Telugu Global
Sports

బుమ్రాను మించిన అర్షదీప్ సింగ్!

టీ-20 క్రికెట్లో అత్యంత వేగంగా 50 వికెట్లు పడగొట్టిన భారత పేస్ బౌలర్ ఘనతను అర్షదీప్ సింగ్ సొంతం చేసుకొన్నాడు.

బుమ్రాను మించిన అర్షదీప్ సింగ్!
X

బుమ్రాను మించిన అర్షదీప్ సింగ్!

టీ-20 క్రికెట్లో అత్యంత వేగంగా 50 వికెట్లు పడగొట్టిన భారత పేస్ బౌలర్ ఘనతను అర్షదీప్ సింగ్ సొంతం చేసుకొన్నాడు. ఇప్పటి వరకూ యార్కర్లకింగ్ జస్ ప్రీత్ బుమ్రా పేరుతో ఉన్న రికార్డును తెరమరుగు చేశాడు.....

డబ్లిన్ వేదికగా ఐర్లాండ్ తో జరుగుతున్న తీన్మార్ టీ-20 సిరీస్ రెండోమ్యాచ్ లోనే భారత ఓపెనింగ్ బౌలర్ అర్షదీప్ సింగ్ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ప్రపంచ 12వ ర్యాంకర్ ఐర్లాండ్ పై 2 వికెట్లు పడగొట్టడం ద్వారా టీ-20 ఫార్మాట్లో అత్యంత వేగంగా 50 వికెట్ల మైలురాయిని చేరిన భారత పేస్ బౌలర్ గా అర్షదీప్ నిలిచాడు.

33 మ్యాచ్ ల్లో 50 వికెట్లు.....

గత జులైలో సౌతాంప్టన్ వేదికగా జరిగిన టీ-20 మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ అరంగేట్రం చేసిన అర్షదీప్ సింగ్ ప్రస్తుత ఐర్లాండ్ సిరీస్ లోని రెండో మ్యాచ్ వరకూ మొత్తం 33 టీ-20లు ఆడి 50 వికెట్ల మైలురాయిని చేరుకోగలిగాడు.

భారత సీనియర్ ఫాస్ట్ బౌలర్ జస్ ప్రీత్ బుమ్రా 41 మ్యాచ్ ల్లో 50 వికెట్లు పడగొట్టిన రికార్డును అర్షదీప్ సింగ్ కేవలం 33 మ్యాచ్ ల్లోనే సాధించడం ద్వారా సరికొత్త రికార్డు నమోదు చేశాడు.

24 సంవత్సరాల అర్షదీప్ సింగ్ గతేడాది జరిగిన టీ-20 ప్రపంచకప్ లో భారత్ తరపున మొత్తం ఆరుమ్యాచ్ లు ఆడటం ద్వారా విజయవంతమైన భారత బౌలర్ గా నిలిచాడు.

టీ-20 అంతర్జాతీయ మ్యాచ్ ల్లో అత్యధికంగా 96 వికెట్లు పడగొట్టడం ద్వారా లెగ్ స్పిన్నర్ యజువేంద్ర చహాల్ నంబర్ వన్ బౌలర్ గా కొనసాగుతున్నాడు. చహాల్ 34 మ్యాచ్ ల్లో 50 వికెట్లు పడగొడితే..పేస్ బౌలర్ అర్షదీప్ సింగ్ 33 మ్యాచ్ ల్లోనే ఈ ఘనత సాధించగలిగాడు.

అయితే..టీ-20ల్లో అత్యంతవేగంగా 50 వికెట్లు సాధించిన భారత బౌలర్ రికార్డు మాత్రం చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ పేరుతో ఉంది. కుల్దీప్ కేవలం 30 మ్యాచ్ ల్లోనే 50 వికెట్ల రికార్డు నమోదు చేశాడు.

అత్యంత వేగంగా 50 వికెట్లు పడగొట్టిన పేస్ బౌలర్ రికార్డును మాత్రం అర్షదీప్ సాధించగలిగాడు.

ఐర్లాండ్ తో జరుగుతున్న తీన్మార్ టీ-20 సిరీస్ లోని మొదటి రెండుమ్యాచ్ లు ముగిసే సమయానికే భారత్ 2-0తో సిరీస్ ఖాయం చేసుకోగలిగింది. వర్షంతో అర్థంతరంగా ముగిసిన తొలిపోరులో డక్ వర్త్ లూయిస్ విధానం ద్వారా 2 పరుగుల తేడాతో నెగ్గిన భారత్..సూపర్ సండే ఫైట్ గా జరిగిన రెండోమ్యాచ్ లో 33 పరుగుల విజయంతో సిరీస్ విజేతగా నిలిచింది.

ఈనెల 23న డబ్లిన్ వేదికగా జరిగే ఆఖరిమ్యాచ్ లో భారత్ తో ఐర్లాండ్ తలపడనుంది. భారత్ తరపున పలువురు యువఆటగాళ్లకు తుదిజట్టులో చోటు కల్పించే అవకాశం లేకపోలేదు.

First Published:  21 Aug 2023 8:45 PM IST
Next Story