Telugu Global
Sports

ఆసియా బాలికల హాకీలో భారత్ భళా!

ఆసియా జూనియర్ బాలికల హాకీ టైటిల్ ను భారత్ తొలిసారిగా గెలుచుకొంది.

ఆసియా బాలికల హాకీలో భారత్ భళా!
X

ఆసియా బాలికల హాకీలో భారత్ భళా!

ఆసియా జూనియర్ బాలికల హాకీ టైటిల్ ను భారత్ తొలిసారిగా గెలుచుకొంది. టైటిల్ సమరంలో నాలుగుసార్లు విజేత దక్షిణకొరియాపై భారత్ సంచలన విజయం సాధించింది...

ఆసియా జూనియర్ హాకీ బాలుర, బాలికల విభాగాలలో భారత్ ఆధిపత్యం కొనసాగుతోంది. కొద్దిరోజుల క్రితమే ఒమాన్ వేదికగా ముగిసిన ఆసియా జూనియర్ హాకీ టోర్నీలో

భారత బాలురజట్టు విజేతగా నిలిస్తే..భారత బాలికల జట్టు సైతం అదే ఘనతను సాధించడం ద్వారా వారేవ్వా! అనిపించుకొంది.

తొలిసారిగా భారత్ కు టైటిల్..

జపాన్ లోని కాకామిగాహరా వేదికగా జరిగిన 2023 ఆసియా జూనియర్ బాలికల హాకీ టోర్నీలో నాలుగుసార్లు విజేత దక్షిణ కొరియాతో సహా ప్రముఖ జట్లన్నీ టైటిల్ వేటకు దిగాయి.

చివరకు లీగ్ దశలో అత్యుత్తమంగా రాణించిన కొరియా, భారతజట్లే టైటిల్ పోరుకు అర్హత సంపాదించగలిగాయి. హోరాహోరీగా సాగిన ఈ టైటిల్ పోరులో భారతజట్టు 2-1 గోల్స్ తో హాట్ ఫేవరెట్ దక్షిణ కొరియాపైన సంచలన విజయం సాధించడం ద్వారా తొలిసారిగా టైటిల్ అందుకొంది.

కొరియా, చైనాజట్ల ఆధిపత్యంతో కొనసాగుతున్న ఆసియాజూనియర్ బాలికల విభాగంలో భారత్ విజేతగా నిలవడం ఇదే మొదటిసారి. పవర్ ఫుల్ దక్షిణ కొరియాతో జరిగిన ఈ ఆఖరి పోరాటం మొదటి క్వార్టర్ లో ఏ జట్టూ గోలు చేయలేకపోయింది.

ఆట రెండోక్వార్టర్ 22వ నిముషంలో పెనాల్టీకార్నర్ ద్వారా భారత్ కు అన్ను తొలిగోలు సంపాదించి పెట్టింది. ఆ తర్వాత మూడు నిముషాల విరామం లోనే దక్షిణ కొరియా తరపున పార్క్ సియో యాన్ ఫీల్డ్ గోల్ తో స్కోరును 1-1తో సమం చేయగలిగింది.

41వ నిముషంలో భారత్ రెండోగోలు...

ఆట 41వ నిముషంలో భారత్ కు నీలమ్ రెండో గోలు అందించడంతో ఆధిక్యం 2-1కి పెరిగింది. ఆ తర్వాత నుంచి కొరియా ఈక్వలైజర్ గోలు కోసం పారాడటం, భారత్ ఆత్మరక్షణ వ్యూహంతో అడ్డుకోడం జరిగిపోయాయి. మూడు,న నాలుగు క్వార్టర్లలో భారత్ పటిష్టమైన డిఫెన్స్ తో 2-1 ఆధిక్యాన్ని కాపాడుకోటం ద్వారా ఆసియా చాంపియన్ గా అవతరించింది.

భారత్ తో పోల్చుకొంటే దక్షిణ కొరియాకు పలుమార్లు పెనాల్టీకార్నర్లు లభించినా గోల్సుగా మలచుకోడంలో విఫలమయ్యింది.

2021 ఆసియాకప్ టోర్నీలో భారత్ తొలిసారిగా ఫైనల్స్ చేరినా..టైటిల్ సమరంలో 2-5తో చైనా చేతిలో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. అయితే ఆలోటును 2023 ఆసియాకప్ ద్వారా తీర్చుకోగలిగింది.

తలో 2 లక్షల నజరానా!

ఆసియా జూనియర్ బాలికల హాకీ టైటిల్ ను తొలిసారిగా సాధించిన భారతజట్టు సభ్యులకు హాకీ ఇండియా ప్రోత్సాహక నగదుబహుమతిని ప్రకటించింది. జట్టులోని ప్లేయర్లందరికీ 2 లక్షల రూపాయల చొప్పున, సహాయక సిబ్బందికి లక్ష రూపాయల చొప్పున నజరానాగా ఇవ్వనున్నట్లు తెలిపింది.

2023 ఆసియా జూనియర్ బాలుర, బాలికల విభాగాలలో భారతజట్లే విజేతగా నిలవడం ఇదే మొదటిసారి.

First Published:  12 Jun 2023 9:00 AM IST
Next Story