Telugu Global
Sports

శతృత్వం హుష్ కాకి..ఇండో- పాక్ బ్రో..బ్రో!

చిరకాల ప్రత్యర్థులు భారత్- పాక్ జట్ల నడుమ జరిగిన ఆసియాకప్ లీగ్ మ్యాచ్ శతృత్వానికి, ద్వేషభావాలకు పాతరేసి..క్రికెట్ స్ఫూర్తికి తెరతీసింది....

శతృత్వం హుష్ కాకి..ఇండో- పాక్ బ్రో..బ్రో!
X

చిరకాల ప్రత్యర్థులు భారత్- పాక్ జట్ల నడుమ జరిగిన ఆసియాకప్ లీగ్ మ్యాచ్ శతృత్వానికి, ద్వేషభావాలకు పాతరేసి..క్రికెట్ స్ఫూర్తికి తెరతీసింది....

భారత్- పాకిస్థాన్ జట్లు క్రికెట్ ఫీల్డ్ లో తలపడుతున్నాయంటే చాలు..మీడియా, ప్రధానంగా రేటింగ్ కోసం నానాయాగీ చేసే ఎలక్ట్ర్రానిక్ మీడియా చేసే హంగామా అంతాఇంతాకాదు. లేనిపోని శతృత్వాన్ని అంటగట్టి రెండుజట్ల నడుమ ఓ యుద్ధమే జరుగుతున్నట్లుగా చిత్రించడం గత కొద్దిసంవత్సరాలుగా జరుగుతున్న తంతు.

అయితే..2023 ఆసియాకప్ వన్డే టోర్నీ గ్రూప్ -ఏ లీగ్ లో భాగంగా ఈ రెండుజట్ల నడుమ జరిగిన మ్యాచ్ సరికొత్త చరిత్రకు తెరతీసింది.

క్రికెట్ స్ఫూర్తితో సాగిన మ్యాచ్...

ఆసియాకప్ గ్రూప్ - ఏ లీగ్ లో భారత్ తన ప్రారంభమ్యాచ్ లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో తలపడాల్సి రావడంతోనే గత కొద్దిరోజులుగా మీడియా హాటు హాటు కథనాలతో రెండుజట్ల నడుమ పెద్దయుద్ధమే జరుగబోతున్నట్లుగా చిత్రీకరించింది. అయితే..శ్రీలంకలోని పల్లెకెలీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా సాగిన ఈమ్యాచ్ వానదెబ్బతో సగంలోనే రద్దయినా..క్రికెట్ స్ఫూర్తికి అద్దం పట్టింది. రెండుజట్ల ఆటగాళ్లు..ఆటను ఆటగానే చూడాలని గ్రౌండ్ వెలుపల స్నేహభావం ఉండాలని చాటి చెప్పారు.

భారత్ కు బ్యాటింగ్, పాక్ కు బౌలింగ్ ప్రాక్టీసు...

భారీఅంచనాల నడుమ టాప్ ర్యాంకర్ పాక్, 3వ ర్యాంకర్ భారతజట్ల నడుమ జరిగిన ఈమ్యాచ్ 50 ఓవర్లకే..అదీ కేవలం భారత్ బ్యాటింగ్ కు, పాక్ బౌలింగ్ కే పరిమితమై..

ఆ తర్వాత భారీవర్షంతో రద్దులపద్దులో చేరిపోయింది.

భారత ఉపఖండ దేశాలలోని అభిమానులంతా ఎక్కడలేని ఆసక్తితో ఎదురుచూసిన ఈమ్యాచ్ లో టాస్ నెగ్గి ముందుగా బ్యాటింగ్ ఎంచుకొన్న భారత్ 48. 5 ఓవర్లలో 266 పరుగుల స్కోరుకే ఆలౌటయ్యింది.

పాక్ ఓపెనింగ్ బౌలర్ షాహీన్ ఆఫ్రిదీ, ఫాస్ట్ బౌలర్ హారిస్ రవూఫ్ కొట్టిన దెబ్బతో 27 పరుగులకే ఓపెనర్ కమ్ కెప్టెన్ రోహిత్ శర్మ, వన్ డౌన్ విరాట్ కొహ్లీ, 66 పరుగులకే 4 వికెట్లు ( రోహిత్, విరాట్, అయ్యర్, శుభ్ మన్ గిల్) కోల్పోయి పీకలోతు కష్టాలలో కూరుకుపోయింది.

ఇషాన్- హార్థిక్ పోరాటం...

భారత్ పీకలోతు కష్టాలలో కూరుకుపోయిన దశలో క్రీజులోకి వచ్చిన వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్, వైస్ కెప్టెన్ హార్థిక్ పాండ్యా 5వ వికెట్ కు 138 పరుగుల భాగస్వామ్యంతో ఊపిరిపోశారు. నిప్పులు చెరుగుతున్న పాక్ ఫాస్ట్ బౌలర్లను నిలువరించి స్పిన్నర్ల భరతం పట్టారు.

