Telugu Global
Sports

భారత్ తో నేడు పాక్ హాకీపోరు!

2023 ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీ లీగ్ పోరులో చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ ఢీ అంటే ఢీ అంటున్నాయి. ఈ పోటీలో భారత్ భారీవిజయానికి గురిపెట్టింది.

భారత్ తో నేడు పాక్ హాకీపోరు!
X

భారత్ తో నేడు పాక్ హాకీపోరు!

2023 ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీ లీగ్ పోరులో చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ ఢీ అంటే ఢీ అంటున్నాయి. ఈ పోటీలో భారత్ భారీవిజయానికి గురిపెట్టింది.

చెన్నైవేదికగా జరుగుతున్న ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీ గ్రూప్- ఏ లీగ్ పోరులో ప్రపంచ 4వ ర్యాంకర్ భారత్ కు 16వ ర్యాంక్ పాక్ జట్టు సవాలు విసురుతోంది.

ఇప్పటికే సెమీస్ బెర్త్ ఖాయం చేసుకొన్న భారత్ ఈ పోటీలో సైతం హాట్ ఫేవరెట్ గా పోటీకి దిగుతోంది.

ఒకప్పుడు భారత్- పాక్ హాకీజట్లు తలపడితే అదో యుద్ధంలా సాగేది. అయితే ..గత ఏడేళ్లుగా రెండుజట్ల మధ్య చెప్పలేని అంతరం ఏర్పడింది. భారతజట్టు నిలకడగా రాణిస్తూ ప్రపంచ ర్యాంకింగ్స్ 4వ స్థానంలో నిలిస్తే..పాకిస్థాన్ 16వ స్థానానికి పడిపోయింది.

ప్రస్తుతం భారత్ కు పాక్ ఏ విధంగానూ సరిజోడీ కాలేకపోతుంది. ఒకప్పుడు ఉన్నత ప్రమాణాలకు మరోపేరుగా నిలిచిన పాకిస్థాన్ ప్రస్తుతం ఆసియాలోనే నామమాత్రజట్టుగా మిగిలిపోయింది.

జూనియర్ ప్లేయర్లతో నెట్టుకొస్తున్న పాక్..

ప్రస్తుత 2023 ఆసియా చాంపియన్స్ ట్రోఫీ టోర్నీకి 14 మంది జూనియర్ ఆటగాళ్లతో పాకిస్థాన్ తరలి వచ్చింది. సీనియర్ స్థాయిలో అంతర్జాతీయమ్యాచ్ ల అనుభవం ఏమాత్రం లేని యువఆటగాళ్లతో తన అదృష్టం పరీక్షించుకొంటోంది.

ఆసియా చాంపియన్స్ ట్రోఫీ గ్రూప్- ఏ లీగ్ లో ఇప్పటి వరకూ ఆడిన మ్యాచ్ ల్లో ఆతిథ్య భారత్ అజేయంగా నిలవడం ద్వారా 10 పాయింట్లు సంపాదించింది. చైనాను 7-2 గోల్స్ తో ఓడించిన భారత్ ను రెండోరౌండ్లో జపాన్ 1-1తో నిలువరించింది. అయితే మూడోరౌండ్ మ్యాచ్ లో మలేసియాను భారత్ 5-0 గోల్స్ తో చిత్తుచేసింది, నాలుగోరౌండ్ పోరులో కొరియాపైన సైతం భారత్ 3-2 గోల్స్ విజయం నమోదు చేసింది. మూడు విజయాలు, ఓ డ్రా రికార్డుతో ఉన్న భారత్..ఈ రోజు పాక్ పైన సైతం నెగ్గితే..గ్రూప్ టాపర్ గా నిలువగలుగుతుంది.

మరోవైపు పాక్ జట్టు 5 పాయింట్లతో గ్రూపు 4వ స్థానంలో కొనసాగుతోంది. పాక్ జట్టు సెమీఫైనల్స్ చేరాలంటే భారత్ తో జరిగే పోటీలో నెగ్గటమే లేక మ్యాచ్ ను డ్రాగా ముగించడమో చేసి తీరాలి.

మ్యాచ్ కు ముందే చేతులెత్తేసిన పాక్ కోచ్...

భారత్- పాక్ జట్ల పోటీ ప్రారంభానికి ముందే పాక్ చీఫ్ కోచ్ మహ్మద్ సక్లెయిన్ చేతులెత్తేశాడు. భారత్ కు తమజట్టు ఏ విభాగంలోనూ సరిజోడీ కాదని, తమకంటే ఎన్నోరెట్లు బలమైన భారత్ కు తమజట్టు గట్టిపోటీ ఇవ్వటానికి ప్రయత్నిస్తుందని చెన్నైలో జరిగిన మీడియా సమావేశంలో ప్రకటించాడు.

తమజట్టులో 14మంది జూనియర్ ప్లేయర్లు ఉన్నారని, అనుభవం కోసమే ఎక్కువమంది జూనియర్లతో కూడిన జట్టుతో పోటీకి దిగుతున్నట్లు తెలిపాడు. 2016 శాఫ్ గేమ్స్ లో చివరిసారిగా భారత్ పై పాకిస్థాన్ విజయం సాధించింది. ఆ తర్వాత నుంచి భారత్ ఆధిపత్యమే కొనసాగుతోంది.

భారత్ 12- పాక్ 1

2016 శాఫ్ గేమ్స్ నుంచి భారత్- పాక్ జట్లు 15సార్లు తలపడితే భారత్ 12 విజయాలు, పాకిస్థాన్ ఒకే ఒక్క విజయమూ సాధించాయి. మరో రెండుమ్యాచ్ లు డ్రాగా ముగిశాయి.

ఢాకా వేదికగా జరిగిన 2022 ఆసియాకప్ హాకీ పోరులో ఈ రెండుజట్లూ చివరిసారిగా తలపడిన సమయంలో 1-1తో మ్యాచ్ ను డ్రాగా ముగించగలిగాయి.

అయితే..మొత్తం మీద భారత్- పాక్ జట్ల ఫేస్ టు ఫేస్ రికార్డులు చూస్తే పాక్ దే పైచేయిగా ఉంది.

ఈ రెండుజట్లూ ఇప్పటి వరకూ 178సార్లు తలపడితే పాకిస్థాన్ 82 విజయాలు, భారత్ 64 విజయాలు నమోదు చేశాయి. మరో 32 మ్యాచ్ లు డ్రాగా ముగిశాయి.

ప్రస్తుత టోర్నీలో ఓ గెలుపు, రెండు డ్రా ఫలితాలతో నిలిచిన పాక్ జట్టు..పవర్ ఫుల్ భారత్ ను ఓడించగలిగితేనే సెమీస్ అవకాశాలను సజీవంగా నిలుపుకోగలుగుతుంది.

చెన్నైలోని మేయర్ రాధాకృష్ణన్ స్టేడియం వేదికగా ఈపోరు సాయంత్రం జరుగనుంది.

First Published:  9 Aug 2023 2:35 PM IST
Next Story