Telugu Global
Sports

పతకాల వెనుక ఎన్నో వ్యధలు, కథలు!

ఆసియాక్రీడల్లో భారత్ సాధించిన 107 పతకాల వెనుక ఎన్నో కష్ట్లాలు, త్యాగాలు దాగి ఉన్నాయి. ఒక్కో పతక విజేత వెనుక ఒక్కో వ్యధ, కథ ఉన్నాయి.

పతకాల వెనుక ఎన్నో వ్యధలు, కథలు!
X

పతకాల వెనుక ఎన్నో వ్యధలు, కథలు!

ఆసియాక్రీడల్లో భారత్ సాధించిన 107 పతకాల వెనుక ఎన్నో కష్ట్లాలు, త్యాగాలు దాగి ఉన్నాయి. ఒక్కో పతక విజేత వెనుక ఒక్కో వ్యధ, కథ ఉన్నాయి.

19వ ఆసియాక్రీడల్లో భారత్ రికార్డుస్థాయిలో 107 పతకాల సాధన వెనుక వందల కోట్ల రూపాయల వ్యయం మాత్రమే కాదు..వేలగంటల స్వేదం, ఎన్నో కుటుంబాల త్యాగం ఇమిడి ఉన్నాయి.

భారతజట్టులో సభ్యులుగా పతకాలు సాధించిన అథ్లెట్లలో భారత్ లోని భిన్నవర్గాలకు చెందినవారు ఉన్నారు. రాజవంశీకుల నుంచి రోజువారీ కూలీ వరకూ, కవల పిల్లల తల్లి నుంచి కూరగాయల వ్యాపారి కుమార్తె వరకూ వివిధ క్రీడల్లో పతకాలు సాధించడం ద్వారా భారత మువ్వన్నెల జెండాను రెపరెపలాడించిన వారే. ఈ పతక విజేతల వెనుక కుటుంబసభ్యుల త్యాగం, అంకితభావం, దీక్ష పట్టుదల , నిరంతర సాధన ఉన్నాయి.

రోజువారీ కూలీ..ఆసియాక్రీడల్లో పతక విజేత!

హాంగ్జు ఆసియాక్రీడల్లో తొలిసారిగా ప్రవేశపెట్టిన 35 కిలోమీటర్ల మిక్సిడ్ రేస్ వాక్ లో మంజు రాణీతో కలసి భారత్ కు కాంస్య పతకం సాధించి పెట్టిన 24 సంవత్సరాల రాంబాబు పడిన కష్టం చూస్తే అతను సాధించిన విజయం ఎంత అమూల్యమైనదో తెలుస్తుంది.

ఉత్తరప్రదేశ్ లో అత్యంత వెనుకబడిన సోనేభద్ర జిల్లాలోని బేహురా గ్రామానికి చెందిన ఓ రోజువారీ కూలీ కుటుంబంలో జన్మించిన రాంబాబు కటిక పేదరికంతో సహవాసం చేస్తూ వచ్చాడు. ఆరుగురు సభ్యుల కుటుంబం కేవలం రాంబాబు తండ్రి కూలీ పనులు చేస్తూ సంపాదించే 3వేల 500 రూపాయలతో జీవిస్తూ వచ్చారు. తల్లి, ముగ్గురు అక్కచెల్లెళ్ల కోసం తండ్రితో కలసి రాంబాబు సైతం రోజువారీ కూలీ పనులకు వెళుతూ ఉండేవాడు. రాంబాబుకు స్వతహాగా ఆటలంటే చెప్పలేని ఇష్టం. కరోనా సమయంలో కూలీ పనులు లేకపోడంతో జాతీయ కనీస ఉపాధి హామీ పథకం ద్వారా లభించే 300 రూపాయల నుంచి 5 వందల రూపాయల కూలీతో కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటూ వచ్చాడు.

చాలీచాలని తిండితో కాయకష్టం చేస్తూ వచ్చిన రాంబాబుకు దైనందిన జీవితంలో నడక ఓ భాగంగా మారింది. 50 కిలోమీటర్ల దూరం నడచినా అలుపుసొలుపు లేని పటుత్వం రాంబాబుకు ఉంది. అదే చివరకు రాంబాబు పాలిట వరంగా మారింది. జాతీయస్థాయిలో నిర్వహించిన సుదూర నడక పోటీలలో పాల్గొంటూ భారత సైనికదళంలో సిపాయి ఉద్యోగం సంపాదించాడు. ఆ తర్వాత నుంచి రాంబాబు వెనుదిరిగి చూసిందిలేదు. 23 సంవత్సరాల వయసుకే ప్రపంచ పోటీలలో పాల్గొని 27వ స్థానంలో నిలిచాడు.

