ఆసియాకప్ లో భారత్ తో నేడు హాంకాంగ్ ఢీ!
ఆసియాకప్ గ్రూప్ -ఏ లీగ్ లో వరుసగా రెండో విజయానికి ఢిపెండింగ్ చాంపియన్ భారత్ ఉరకలేస్తోంది. టీ-20 క్రికెట్ పసికూన హాంకాంగ్ పనిపట్టడానికి భారత్ సిద్ధమయ్యింది.
ఆసియాకప్ గ్రూప్ -ఏ లీగ్ లో వరుసగా రెండో విజయానికి ఢిపెండింగ్ చాంపియన్ భారత్ ఉరకలేస్తోంది. టీ-20 క్రికెట్ పసికూన హాంకాంగ్ పనిపట్టడానికి భారత్ సిద్ధమయ్యింది.
ఆసియాకప్ -2022 టోర్నీ గ్రూప్ -ఏ లీగ్ లో బ్యాక్ టు బ్యాక్ విజయాలకు భారత్ సిద్ధమయ్యింది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా రాత్రి 7-30 గంటలకు ప్రారంభమయ్యే రెండో లీగ్ పోరులో పసికూన హాంకాంగ్ ను చిత్తు చేయటానికి రోహిత్ సేన ఉరకలేస్తోంది.
గ్రూప్ ప్రారంభమ్యాచ్ లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో ముగిసిన హోరాహోరీ సమరంలో భారత్ 5 వికెట్ల తేడాతో కీలక విజయం నమోదు చేసింది. వరుసగా రెండోగెలుపుతో గ్రూప్ టాపర్ గా సూపర్-4 రౌండ్ కు చేరుకోవాలన్న పట్టుదలతో ఉంది.
కొండను ఢీ కొంటున్న పసికూన!
అంతర్జాతీయ క్రికెట్లో అపారఅనుభవం ఉన్న మాజీ చాంపియన్ భారత్ ను పసికూన హాంకాంగ్ తొలిసారిగా ఢీ కొంటోంది. ఆసియాకప్ అర్హత పోటీలలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ను అధిగమించడం ద్వారా హాంకాంగ్ తొలిసారిగా ఫైనల్ రౌండ్లో చోటు సంపాదించింది.
భారత్, పాక్ సంతతి ఆటగాళ్లతో నిండిన హాంకాంగ్ కు నిజఖత్ ఖాన్ సారథ్యం వహిస్తున్నాడు. 2008, 2018 ఆసియాకప్ టోర్నీలలో భాగంగా హాంకాంగ్ ప్రత్యర్థిగా రెండుసార్లు తలపడిన భారత్ రెండుకు రెండు విజయాలతో అజేయంగా నిలిచింది.
రిషభ్ పంత్, అశ్విన్ లకు చోటు?
పాక్ తో జరిగిన ప్రారంభమ్యాచ్ లో పాల్గొన్న తుదిజట్టులో భారత్ ఒకటి లేదా రెండుమార్పులు చేసే అవకాశాలు లేకపోలేదు. వెటరన్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ స్థానంలో
ప్రధాన వికెట్ కీపర్ రిషభ్ పంత్, ఆఫ్ స్పిన్ ఆల్ రౌండల్ రవిచంద్రన్ అశ్విన్ లకు ప్రధానజట్టులో చోటు కల్పించే అవకాశం ఉంది.
తొలిమ్యాచ్ లో తాను ఎదుర్కొన్న తొలిబంతికే అవుటైన రాహుల్, 12 పరుగులు మాత్రమే సాధించిన కెప్టెన్ రోహిత్ తో పాటు 35 పరుగుల స్కోరుతో గాడిలో పడ్డట్లే కనిపించిన విరాట్ కొహ్లీ...హాంకాంగ్ తో మ్యాచ్ ద్వారా పూర్తిస్థాయి ఫామ్ ను అందుకోవాలన్న పట్టుదలతో ఉన్నారు.
అంతర్జాతీయ టీ-20ల్లో అంతగా అనుభవం లేని హాంకాంగ్ పై ముందుగా బ్యాటింగ్ కు దిగే అవకాశం వస్తే...భారత్ 180 నుంచి 200 వరకూ స్కోరు సాధించినా ఆశ్చర్యపోనక్కరలేదు.
మరోవైపు...యాసిమ్ ముర్తాజా, బాబర్ హయతే,కించిత్ షా, అయిజాజ్ ఖాన్, స్కాట్ మెకెచ్నీ, జీషన్ అలీ, హారూన్ అర్షద్, ఇహషాన్ ఖాన్, మహ్మద్ ఘజనాఫర్,ఆయుష్ శుక్లా, అతీఖ్ ఇక్బాల్, మహ్మద్ వాహీద్, వాజిద్ షా, అఫ్తాబ్ హుస్సేన్, ధనుంజయరావ్, అహాన్ త్రివేదీలతో కూడిన హాంకాంగ్ జట్టు తరపున ఆడిన గత మూడుమ్యాచ్ ల్లో మూడు హాఫ్ సెంచరీలు సాధించిన ఘనత కెప్టెన్ నిజఖత్ ఖాన్ కు మాత్రమే ఉంది.
ఏకపక్షంగా సాగనున్న ఈపోరులో భారత్ టాస్ నెగ్గితే ముందుగా బ్యాటింగ్ ఎంచుకోడానికే మొగ్గుచూపే అవకాశం ఉంది. తన ప్రధాన బ్యాటర్లకు తగిన మ్యాచ్ ప్రాక్టీస్ కావాలంటే బ్యాటింగ్ ఎంచుకొని తీరక తప్పదు.
భారత కాలమానం ప్రకారం రాత్రి 7-30 గంటలకు ఈ పోటీ ప్రారంభంకానుంది. భారత్ ధాటికి పసికూన బంగ్లాదేశ్ ఎంత వరకూ తట్టుకోగలదన్నది అనుమానమే.