ఆసియాకప్ ఫైనల్స్ నేడే- ఏడో టైటిల్ కు భారత్ గురి!
ఆసియాకప్ మహిళా టీ-20 దిగ్గజం భారత్ ఏడో టైటిల్ కు గురిపెట్టింది. సిల్హౌట్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా కొద్దిగంటల్లో ప్రారంభమయ్యే ఫైనల్లో శ్రీలంకతో అమీతుమీ తేల్చుకోనుంది.
ఆసియాకప్ మహిళా టీ-20 దిగ్గజం భారత్ ఏడో టైటిల్ కు గురిపెట్టింది. సిల్హౌట్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా కొద్దిగంటల్లో ప్రారంభమయ్యే ఫైనల్లో శ్రీలంకతో అమీతుమీ తేల్చుకోనుంది. హర్మన్ ప్రీత్ కౌర్ నాయకత్వంలోని భారతజట్టు హాట్ ఫేవరెట్ గా పోటీకి దిగుతోంది...
బంగ్లాదేశ్ వేదికగా గత రెండువారాలుగా జరుగుతున్న 2022 ఆసియాకప్ మహిళా టీ-20 టోర్నీ తుదిదశకు చేరింది. సిల్హౌట్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో ఆసియాలోని ఆరు అత్యుత్తమ జట్లు పోటీకి దిగితే...ఆరుసార్లు విజేత భారత్, మాజీ రన్నరప్ శ్రీలంక జట్లు ఫైనల్స్ కు అర్హత సంపాదించాయి.
హాట్ ఫేవరెట్ గా భారత్....
ఆసియాకప్ మహిళా టీ-20 చరిత్రలోనే అత్యధికంగా ఆరుసార్లు టైటిల్ నెగ్గిన భారత్ కు...ఎనిమిదికి ఎనిమిదిసార్లూ ఫైనల్స్ చేరిన తిరుగులేని రికార్డు ఉంది. 2004లో ప్రారంభమైన ఈ టోర్నీని ప్రారంభంలో 50 ఓవర్ల వన్డే టోర్నీలుగా నిర్వహించారు. గత నాలుగు టోర్నీలను మాత్రం టీ-20 ఓవర్ల ఫార్మాట్లో నిర్వహిస్తూ వస్తున్నారు.
2004 నుంచి 2016 ఆసియాకప్ టోర్నీల వరకూ తిరుగులేని విజయాలతో, వరుసగా ఆరు టైటిల్స్ తో డబుల్ హ్యాట్రిక్ నమోదు చేసిన భారత్ కు..2018 టోర్నీలో మాత్రం ఎదురుదెబ్బ తగిలింది.
మలేసియా వేదికగా జరిగిన 2018 ఆసియాకప్ ఫైనల్లో భారత్ 3 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ చేతిలో ఓటమి చవిచూసింది.
2022 టోర్నీలో భారత్ టాప్ గేర్...
ప్రస్తుత ఆసియాకప్ లో ఎక్కువమంది యువక్రికెటర్లతో కూడిన జట్టుతో బరిలో నిలిచిన భారత్ రౌండ్ రాబిన్ లీగ్ దశలో పాక్ చేతిలో ఓటమి పొందినా..మిగిలిన పోటీలలో ( శ్రీలంక, బంగ్లాదేశ్, థాయ్ లాండ్, మలేసియా, ఎమిరేట్స్ ) విజయాలు సాధించడం ద్వారా టేబుల్ టాపర్ గా సెమీస్ లో అడుగుపెట్టింది.
తొలిసెమీఫైనల్లో థాయ్ లాండ్ పై భారత్ భారీవిజయం సాధిస్తే...రెండో సెమీఫైనల్లో పాక్ పై శ్రీలంక ఒక్క పరుగు తేడాతో సంచలన విజయం నమోదు చేసింది.
హర్మన్ ప్రీత్ కౌర్, స్మృతి మందన, దీప్తి శర్మ, రాజేశ్వరీ గయక్వాడ్, షెఫాలీవర్మ, జెమీమా రోడ్రిగేజ్, మేఘన రెడ్డి, స్నేహ రాణా, రేణుకా సింగ్ లాంటి మేటి ప్లేయర్లతో అత్యంత పటిష్టంగా కనిపిస్తోంది.
మరోవైపు చమరి అటపట్టు లాంటి సూపర్ హిట్టర్ తమజట్టులో ఉన్నా శ్రీలంక నిలకడలేమితో సతమతమవుతోంది. స్పిన్ బౌలర్ల అడ్డాగా మారిన సిల్హౌట్ స్టేడియంలో జరిగే ఈ టైటిల్ సమరంలో భారత్ టైటిల్ నెగ్గడానికే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మితిమీరిన ఆత్మవిశ్వాసంతో ఆడితే మాత్రం భారత్ కు శ్రీలంక నుంచి గట్టి ప్రమాదమే పొంచి ఉంది.