Telugu Global
Sports

అశ్విన్ అలా...అక్షర్ ఇలా..భారత్ వెలవెల!

టీ-20 ప్రపంచకప్ లో భారత వైఫల్యం పై సమీక్షలు జోరుగా సాగుతున్నాయి. సెమీఫైనల్లో ఘోరపరాజయానికి స్పిన్ బౌలర్ల వైఫల్యం కూడా ఓ కారణమని పలువురు దిగ్గజాలు చెబుతున్నారు.

అశ్విన్ అలా...అక్షర్ ఇలా..భారత్ వెలవెల!
X

అశ్విన్ అలా...అక్షర్ ఇలా..భారత్ వెలవెల!

టీ-20 ప్రపంచకప్ లో భారత వైఫల్యం పై సమీక్షలు జోరుగా సాగుతున్నాయి. సెమీఫైనల్లో ఘోరపరాజయానికి స్పిన్ బౌలర్ల వైఫల్యం కూడా ఓ కారణమని పలువురు దిగ్గజాలు చెబుతున్నారు. సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి....

ఆస్ట్ర్రేలియా వేదికగా జరుగుతున్న టీ-20 ప్రపంచకప్ సెమీస్ లో భారత్ 10 వికెట్ల ఓటమితో ఇంటిదారి పట్టిందో లేదో విమర్శల తుపాను మొదలయ్యింది. ఇరుగుపొరుగు, తన..మన అన్నతేడా లేకుండా పాకిస్థాన్ బోర్డు చైర్మన్ రమీజ్ రాజా నుంచి ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ వరకూ, భారత మాజీ కెప్టెన్లు కపిల్ దేవ్ , సునీల్ గవాస్కర్ నుంచి గౌతం గంభీర్ వరకూ ఎవరికి తోచిన విధంగా వారు విమర్శలు చేస్తూ భారత కెప్టెన్ రోహిత్ శర్మ, చీఫ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ ను తూర్పారపడుతున్నారు. అంతటితో ఆగిపోకుండా భారత్ కు ఒంటిచేత్తో ఎన్నో విజయాలు అందించిన రవిచంద్రన్ అశ్విన్ ను సైతం తప్పుపడుతున్నారు.

పీసీబి చైర్మన్ రమీజ్ రాజా అక్కసు..

భారత్ ఓటమి పొందడంతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ రమీజ్ రాజా గాల్లో తేలిపోతున్నాడు. వందలకోట్ల బీసీసీఐకి చెందిన కుబేర భారతజట్టు చతికిలబడి పోయిందంటూ సెటైర్లు వేస్తున్నాడు. మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ సైతం భారత్ ఎందుకూ పనికిరాని జట్టు అంటూ ఎద్దేవా చేశాడు.

మరోవైపు...టీ-20 ఫార్మాట్ అంటేనే రిస్క్ తీసుకోడం అన్నవాస్తవాన్ని భారత శిక్షకుడు రాహుల్ ద్రావిడ్ మరచిపోయాడని, ప్రయోగాలు చేయటానికి ఏమాత్రం ఆసక్తి చూపలేదని, సెమీఫైనల్లో ఘోరవైఫల్యానికి రిస్క్ తీసుకోకపోడమే కారణమని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ వ్యాఖ్యానించాడు.

స్పిన్ జోడీ వైఫల్యం పైనా విమర్శలు..

ఆస్ట్ర్రేలియా ఫాస్ట్, బౌన్సీ పిచ్ లపైన మణికట్టుతో బౌలింగ్ మ్యాజిక్ చేసే లెగ్ స్పిన్నర్ యజువేంద్ర చహాల్ ను బెంచ్ కే పరిమితం చేసి..వెటరన్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, లెఫ్టామ్ స్పిన్నర్ అక్షర్ పటేల్ లనే నమ్ముకొని భారతజట్టు భారీగా మూల్యం చెల్లించిందంటూ పాక్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా అంటున్నాడు.

విరాట్ కొహ్లీ కెప్టెన్ గా ఉన్నంతకాలం అశ్విన్ ను వైట్ బాల్ క్రికెట్ కు దూరంగా ఉంచాడని, కేవలం టెస్టుమ్యాచ్ లకు మాత్రమే పరిమితం చేసిన వాస్తవాన్ని గుర్తుంచుకోవాలని కనేరియా చెప్పాడు.

అశ్విన్ బౌలింగ్ లో ఆ మెరుపేదీ- గవాస్కర్..

అశ్విన్ అంటేనే తన తెలివైన బౌలింగ్ తో ప్రత్యర్థి బ్యాటర్లను బోల్తా కొట్టించే మొనగాడని..అయితే ..ప్రస్తుత ప్రపంచకప్ లో అశ్విన్ బౌలింగ్ లో ఆ మెరుపు కనపడకుండా పోయిందని సునీల్ గవాస్కర్ వాపోయారు. దూకుడుగా బౌలింగ్ చేయకుండా బ్యాటర్లను అదుపు చేయటంపైనే ప్రధానంగా అశ్విన్ దృష్టి పెట్టడం భారత్ ను దెబ్బతీసిందని అన్నారు.

భారత తుదిజట్టులోకి అసలు అశ్విన్ ను ఎందుకు తీసుకొన్నారో తనకు అంతుపట్టడం లేదని భారత మాజీ కెప్టెన్, అలనాటి దిగ్గజం కపిల్ దేవ్ వ్యాఖ్యానించారు.

ఫీల్డింగ్ లో మందకొడిగా కనిపించే 35 సంవత్సరాల అశ్విన్ తో కుర్రాళ్లు ఆడే టీ-20 ప్రపంచకప్ ఆడించటం ఏంటంటూ నిలదీశారు.

మొత్తం ఆరుమ్యాచులు ఆడిన అశ్విన్ ఆరు వికెట్లు పడగొట్టడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. లెఫ్టామ్ స్పిన్నర్ అక్షర్ పటేల్ సైతం ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాడంటూ మండి పడ్డారు,

బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాలలో నాసిరకంగా ఉన్న భారతజట్టు ప్రపంచకప్ ఫైనల్ చేరాలని, టైటిల్ విజేతగా నిలవాలని కోరుకోడం అత్యాశేఅవుతుందని మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ చెప్పుకొచ్చాడు.

ఏది ఏమైనా...విమర్శకులు, విశ్లేషకులు, విదేశీ మాజీ క్రికెటర్లు సైతం దొరికిందే చాన్స్ అన్నట్లుగా భారత్ ను తమ విమర్శలతో టీ-20 క్రికెట్ ఆడేస్తున్నారనడంలో ఏమాత్రం సందేహంలేదు.

First Published:  12 Nov 2022 10:01 AM IST
Next Story