Telugu Global
Sports

ఇంత విద్వేషమా ? ఒక్క క్యాచ్ మిస్ చేసినందుకు ఖాలిస్తానీ అయిపోయాడా ?

నిన్న ఇండియా, పాకిస్తాన్ మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్ లో ఒక క్యాచ్ జారవిడిచినందుకు క్రికెటర్ అర్షదీప్ సింగ్ పై కొందరు ఉన్మాదులు అనుచిత చర్యలకు పాల్పడుతున్నారు. ఆయన వికీ పీడియా పేజీని కూడా ఎడిట్ చేసి భారత్ అని ఉన్న చోట ఖాలిస్తాన్ అంటూ మార్చేశారు.

ఇంత విద్వేషమా ? ఒక్క క్యాచ్ మిస్ చేసినందుకు ఖాలిస్తానీ అయిపోయాడా ?
X

క్రికెట్ ను మతంలాగా చూసే భారత్ లో మతోన్మాదుల లాగానే 'క్రికెటోన్మాదులు' కూడా కొందరుంటారు. క్రికెట్ లో మన టీం ఓడిపోతే యుద్దంలో దేశం ఓడిపోయినంత రచ్చ చేస్తుంటారు. అందులోనూ పాకిస్తాన్ తో ఓడిపోతే వాళ్ళ ఆక్రోశానికి, ఆగ్రహానికి పట్టపగ్గాలుండవు. ఆటగాళ్ళను చంపుతామని బెదిరిస్తారు కొందరు. సోషల్ మీడియాలో బూతుల పంచాగం విప్పుతారు మరికొందరు.

పాపం ఇప్పుడు ఆ ఉన్మాదుల చేతిలో పడ్డాడు భారత్ ఆటగాడు అర్షదీప్ సింగ్. ఆసియాకప్ సూపర్-4లో పాకిస్థాన్ చేతిలో భారత్ ఓటమి పాలైన తర్వాత ఉన్మాదులు రెచ్చిపోయారు. ఆ మ్యాచ్ లో అర్షదీప్ చేతిలో ఓ క్యాచ్ మిస్ అయ్యింది. అది వాళ్ళ ఆగ్రహానికి కారణం.

అర్షదీప్ సింగ్ పట్ల చాలా దారుణంగా వ్యవహరిస్తున్నారు. అతనిపై దాడి చేస్తామని, చంపేస్తామని అరుస్తూ కొందరు బైకులపై తిరుగుతూ హల్ చల్ సృష్టించారు. మరి కొందరు అర్షదీప్ కు ఖాలిస్తానీ తీవ్ర వాదులతో సంబంధాలున్నాయని, సోషల్ మీడియాలో ప్రచారం లంఖించుకున్నారు. ఏకంగా ఆయన వికీపీడియా పేజీలో భారత్ అని ఉన్న చోట ఖాలిస్తాన్ అని ఎడిట్ చేశారు.

అయితే అర్షదీప్ కు విరాట్ కోహ్లీ తోపాటు తోటి ఆటగాళ్ళ మద్దతు లభించింది. అంతే కాదు సోషల్ మీడియాలో నెటిజనులు కూడా చాలా మందే ఆయనకు మద్దతుగా నిలబడ్డారు. ఆటను ఆటగా చూడకుండా ఒక యుద్దంలా, ఒక మతంలా చూడటంతోనే మూర్ఖత్వం మితిమీరుతోందని నెటిజనులు విమర్శలు గుప్పిస్తున్నారు.

మరో వైపు కేంద్ర ప్రభుత్వం కూడా అర్షదీప్ కు మద్దతుగా నిలబడింది. ఆయన వికీపీడియా పేజీని ఎడిట్ చేసి తప్పుడు సమాచారం ఇవ్వడం వల్ల మత సామరస్యం దెబ్బతింటుందని, అర్షదీప్ కు, అతని కుటుంబానికి కూడా ముప్పు ఏర్పడుతుందని కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. వికీ పీడియాలో ఎడిట్ చేసిన అంశంపై కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ వికీపీడియా భారత ఎగ్జిక్యూటివ్‌లకు

సమన్లు జారీ చేసింది. తప్పుడు సమాచారం ఎలా ప్రచురితమైందో వివరణ ఇవ్వాలని కోరింది. వికీ పీడియా కూడా వెంటనే అర్షదీప్ పేజీలో సమాచారాన్ని సరిచేసింది.

First Published:  5 Sept 2022 5:41 PM IST
Next Story