Telugu Global
Sports

శ్రీలంకతో నేడే భారత్ డూ ఆర్ డై ఫైట్!

ఆసియాకప్ సూపర్ -4 రౌండ్లో భారత్ చావోబతుకో సమరానికి సిద్ధమయ్యింది. ఫైనల్ చేరాలంటే నెగ్గితీరాల్సిన పోటీలో ఈ రోజు మాజీ చాంపియన్ శ్రీలంకతో అమీతుమీ తేల్చుకోనుంది...

శ్రీలంకతో నేడే భారత్ డూ ఆర్ డై ఫైట్!
X

ఆసియాకప్ సూపర్ -4 రౌండ్లో భారత్ చావోబతుకో సమరానికి సిద్ధమయ్యింది. ఫైనల్ చేరాలంటే నెగ్గితీరాల్సిన పోటీలో ఈ రోజు మాజీ చాంపియన్ శ్రీలంకతో అమీతుమీ తేల్చుకోనుంది...

ఆసియాకప్ సూపర్ -4 రౌండ్ హాట్ హాట్ గా సాగుతోంది. లీగ్ దశలో వరుస విజయాలతో గ్రూప్ టాపర్లుగా నిలిచిన ఆప్ఘనిస్థాన్, భారత్ జట్లకు సూపర్ -4 తొలిరౌండ్ పోటీలలో చుక్కెదురు కావడంతో సమరం రసవత్తరంగా మారింది.

నాలుగుజట్ల సూపర్ -2 రౌండ్లో అత్యధిక విజయాలతో మొదటి రెండుస్థానాలలో నిలిచిన జట్లకు మాత్రమే ఫైనల్స్ చేరే అవకాశం ఉండడంతో..కనీసం రెండుమ్యాచ్ లు నెగ్గితీరాల్సిన పరిస్థితి ఏర్పడింది.

రోహిత్ సేనకు చావోబతుకో!

సూపర్ -4 తొలిరౌండ్ పోరులో తుదివరకూ పోరాడి 5 వికెట్ల ఓటమి చవిచూసిన భారత్ కు మిగిలిన రెండుమ్యాచ్ లు చావోబతుకో అన్నట్లుగా తయారయ్యాయి. ఫైనల్స్ ఆశలు సజీవంగా నిలుపుకోవాలంటే మిగిలిన రెండురౌండ్లలో శ్రీలంక, ఆప్ఘనిస్థాన్ జట్లను డిఫెండింగ్ చాంపియన్ భారత్..ఆరునూరైనా ఓడించితీరాల్సి ఉంది.

తొలిరౌండ్ పోరులో ఆప్ఘనిస్థాన్ ను కంగుతినిపించిన ఆత్మవిశ్వాసంతో శ్రీలంకజట్టు భారత్ తో పోరుకు సిద్ధమయ్యింది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఈరోజు

రాత్రి 7-30 గంటలకు ప్రారంభమయ్యే పోరులో శ్రీలంకపై విజయమే లక్ష్యంగా భారత్ బరిలోకి దిగనుంది.

తుదిజట్టులో పలుమార్పులు?

పాకిస్థాన్ తో ముగిసిన కీలకపోరులో భారత తురుపుముక్క యుజువేంద్ర చహాల్, ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా, యువపేసర్ అర్షదీప్ సింగ్, సూపర్ హిట్టర్ రిషభ్ పంత్ దారుణంగా విఫలమయ్యారు. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ విభాగాలలో పాండ్యా, పంత్, చహాల్, అర్షదీప్ స్థాయికి తగ్గట్టుగా రాణించలేకపోడంతో భారత్ భారీమూల్యమే చెల్లించాల్సి వచ్చింది. దీంతో టీమ్ మేనేజ్ మెంట్ తుదిజట్టులో ఒకటి లేదా రెండు మార్పులు చేపట్టనుంది.

పంత్, చహాల్ లను తప్పించి దినేశ్ కార్తీక్, అశ్విన్, అక్షర్ పటేల్ లలో ఇద్దరికి తుదిజట్టులో చోటు కల్పించనుంది. శ్రీలంకజట్టులో పలువురు ఎడమచేతి వాటం బ్యాట్స్ మన్ ఉండడంతో సీనియర్ స్పిన్నర్ అశ్విన్ వైపు మొగ్గు చూపే అవకాశం లేకపోలేదు. శ్రీలంక ప్రత్యర్థిగా ఆడిన 9 మ్యాచ్ ల్లో అశ్విన్ కు 13 వికెట్లు పడగొట్టిన రికార్డు సైతం ఉంది.

ఓపెనింగ్ జోడీ రోహిత్- రాహుల్, వన్ డౌన్ విరాట్, సూర్యకుమార్ యాదవ్ తో సహా భారత టాపార్డర్ సూపర్ ఫామ్ లోకి రావడంతో భారత బ్యాటింగ్ భీకరంగా కనిపిస్తోంది.

బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాలలో మాత్రమే భారత్ లోపాలను సరిదిద్దుకోవాల్సి ఉంది.

చేజింగ్ జట్టుకే విజయావకాశాలు..

దుబాయ్ వేదికగా జరిగిన గత మూడుమ్యాచ్ ల్లో 170 స్కోర్లు మాత్రమే నమోదయ్యాయి. చేజింగ్ కు దిగిన జట్లే విజేతలుగా నిలవడంతో...టాస్ నెగ్గిన జట్టు ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోడం ద్వారా చేజింగ్ కు దిగడం ఖాయంగా కనిపిస్తోంది. అంతేకాదు..శ్రీలంకజట్టు ముందుగా బ్యాటింగ్ కు దిగిన గత ఏడుమ్యాచ్ ల్లో పరాజయాలు చవిచూడటం విశేషం. చేజింగ్ కు దిగిన నాలుగుకు నాలుగుసార్లు విజేతగా నిలిచింది.

దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన గత 27 టీ-20 మ్యాచ్ ల్లో చేజింగ్ కు దిగిన జట్లే 24సార్లు విజయాన్ని అందుకోగలిగాయి.

ఇక శ్రీలంక ప్రత్యర్థిగా భారత్ ఆడిన మొత్తం 25 టీ-20 మ్యాచ్ ల్లో 17 విజయాలు, 7 పరాజయాల రికార్డుతో ఉంది. 2016 ఆసియాకప్ లో భాగంగా శ్రీలంకతో చివరిసారిగా తలపడిన భారత్ 5 వికెట్ల విజయం నమోదు చేసింది. ఆ తరువాత ఈ రెండుజట్లూ ఆసియాకప్ టోర్నీలో తొలిసారి ఢీ కొనబోతున్నాయి.

ఈ రోజు రాత్రి 7-30 గంటలకు ప్రారంభమయ్యే ఈపోరు రెండుజట్లకూ డూ ఆర్ డైగా మారింది.

First Published:  6 Sept 2022 9:56 AM IST
Next Story