హాంగ్జు ఆసియాక్రీడల్లో పాల్గొనే భారత అథ్లెటిక్స్ జట్టులో చోటు సంపాదించి..35 కిలోమీటర్ల రేస్ వాక్ లో కాంస్య విజేతగా నిలిచాడు. మొత్తం 35 కిలోమీటర్ల దూరాన్ని 2 గంటల 57 నిముషాల 54 సెకన్ల రికార్డుతో ఆసియాక్రీడల పతక విజేతగా రికార్డుల్లో చేరాడు. ఆసియాక్రీడల్లో పతకం సాధించాలంటే ఉన్నత కుటుంబానికి చెందినవారే కానవసరం లేదనటానికి రాంబాబు విజయమే నిదర్శనం.


జావలిన్ కోసం అప్పులు చేసి....

పురుషుల జావలిన్ త్రోలో రజత పతకం సాధించిన ఒడిషా బల్లెంవీరుడు కిశోర్ కుమార్ జెనా నిధుల లేమితో అల్లాడాడు. పూరీ జిల్లాలోని కొతసాహీ గ్రామానికి చెందిన కిశోర్ జెనా ఓ నిరుపేద కుటుంబంలో జన్మించినా క్రీడల్లో రాణించేలా తండ్రి, ఇతర కుటుంబసభ్యులు ఎంతగానో ప్రోత్సహించారు. ఫుట్ బాల్, వాలీబాల్ క్రీడల్లో రాణిస్తూ వచ్చిన కిశోర్ జెనా బల్లెం విసరటం పట్ల ఆసక్తిని పెంచుకొన్నాడు. తగిన శిక్షకుడు లేకుండానే సాధన మొదలు పెట్టాడు. 28వేల రూపాయల ఖరీదు చేసే సొంత జావలిన్ సమకూర్చుకోడానికి జెనా కుటుంబం పడిన పాట్లు అన్నీఇన్నీ కావు. ఒడిషా ప్రభుత్వ సహకారంతో జాతీయస్థాయి అథ్లెట్ గా ఎదిగిన కిశోర్ జెనా ప్రపంచ అథ్లెటిక్స్ లో భారత్ కు ప్రాతినిథ్యం వహించే స్థాయికి ఎదిగాడు.

ఆసియాక్రీడల జావలిన్ త్రోలో విజేత నీరజ్ చోప్రాకు గట్టిపోటీ ఇచ్చి 87.54 మీటర్ల రికార్డుతో రజత పతకం అందుకొన్నాడు. 2024 పారిస్ ఒలింపిక్స్ కు సైతం అర్హత సంపాదించాడు.

అంతర్జాతీయ పోటీలకు సిద్ధం కావడం కోసం గత రెండేళ్లుగా కుటుంబసభ్యులకు దూరంగా ఉన్న కిశోర్ జెనా చివరకు అనుకొన్న లక్ష్యాన్ని చేరుకోగలిగాడు. కిశోర్ జెనా సాధించిన విజయం చూసి కోతాసాహీ గ్రామస్థులు పొంగిపోయారు. మిఠాయిలు పంచుకొని మరీ మురిసిపోయారు. దేశానికి పతకంతో పాటు తమ రాష్ట్ర్రానికి గుర్తింపు తెచ్చిన కిశోర్ జెనాకు ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కోటీ 50 లక్షల రూపాయలు నజరానాగా ప్రకటించారు. తన ఎదుగుదల కోసం కుటుంబ సభ్యులు చేసిన అప్పులను త్వరలోనే తీర్చివేయాలని కిశోర్ జెనా భావిస్తున్నాడు.


కూరగాయల వ్యాపారి కుమార్తె విజయం...

ముంబై శివారులోని దహీసార్ ప్రాంతంలో తోపుడుబండి మీద కూరగాయాలు విక్రయిస్తూ వచ్చిన మొత్తంతో కుటుంబసభ్యులు తీర్చిదిద్దిన అథ్లెట్ ఐశ్వర్య. ఆసియాక్రీడల మహిళల 400 మీటర్ల రిలేలో రజత పతకం సాధించిన భారతజట్టులో సభ్యురాలిగా ఉన్న తన కుమార్తె ఐశ్వర్యను చూసి కైలాశ్ మిశ్రా పొంగిపోతున్నాడు.

