ఏషియాడ్ బాక్సింగ్ మెడల్ రౌండ్లో తెలంగాణా బాక్సర్!
ఆసియాక్రీడల మహిళల బాక్సింగ్ మెడల్ రౌండ్ కు తెలంగాణా బాక్సర్ నిఖత్ జరీన్ అలవోకగా చేరుకొంది. టెన్నిస్ పురుషుల డబుల్స్ లో భారత్ కు రజత పతకం దక్కింది.
ఆసియాక్రీడల మహిళల బాక్సింగ్ మెడల్ రౌండ్ కు తెలంగాణా బాక్సర్ నిఖత్ జరీన్ అలవోకగా చేరుకొంది. టెన్నిస్ పురుషుల డబుల్స్ లో భారత్ కు రజత పతకం దక్కింది...
హాంగ్జు వేదికగా జరుగుతున్న 19వ ఆసియాక్రీడల ఆరోరోజు పోటీలలో భారత్ పతకాల వేట కాస్త మందగించింది. పతకాల పట్టిక 4వ స్థానంలో భారత్ కొనసాగుతోంది.
భారత్ మొత్తం 8 స్వర్ణ, 12 రజత, 13 కాంస్యాలతో సహా 33 పతకాలు సాధించింది.
టెన్నిస్ డబుల్స్ లో రజతం...
భారీ అంచనాలతో ఆసియాక్రీడల టెన్నిస్ బరిలో నిలిచిన భారత్ కేవలం రెండు పతకాలకు మాత్రమే పరిమితం కావాల్సి వస్తోంది. పురుషుల డబుల్స్ లో రామ్ కుమార్ రామనాథన్- సాకేత్ మైనేనిల జోడీ రజత పతకం సాధించారు. మిక్సిడ్ డబుల్స్ సెమీస్ చేరడం ద్వారా రోహన్ బొపన్న-రుతుజా భోంస్లే జోడీ కనీసం కాంస్య పతకం దక్కించుకోనున్నారు.
హాంగ్జు టెన్నిస్ కాంప్లెక్స్ వేదికగా పురుషుల డబుల్స్ స్వర్ణం కోసం జరిగిన పోరులో చైనీస్ తైపీ జోడీ సూయూ- జేసన్ జంగ్ 6-4, 6-4తో భారతజోడీని ఓడించారు.
రామ్ కుమార్ కు ఆసియాక్రీడల్లో ఇది తొలిపతకం కాగా..తెలుగుతేజం సాకేత్ మైనేనికి మాత్రం ఇది మూడో పతకం. 2014 ఇంచెన్ ఆసియాక్రీడల్లో సానియా మీర్జాతో జంటగా సాకేత్ మిక్సిడ్ డబుల్స్ లో స్వర్ణపతకం సాధించాడు. సనమ్ సింగ్ తో జట్టుగా పురుషుల డబుల్స్ లో రజత పతకం గెలుచుకొన్నాడు.
2018 ఆసియాక్రీడల టెన్నిస్ లో మొత్తం 3 పతకాలు సాధించిన భారత టెన్నిస్ జట్టు ప్రస్తుత క్రీడల్లో మాత్రం కేవలం 2 పతకాలకు మాత్రమే పరిమితం కావాల్సి వచ్చింది.
పారిస్ ఒలింపిక్స్ కు నిఖత్ అర్హత...
మహిళల బాక్సింగ్ లో తెలుగు రాష్ట్ర్రాల స్టార్ బాక్సర్ , ప్రపంచ చాంపియన్ నిఖత్ జరీన్ ఆసియాక్రీడల మహిళల 50 కిలోల విభాగం మెడల్ రౌండ్ కు చేరుకొంది. క్వార్టర్ ఫైనల్స్ విజయంతో..త్వరలో జరిగే పారిస్ ఒలింపిక్స్ లో సైతం బెర్త్ ఖాయం చేసుకోగలిగింది.
సెమీఫైనల్స్ లో చోటు కోసం జరిగిన పోరులో జోర్డాన్ బాక్సర్ హానన్ నాజర్ ను కేవలం 2 నిముషాలలోనే నాకౌట్ చేయడం ద్వారా నిఖత్ మెడల్ రౌండ్లో అడుగుపెట్టింది.
ఫైనల్ కు అర్హతగా జరిగే సెమీస్ రౌండ్ లో థాయ్ లాండ్ బాక్సర్ చుతామత్ రక్సాత్ తో నిఖత్ తలపడనుంది.
మహిళల హాకీ లీగ్ పోరులో మలేసియాను 6-0 గోల్స్ తో చిత్తు చేయడం ద్వారా భారత్ వరుసగా రెండో విజయం నమోదు చేసింది. మహిళల స్క్వాష్ టీమ్ విభాగంలో సైతం భారత్ కు కాంస్య పతకం దక్కింది.
ట్రాక్ అండ్ ఫీల్డ్ అంశాలలో భాగంగా జరిగిన మహిళల షాట్ పుట్ త్రో విభాగంలో భారత్ కు చెందిన కిరణ్ బలియాన్ కాంస్య పతకం సాధించడం ద్వారా చరిత్ర సృష్టించింది.
గత 7 దశాబ్దాల కాలంలో ఆసియాక్రీడల షాట్ పుట్ లో ఓ పతకం నెగ్గిన భారత తొలి మహిళగా రికార్డుల్లో చేరింది.
క్రీడల మొదటి ఆరురోజుల్లో షూటర్లే భారత్ కు 5 స్వర్ణాలతో సహా మొత్తం 17కు పైగా పతకాలు అందించగలిగారు.