Telugu Global
Sports

ఒక్క నిముషంలో 2 గోల్స్..ఆసియా హాకీ ఫైనల్లో భారత్ సంచలనం!

ఆసియా హాకీలో భారత్ జైత్రయాత్ర కొనసాగుతోంది. నాలుగోసారి చాంపియన్స్ ట్రోఫీ టైటిల్ నెగ్గడం ద్వారా అత్యుత్తమజట్టుగా భారత్ అవతరించింది..

ఒక్క నిముషంలో 2 గోల్స్..ఆసియా హాకీ ఫైనల్లో భారత్ సంచలనం!
X

ఆసియా హాకీలో భారత్ జైత్రయాత్ర కొనసాగుతోంది. నాలుగోసారి చాంపియన్స్ ట్రోఫీ టైటిల్ నెగ్గడం ద్వారా అత్యుత్తమజట్టుగా భారత్ అవతరించింది..

2023 ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నీలో ప్రపంచ 4వ ర్యాంకర్ భారత్ కు ఎదురేలేకుండా పోయింది. గ్రూప్ లీగ్ దశ నుంచి టైటిల్ పోరు వరకూ భారత్ విజయపరంపర కొనసాగింది.

చెన్నైలోని మేయర్ రాధాకృష్ణన్ స్టేడియం వేదికగా గత రెండువారాలుగా సాగిన ఈ పోరులో ఆసియాఖండంలోని పది అత్యుత్తమజట్లు తలపడ్డాయి.

ఓటమి అంచుల నుంచి బయటపడి.....

ఐదుజట్ల గ్రూప్ -ఏ లీగ్ లో చైనా, పాకిస్థాన్,మలేసియా, కొరియా జట్లను చిత్తు చేసిన భారత్..సెమీస్ పోరులో జపాన్ ను సైతం 5-0 గోల్స్ తోనే కంగు తినిపించి..టైటిల్ సమరానికి అర్హత సాధించింది.

నువ్వానేనా అన్నట్లుగా సాగిన ఫైనల్లో మలేసియాను 4-3 గోల్స్ తో అధిగమించడం ద్వారా భారత్ సంచలన విజయం సాధించింది. గ్రూప్ లీగ్ దశలో 5-0 గోల్స్ తో మలేసియాను అలవోకగా ఓడించిన భారత్ టైటిల్ ఫైట్ లో మాత్రం అనూహ్యమైన రీతిలో గట్టిపోటీ ఎదురయ్యింది.

మలేసియా కంటే రెండుగోల్స్ తో వెనుకబడిన భారత్ ఆ తర్వాత గొప్పపోరాటమే చేసింది. ఆట ముగిసే క్షణాలలో ఆకాశ్ దీప్ సింగ్ సాధించిన మెరుపు గోల్ తో భారత్ 4-3 గోల్స్ తో విజేతగా నిలిచింది.

నాలుగో టైటిల్ తో భారత్ రికార్డు...

భారీఅంచనాల నడుమ ప్రారంభమైన ఫైనల్లో ఆట మొదటి క్వార్టర్ 9వ నిముషంలోనే జుగ్ రాజ్ సింగ్ భారత్ కు తొలి గోలు అందించాడు. అయితే రెండో క్వార్టర్ లో మలేసియా పుంజుకొని ఆడి వెంట వెంటనే మూడుగోల్స్ సాధించడం ద్వారా 3-1తో పైచేయి సాధించింది.

మొదటి క్వార్టర్ ముగిసే క్షణాలలో అబు కమల్ అజరాయ్, 18వ నిముషంలో రజీ రహీం, 28వ నిముషంలో మహ్మద్ అమనుద్దీన్ గోల్స్ సాధించడం ద్వారా మలేసియా మెరుపువేగంతో మూడు గోల్స్ సాధించడం ద్వారా భారత్ ను ఓటమి అంచులకు నెట్టింది.

ఒకదశలో 1-3 గోల్స్ తో వెనుకబడి భారత్ తేరుకోడం కష్టమనే అందరూ భావించారు. అయితే ఆట 45వ నిముషంలో కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్, గుర్జంత్ సింగ్ చెరో గోలు..56వ నిముషంలో ఆకాశదీప్ సింగ్ మ్యాచ్ విన్నింగ్ గోలు సాధించడంతో భారత్ నాలుగోసారి ట్రోఫీని అందుకోగలిగింది.

ఆసియా చాంపియన్స్ ట్రోఫీ టోర్నీ చరిత్రలో భారత్ 2018 నాటికే మూడుసార్లు విజేతగా నిలిచింది. 2011, 2016లో చాంపియన్స్ ట్రోఫీ విన్నర్ గా నిలిచిన భారత్ 2018 పాకిస్థాన్ తో కలసి సంయుక్త విజేతగా నిలిచింది.

2021 చాంపియన్స్ ట్రోఫీ టోర్నీలో సెమీస్ దశలోనే జపాన్ చేతిలో ఓటమి పొందిన భారత్ కాంస్య పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఐదేళ్ల విరామం తర్వాత తిరిగే విజేతగా నిలువగలిగింది.

ఆసియా చాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో నాలుగుసార్లు విజేతగా నిలిచిన ఏకైకజట్టుగా భారత్ సరికొత్త రికార్డు నెలకొల్పింది.

First Published:  13 Aug 2023 11:00 AM IST
Next Story