తాను కూరగాయలు అమ్మిన కష్టం వృధా కాలేదని, తన కుమార్తె దేశానికి పతకం సాధించి పెట్టడం గర్వకారణంగా ఉందని మురిసిపోతున్నాడు. గత రెండేళ్లుగా శిక్షణ కోసం తమ కుటుంబానికి దూరంగా ఉంటూ వచ్చిన ఐశ్వర్య ను ఎప్పుడు చూస్తామా అని ఆ కుటుంబం ఎదురు చూస్తోంది. ముంబై పరిసర ప్రాంతాలలో జరిగే మారథాన్ పరుగు పోటీలలో పాల్గొంటూ వచ్చిన ప్రైజ్ మనీతో కుటుంబానికి అండగా నిలిచిన ఐశ్వర్య ఇప్పుడు ఆసియాక్రీడల పతక విజేత. మహిళల 400 మీటర్ల పరుగులో నాలుగోస్థానంలో నిలిచిన ఐశ్వర్య రిలేలో మాత్రం రజత పతకం అందుకోగలిగింది.


కవలపిల్లలకు దూరమై స్వర్ణం సాధించిన దీపిక..

ఆసియాక్రీడల స్క్వాష్ మిక్సిడ్ డబుల్స్ విభాగంలో హరిందర్ పాల్ సింగ్ సంధూతో కలసి బంగారు పతకం సాధించిన దీపిక పల్లికల్ దేశం కోసం తన ఇద్దరు కవలపిల్లలకు గత రెండుమాసాలుగా దూరమయ్యింది.

భారత మాజీ క్రికెటర్ , ప్రస్తుత కామెంటీటర్ దినేశ్ కార్తీక్ ను వివాహం చేసుకొన్న దీపిక కవలల తల్లిగా పిల్లల బాగోగులు చూసుకోడం కోసం గత నాలుగేళ్లుగా స్క్వాష్ క్రీడకు దూరంగా ఉంటూ వచ్చింది. అయితే..కఠోరసాధనతో తిరిగి భారతజట్టులో చోటు సంపాదించడం ద్వారా ఆసియా క్రీడల్లో పాల్గొనగలిగింది. పోటీల సన్నాహాల కోసం గత రెండుమాసాలుగా పిల్లలకూ దూరం కావడం బాధను, అపరాదభావాన్నికలిగించాయని, అయితే దేశం కోసం తాను సాధించిన బంగారు పతకం విలువ ఏంటో తన పిల్లలు రానున్న కాలంలో తెలుసుకొంటారని తన స్వర్ణ పతక విజయానంతరం 32 సంవత్సరాల దీపిక చెప్పింది.

ఆసియాక్రీడల్లో పతకం సాధించాలంటే పిల్లలు అవరోధం కాదని చాటి చెప్పడానికే తాను స్క్వాష్ క్రీడలో పునరాగమనం చేసినట్లు దీపిక తెలిపింది.


ఆస్తులు అమ్మిన జ్యోతి సురేఖ తల్లిదండ్రులు..

ఆసియాక్రీడల విలువిద్య పోటీల మూడు విభాగాలలో మూడు బంగారు పతకాలు సాధించిన తెలుగుతేజం జ్యోతి సురేఖను అంతర్జాతీయ ఆర్చర్ గా తీర్చిదిద్దటం కోసం

ఆమె తల్లిదండ్రులు తమ ఆస్తులను అమ్ముకోవాల్సి వచ్చింది. గత ఏడేళ్ల కాలంలో ప్రపంచ, ఆసియాస్థాయి పోటీలలో 30కి పైగా బంగారు పతకాలు సాధించిన తమ కుమార్తె హాంగ్జు ఆసియాక్రీడల వ్యక్తిగత, టీమ్, మిక్సిడ్ విభాగాలలో స్వర్ణపతకాలు సాధించడంతో తాము పడిన కష్టాలు తీరిపోయాయంటూ జ్యోతిసురేఖ కుటుంబ సభ్యులు సంబరపడి పోతున్నారు.

ఆసియా క్రీడల్లో అథ్లెట్లు సాధించిన ఒక్కో పతకం వెనుక సంవత్సరాల తరబడి చిందించిన స్వేదం, వారి కుటుంబసభ్యుల త్యాగం అంతాఇంతా కాదనటం ఏమాత్రం అతిశయోక్తికాదు.



First Published:  10 Oct 2023 11:00 AM IST
Next Story