడు. ఆసియాక్రీడల్లో అల్ రషీదీకి ఇది మూడోస్వర్ణం కావడం విశేషం. ఫైనల్లో 60కి 60 పాయింట్లు సాధించడం ద్వారా సరికొత్త ప్రపంచ, ఆసియాక్రీడల రికార్డులు నమోదు చేశాడు.

గోల్డ్ మెడల్ పోరులో భారత షూటర్, 25 సంవత్సరాల అనంత్ జీత్ గట్టి పోటీ ఇచ్చి 58 పాయింట్లతో రజత పతకం తో సరిపెట్టుకొన్నాడు.

అల్ రషీదీ 1994 హిరోషిమా ఆసియాక్రీడల ద్వారా అరంగేట్రం చేశాడు. అల్ రషీదీ తొలిసారిగా ఆసియాక్రీడల బరిలోకి నిలిచిన సమయానికి భారత షూటర్ అనంతజీత్ జన్మించలేదు. 1995లో తొలిసారిగా ప్రపంచ టైటిల్ నెగ్గిన అల్ రషీదీ 1997, 98 ప్రపంచ పోటీలలో సైతం తిరుగులేని విజేతగా నిలిచాడు.

ఆసియాక్రీడల్లో తన పతకాల వేటను కాంస్యంతో మొదలు పెట్టిన అల్ రషీదీ ఆ తరువాత అలవోకగా బంగారు పతకాలు గెలుచుకొనే స్థాయికి ఎదిగాడు. 1996 అట్లాంటా ఒలింపిక్స్ బరిలోకి తొలిసారిగా దిగిన అల్ రషీదీ 42వ స్థానం మాత్రమే సాధించగలిగాడు.

2021 టోక్యో ఒలింపిక్స్ లో కాంస్య పతకం అందుకొన్నాడు. రియో ఒలింపిక్స్ లో అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం పతాకంతో పాల్గొని మరీ పతకం అందుకొన్నాడు.

తన కుమారుడు కానుకగా ఇచ్చిన ఆర్సెనల్ జెర్సీ ధరించి రియో ఒలింపిక్స్ లో కాంస్య పతకం గెలుచుకోడం తాను సాధించిన గొప్ప విజయాలలో ఒకటని అల్ రషీదీ తరచూ చెబుతూ ఉంటాడు.

అల్ రషీదీ కుమారుడు తలాల్ అల్ రషీదీ సైతం షూటర్ గా తన తండ్రి బాటలో ప్రయాణం మొదలు పెట్టాడు. తండ్రీ కొడుకులు ఇద్దరూ టోక్యో ఒలింపిక్స్ బరిలోకి దిగితే..

తండ్రి అల్ రషీదీకి కాంస్యం, కుమారుడికి 7వ స్థానం దక్కాయి.

వచ్చే ఏడాది జరిగే పారిస్ ఒలింపిక్స్ లో తన దేశానికి బంగారు పతకం సాధించడమే తన లక్ష్యమని ఈ 'ఓల్డ్ ఈజ్ గోల్డ్ 'షూటర్ ప్రకటించాడు.

First Published:  2 Oct 2023 9:45 AM GMT
Next Story