అహో! తండ్రి..ఒహో! కొడుకు..ఆసియాక్రీడల్లో అరుదైన ఘట్టం!
ఆసియాక్రీడల్లో భారత్ కు పతకాలు సాధించి పెట్టిన తండ్రి,కొడుకుల జాబితాలో ఇద్దరు రోయింగ్ క్రీడాకారులు చేరారు. తమ కుటుంబ సాంప్రదాయాన్ని కొనసాగించారు.
ఆసియాక్రీడల్లో భారత్ కు పతకాలు సాధించి పెట్టిన తండ్రి,కొడుకుల జాబితాలో ఇద్దరు రోయింగ్ క్రీడాకారులు చేరారు. తమ కుటుంబ సాంప్రదాయాన్ని కొనసాగించారు.
19వ ఆసియాక్రీడల రోయింగ్ (తెడ్లు వేసి పడవ నడిపే ) క్రీడ లో భారత్ కు చెందిన తండ్రి, కొడుకు ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకొన్నారు. 2002 బుసాన్ ఆసియాక్రీడల రోయింగ్ లో భారత్ కు ఇంద్రపాల్ సింగ్ పతకం సాధించిపెడితే...20 సంవత్సరాల విరామం తర్వాత పర్మిందర్ సింగ్ హాంగ్జు ఆసియాక్రీడల రోయింగ్ లో కాంస్య పతకం గెలుచుకోడం ద్వారా తండ్రికి తగ్గ తనయుడిగా నిలిచాడు.
ఫుయాంగ్ వాటర్ స్పోర్ట్స్ సెంటర్ వేదికగా జరిగిన క్వాడ్రపుల్ స్కల్స్ విభాగంలో పర్మిందర్, సత్నాం సింగ్, జకర్ ఖాన్, సుఖ్ మీత్ సింగ్ లతో కూడిన భారతజట్టు 6:08.61 నిముషాల టైమింగ్ తో కాంస్య పతకం గెలుచుకోడంతో ఓ అరుదైన రికార్డు నమోదయ్యింది.
2002లో ఇంద్రపాల్ సింగ్...
21 సంవత్సరాల క్రితం బుసాన్ వేదికగా జరిగిన ఆసియాక్రీడల రోయింగ్ కాక్స్ లెస్ విభాగం లో పతకం గెలుచుకొన్న భారతజట్టులో ఇంద్రపాల్ సింగ్ సభ్యుడిగా ఉన్నాడు. ఆ తర్వాత సిడ్నీ ఒలింపిక్స్ కు సైతం అర్హత సాధించిన భారత తొలి రోయర్ గా కూడా చరిత్ర సృష్టించాడు.
ప్రస్తుత గాంగ్జు ఆసియాక్రీడల్లో పాల్గొంటున్న భారత రోయింగ్ జట్టుకు ఇంద్రపాల్ సింగ్ శిక్షకుడిగా వ్యవహరిస్తున్నారు.
2023లో పర్మిందర్ సింగ్....
హాంగ్జు వేదికగా జరుగుతున్న 19వ ఆసియాక్రీడల క్వాడ్రపుల్ స్కల్స్ విభాగంలో పర్మిందర్ సింగ్ కాంస్య పతకం సాధించడం ద్వారా తండ్రికి తగ్గ తనయుడిగా నిలిచాడు.
రెండు వేర్వేరు ఆసియాక్రీడల్లో భారత్ కు రోయింగ్ పతకాలు సాధించి పెట్టిన తండ్రితనయుడిగా ఇంద్రపాల్ సింగ్, పర్మిందర్ సింగ్ రికార్డుల్లో చేరారు.
తన కుమారుడు పర్మిందర్ సింగ్ కాంస్య పతకం అందుకొన్న సమయంలో భారతజట్టుకు ఇంద్రపాల్ సింగ్ శిక్షకుడిగా ఉండటం మరో విశేషం.
రెండు దశాబ్దాల క్రితం తన తండ్రి ఇంద్రపాల్ దేశానికి రోయింగ్ పతకం అందిస్తే..ఇప్పుడు తాను సైతం కాంస్య విజేతగా నిలవడం గర్వకారణంగా ఉందని, ఏదో తెలియని అనుభూతికి లోనయ్యానని, తండ్రి చూస్తుండగా ఆసియాక్రీడల పతకం అందుకోడాన్ని మించిన అదృష్టం తనకు మరొకటి లేదంటూ పర్మిందర్ సింగ్ మురిసిపోయాడు.
2018 ఆసియాక్రీడల క్వాడ్రపుల్ స్కల్స్ విభాగంలో బంగారు పతకం గెలుచుకొన్న భారతజట్టు..ప్రస్తుత క్రీడల్లో మాత్రం కాంస్య పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
జకార్తా గేమ్స్ రోయింగ్ లో ఓ స్వర్ణ, 2 కాంస్యాలతో మొత్తం మూడు పతకాలు సాధించిన భారత రోయింగ్ జట్టు..ప్రస్తుత గాంగ్జు గేమ్స్ లో రెండు రజత, మూడు కాంస్య పతకాలు సాధించడం విశేషం.
మొత్తం 33 మంది సభ్యుల భారత రోయింగ్ జట్టు 5 పతకాలతో అంచనాలకు మించి రాణించగలిగింది.