ఇషాన్ కిషన్ 82 పరుగులు, హార్థిక్ పాండ్యా 87 పరుగులతో ఫైటింగ్ హాఫ్ సెంచరీలు సాధించడంతో భారత్ 266 పరుగుల గౌరవప్రదమైన స్కోరు సాధించగలిగింది. భారత్ తన చివరి 5 వికెట్లను కేవలం 27 పరుగుల తేడాతో నష్టపోయింది.

ఆసియాకప్ లో పాక్ అరుదైన రికార్డు..

వన్డేలలో ప్రపంచ నంబర్ వన్ జట్టు పాకిస్థాన్..ఆసియాకప్ లో సరికొత్త చరిత్ర సృష్టించింది. మొత్తం 10 వికెట్లు ఫాస్ట్ బౌలర్ల ద్వారా సాధించిన ఏకైకజట్టుగా నిలిచింది.

పాక్ ఫాస్ట్ బౌలర్ల త్రయం షాహీన్ ఆఫ్రిదీ (4 ), హారిస్ రవూఫ్ (3), నసీమ్ షా ( 3) సాధించారు. పాక్ జట్టు తరపున స్పిన్ బౌలింగ్ కు దిగిన ముగ్గురిలో ఒక్కరూ వికెట్ పడగొట్టలేకపోయారు.

వర్షంతో తరచూ అంతరాయం ఏర్పడిన ఈమ్యాచ్ లో భారత ఇన్నింగ్స్ ముగిసిన తరువాత నుంచి కుండపోతగా వర్షం పడడంతో మ్యాచ్ ను రద్దు చేసి రెండు జట్లకూ చెరో పాయింట్ ఇచ్చినట్లు మ్యాచ్ రిఫరీ ప్రకటించారు.

దీంతో గ్రూప్- ఏ లీగ్ లో రెండుకు రెండుమ్యాచ్ లు ఆడి 3 పాయింట్లు సాధించడం ద్వారా పాకిస్థాన్ సూపర్ -4 రౌండ్లో తన స్థానం ఖాయం చేసుకోగలిగింది.

పసికూన నేపాల్ తో ఈనెల 4న జరిగే తన ఆఖరి గ్రూప్ లీగ్ పోరులో భారత్ విజయం సాధించగలిగితేనే సూపర్ -4 రౌండ్ చేరుకోగలుగుతుంది.

పాక్ పేసర్ చేతిలో భారత స్టార్ జోడీ విలవిల...

భారత కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కొహ్లీలకు మరోసారి పాక్ ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్ షాహీన్ ఆఫ్రిదీ షాకిచ్చాడు. భారత కెప్టెన్ రోహిత్ , మాజీ కెప్టెన్ విరాట్ కొహ్లీ ఇద్దరినీ బౌల్డ్ చేయడం ద్వారా పెవీలియన్ దారి పట్టించాడు.

2021 సీజన్ నుంచి లెఫ్టామ్ పేసర్లను ఎదుర్కొన్న సమయంలో రోహిత్ సగటు 25.8కి మాత్రమే పరిమితమయ్యింది. షాహీన్ ఆఫ్రిదీ ఇన్ స్వింగర్లకు దొరికిపోడం రోహిత్ కు అది 5వసారి కాగా..విరాట్ కు మూడోసారి. ప్రస్తుత మ్యాచ్ లో రోహిత్ 11 పరుగుల స్కోరుకు అవుట్ కాగా..విరాట్ సింగిల్ డిజిట్ స్కోరుకే అవుటయ్యాడు.

మ్యాచ్ జరిగే సమయంలో మాత్రమే కాదు..ముగిసిన తర్వాత రెండుజట్ల ఆటగాళ్లు హుందాగా, సోదరభావంతో వ్యవహరించారు.

భారత వైస్ కెప్టెన్ హార్థిక్ పాండ్యా బూటు లేసులను పాక్ వైస్ కెప్టెన్ షదాబ్ ఖాన్ కట్టి తన క్రీడాస్ఫూర్తిని చాటుకొంటే..మ్యాచ్ ముగిసిన తర్వాత డ్రెస్సింగ్ రూమ్ స్టాండ్స్ వద్ద..రెండుజట్ల ఆటగాళ్లు పరస్పరం అభినందించుకోడం ద్వారా క్రికెట్ స్ఫూర్తిని ఎవరెస్టు ఎత్తులో నిలబెట్టగలిగారు.

భారత్ బ్యాటింగ్, పాకిస్థాన్ కు బౌలింగ్ ప్రాక్టీసుగా మిగిలిపోయిన ఈమ్యాచ్ లో అసలు విజేత వరుణదేవుడు మాత్రమే.



First Published:  3 Sept 2023 12:28 PM GMT
Next Story